షణ్ముగప్రియ, వీరప్పన్ (ఫైల్)
కోయంబత్తూరు: తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని కార్యాలయం ఆదేశించి మూడేళ్లు గడిచినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు షణ్ముగప్రియ. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని తమిళనాడు ప్రభుత్వానికి పీఎంఓ సూచించినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. రాష్ట్రాన్ని వణికించిన ఘరానా స్మగ్లర్‌ను పట్టించినందుకు తనకు దక్కిన గౌరవం ఇదేనా అంటూ వాపోయారు.
ఇంతకీ ఎవరీ షణ్ముగప్రియ?
మూడు (కన్నడ, తమిళ, కేరళ) రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను మట్టుబెట్టడంలో కీలకపాత్ర పోషించారీమె. కోయంబత్తూరులోని వాడవల్లి ప్రాంతానికి చెందిన షణ్ముగ ప్రియ.. వీరప్పన్‌కు సంబంధించిన కీలక సమాచారం అందించి పోలీసులకు సహాయపడ్డారు. వీరప్పన్‌ను పట్టుకునే ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు బృందానికి సహకరించేందుకు 2004లో ఆమెను ఉన్నతాధికారి శాంతమరై కన్నన్ నియమించారు. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మికి నాలుగు నెలలు తన ఇంటిని అద్దెకిచ్చి సన్నిహితురాలిగా మెలిగారు. అతడికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టి పోలీసులకు అందించారు. నీలగిరి కొండల్లో భార్యను కలుసుకునేందుకు వీరప్పన్ వస్తున్నాడన్న సమాచారాన్ని పోలీసులకు చెప్పింది షణ్ముగప్రియ కావడం గమనార్హం. అయితే అప్పుడు వీరప్పన్‌ను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు.
చివరకు బాధే మిగిలింది..
‘వీరప్పన్ అనారోగ్యం, అతడి చూపు మందగించిన విషయం, అడవుల్లో అతడు ఎక్కడ దాక్కున్నాడనే దాని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాను. నా జీవితాన్ని ఫణంగా పెట్టి పోలీసులకు సహకరించాను. ఇన్ని చేసినా చివరకు నాకు బాధే మిగిలింది. చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరూ ముందుకు రాని సమయంలో ధైర్యంగా ముందుకు వచ్చి ఈ ఆపరేషన్‌లో పాలు పంచుకున్నాను. ఆ సమయంలో ఎన్నో బాధలు, సమస్యలు ఎదురైనప్పటికీ వెనుకంజ వేయకుండా వీరప్పన్ ప్రతి కదలికపై పోలీసులకు సమాచారం అందించాను. రివార్డు సంగతి ప్రక్కన పెడితే కనీసం ప్రభుత్వం, పోలీసు విభాగం నుంచి గుర్తింపు కూడా దక్కలేద’ని షణ్ముగప్రియ వాపోయారు. 2004, అక్టోబర్ 18న వీరప్పన్, అతడి నలుగురు అనుచరులను ఎస్టీఎఫ్ హతమార్చింది. ఈ ఆపరేషన్‌లో తమకు సహకరించిన షణ్ముగప్రియకు తగినవిధంగా రివార్డులిస్తామని ఎస్టీఎఫ్ అప్పట్లో ప్రకటించింది. పదేళ్లు గడిచినా తనను పట్టించుకోకపోవడంతో 2015లో ప్రధాని కార్యాలయానికి ఆమె లేఖ రాశారు. షణ్ముగ ప్రియకు న్యాయం చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించినా ఆమెకు ప్రతిఫలం మాత్రం దక్కలేదు.
నేనేమి చెప్పలేను: కన్నన్
ఈ విషయంపై శాంతమరై కన్నన్ మాట్లాడుతూ... ‘వీరప్పన్‌ను పట్టుకునేందుకు చాలా ఆపరేషన్లు నిర్వహించాం. కానీ అవన్నీ ఫలించలేదు. ఇలాంటి వాటిలో షణ్ముగప్రియ కూడా పాల్గొన్నారు. వీరప్పన్‌కు సంబంధించిన విలువైన సమాచారం ఆమె అందించారు. అయితే వీరప్పన్‌ను హతమార్చిన ఆపరేషన్‌లో ఉన్న వారికి మాత్రమే ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించాం. షణ్ముగప్రియ విషయంలో నేనేమి చెప్పలేను’ అని అన్నారు. ఈ వ్యవహారంపై డీజీపీ టీకే రాజేంద్రన్ ఇంకా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment