హైదరాబాద్:నిజామాబాద్ మాజీ ఎంపీ కేశిపల్లి గంగారెడ్డి (90) కన్నుమూశారు. మూడుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గంగారెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉదయం తుదిశ్వాస విడిచారు. గంగారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం, ఆవిర్భావంలో గంగారెడ్డి వెన్నంటి ఉన్నారంటూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌లు కూడా గంగారెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపారు.
గంగారెడ్డి పదో లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి 1991-96లో మొదటిసారి ఎంపీగా గెలుపొందారు. అనంతరం 11వ లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ లభించలేదు. తిరిగి 12వ లోక్‌సభకు టీడీపీ తరపున గెలుపొందారు. ఆఖరిసారి 1999-2014 లో 13వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్‌రెడ్డిపై గెలుపొందారు.