ఎక్సైజ్ అధికారులపై దాడి
నిందితుడిపై కేసునమోదు
జడ్చర్ల: విధుల్లో భాగంగా తనిఖీల కోసం వెళ్లిన ఎక్సైజ్ అధికారులపై ఓ వ్యక్తి దాడిచేశాడు. ఈ సంఘటన గురువారం బాదేపల్లి పాతబజార్‌లో చోటుచేసుకుంది. బాధిత అధికారుల కథనం మేరకు.. షాద్‌నగర్ మండలం చౌలపల్లి గ్రామ పంచాయతీ అనుబంధగ్రామం పీర్లగూడలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించగా నర్సిములు అనే వ్యక్తి ఇంట్లో 10కేజీల ఆల్ఫాజోలం పట్టుబడింది.
దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తనకు బాదేపల్లికి చెందిన రాఘవేందర్‌గౌడ్ అనే వ్యక్తి ఈ మత్తు పదార్థారాన్ని విక్రయించాడని, తామిద్దరం కలిసి ఆల్ఫాజోలం వ్యాపారం చేస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఏఈఎస్ నవీన్‌కుమార్ తమ బృందంతో కలిసి బాదేపల్లిలోని రాఘవేందర్‌గౌడ్ ఇంటికి చేరుకున్నారు. ఇంటిని సోదాచేసేందుకు యత్నించగా రాఘవేందర్‌గౌడ్ తండ్రి సత్యనారాయణగౌడ్ ఇంట్లోకి అధికారులను రాకుండా అడ్డుకున్నారు.
తమ వద్ద ఏమీ లేదంటూ వారిని దూషిస్తూ దాడికి దిగాడు. పెనుగులాటలో ఏఈఎస్, సీఐల చొక్కాలు చిరిగాయి. దీంతో ఎక్సైజ్ అధికారులు వారిని వాహనంలో స్థానిక ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. స్టేషన్‌లో కూడా పెద్దగా అరుపులు, కేకలు వేసి అధికారులతో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ సిబ్బంది సత్యనారాయణపై చేయిచేసుకున్నారు. దీంతో స్థానికులు అక్కడ భారీసంఖ్యలో పోగయ్యారు. తమ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దాడికి దిగినవారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులు జడ్చర్ల సీఐకి ఫిర్యాదుచేశారు.
నిందితుడిపై కేసు
ఏఈఎస్ నవీన్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. ఆల్ఫాజోలం అమ్ముతున్నారనే పక్కాసమాచారంతో ఇంటిని సోదా చేసేందుకు వెళ్లగా సత్యనారాయణగౌడ్ తమ విధులకు ఆటంకం కలిగించి దాడిచేశాడని తెలిపారు. తనతో పాటు సీఐలు ప్రవీణ్‌కుమార్, శంకర్‌నాయక్ తదితర సిబ్బందిపై చొక్కాలు పట్టుకుని లాగారని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ ఏడాది మే నెలలో ఆల్ఫాజోలం పట్టుబడిన కేసులో నర్సింహులుగౌడ్, రాఘవేందర్‌గౌడ్ ప్రధాన నిందితులుగా ఉన్నారని గుర్తుచేశారు. కాగా, పోలీస్‌స్టేషన్‌లో కళ్లుతిరిగి పడిపోయిన నిందితుడు సత్యనారాయణగౌడ్‌ను చికిత్సకోసం బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు సత్యనారాయణగౌడ్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు జడ్చర్ల సీఐ జంగయ్య తెలిపారు.