► పారబోసిన కల్తీకల్లు, శాంపిల్ సేకరణ
► ఎస్‌టీఎఫ్ అదుపులో ఇద్దరు నిందితులు
కల్వకుర్తి : రాష్ట్ర ఎక్సైజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి రెండు చోట్ల కల్తీకల్లును పారబోశారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజులుగా కల్వకుర్తి పట్టణంలో జోరుగా కల్తీకల్లు విక్రయిస్తున్నట్టు స్థానికులు కొందరు ఇటీవల ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఎస్‌టీఎఫ్ ఏఈఎస్ నాగేంద్రరెడ్డి ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు.
స్థానిక హనుమాన్‌నగర్‌లోని ఓ దుకాణంపై దాడి చేసి కల్లును పరీక్షించారు. అందులో క్లోరల్‌హైడ్రేట్‌తోపాటు ఇతర మత్తు పదార్థాలను మిళితం చేసినట్టు గుర్తించి పారబోశారు. అదే కాలనీలోని మరో దుకాణంపై దాడి చేసి కల్లును పరీక్షించి శాంపిల్ తీసి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. వాటి నిర్వాహకులు యాదయ్యగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌లను అరెస్ట్ చేసి స్థానిక ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్‌టీఎఫ్ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ లింగయ్య పాల్గొన్నారు.
ఎక్సైజ్ అధికారుల దాడులు
Published Sat, Jun 4 2016 1:58 AM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM
Advertisement
Advertisement