వైజ్ఞానిక వేగుచుక్కలు – 20
సమాజం దూరం పెట్టిన దేవదాసీ కుటుంబంలో పుట్టిన ముత్తులక్ష్మి రెడ్డి (muthulakshmi reddy) చిన్నప్పటి నుంచి ఆ వివక్షను చూస్తూ పోరాటశీలిగా మారారు. ఆమె ఎన్నో రకాలుగా తొలి యోధ: పురుషుల కళాశాలలో చేరిన మొదటి స్త్రీ, మద్రాసు ప్రభుత్వ వైద్యశాలలో మొదటి సర్జన్, మదరాసు కార్పొరేషన్‌లో మొదటి మహిళా కౌన్సిలర్, మద్రాసు (Madras) లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి మొదటి ఉపాధ్యక్షురాలు; మద్రాసులో మొట్టమొదటి పిల్లల ఆసుపత్రినీ, దక్షిణాదిలో తొలి క్యాన్సర్ ఆసుపత్రినీ ప్రారంభించారు. ఆమె సేవలకు గాను 1956లో పద్మభూషణ్(Padma Bhushan) పురస్కారాన్ని అందుకున్నారు.
1886 జూలై 30న ముత్తులక్ష్మి తమిళ ప్రాంతమైన పుదుక్కోటలో జన్మించారు. తండ్రి మహారాజా కళాశాలలో ప్రధానోపాధ్యాయులు కాగా, తల్లి దేవదాసీ నేపథ్యం గల మహిళ. బాలికలకు తమిళంలో మాత్రమే బోధించే పాఠశాలను కాదని, బాలుర పాఠశాలలో పోరాడి ప్రవేశం పొందింది చిన్నతనంలోనే! 1902లో వందమంది మెట్రిక్యులేషన్ పరీక్షకు హాజరవ్వగా కేవలం పది మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అందులో ఒకే ఒక బాలిక ముత్తులక్ష్మి!
కూతురి మనోగత మెరిగిన తండ్రి, పురుషులను మాత్రమే చేర్చుకునే మహారాజా కళాశాలలో దరఖాస్తు చేసి పుదుక్కోట రాజు మార్తాండ భైరవ తొండమాన్ సాయంతో ప్రవేశం సాధించారు. చుట్టూ మూసి ఉన్న కారులో ఆమె ప్రయాణించేది. మగపిల్లలకు కనిపించకుండా, ఉపాధ్యాయులకు మాత్రమే కనిపించేలా ప్రత్యేక ఏర్పాటు చేసి ఆమెను తరగతి గదిలో కూర్చోబెట్టేవారు. ఆ తర్వాత మహారాజా ఆర్థిక సాయంతో మద్రాసు వైద్యకళాశాలలో చేరడానికి 1907లో తండ్రితో కలిసి మద్రాసు వెళ్లారు.
‘ట్రిప్లికేన్ దాదా’గా ప్రాచుర్యం పొందిన డాక్టర్ ఎంసీ నంజుండరావు ఈ తండ్రీ కూతుళ్ళకు పరిచయమయ్యారు. ఆ ఇంటిలోనే సరోజినీనాయుడి పరిచయమూ కలిగింది. అలాగే మహాత్మా గాంధీ, అనిబిసెంట్ ప్రభావాలకీ లోనయ్యారు. మద్రాసు మెడికల్ కళాశాలలో ముత్తులక్ష్మి తొలి మహిళా విద్యార్థి కనుక రకరకాల వివక్ష ఉండేది. అయినా 1912లో బ్యాచిలర్ మెడిసిన్ (ఎంబీ) డిగ్రీని పొందారు. అదే ఏడాది ఎగ్మూర్ లోని గవర్నమెంట్ చిల్డ్రన్ హాస్పిటల్‌లో హౌస్ సర్జన్‌గా ఉద్యోగం జీవితం ప్రారంభించారు.
పురుషాధిక్య సమాజాన్ని బాగా చవిచూసిన ముత్తులక్ష్మి వివాహం లేకుండా ఒంటరిగా జీవించాలనుకున్నారు. అయితే నమ్మకం కలిగించిన డాక్టర్ డీటీ సుందర రెడ్డిని 1914లో తన 28వ ఏట వివాహం చేసుకున్నారు. ఆమె ప్రైవేటు ప్రాక్టీస్‌తో పాటు, అవసరమైన ఇతర ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేసేవారు. బాలికల రక్షణ, విద్య; సురక్షితమైన ప్రసవం, మంచి ఆహారం, మహిళలకు ఉన్నత విద్య, సాంఘిక సంస్కరణ వంటివి ఆమెకు ఇష్టమైన విషయాలు. బాల్యవివాహాల నిర్మూలనకు పెద్ద ఎత్తున కృషి చేశారు.
చదవండి: బామ్మకు స్వీట్ సర్‌ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్
1926–30 మధ్యకాలంలో ఆమె విధాన సభకు ఉపాధ్యక్షులుగా సేవలందించారు. బాలికల వివాహ వయస్సు 16 సంవత్సరాలుగా ఉండాలని శాసన సభలో చర్చించడమే కాకుండా, 1928లో మహాత్మాగాంధీకి మూడు పేజీల ఉత్తరం రాశారు. దీనితో ఏకీభవిస్తూ గాంధీజీ తన ‘యంగ్ ఇండియా’ పత్రికలో వ్యాసం రాశారు. దేవదాసీ వ్యవస్థ అంతమొందాలని చట్టసభలలో పోరాడారు. ఈ పోరాటంలో తారసపడిన ప్రత్యర్థుల్లో కామరాజ్‌కు రాజకీయ గురువైన సత్యమూర్తి ఒకరు.
చదవండి: ట్రంప్ విందుకి కాంచీపురం చీరకట్టులో నీతా అంబానీ
బాలికలకు, మహిళలకు 1931లో అనాథ శరణాలయం స్థాపించారు. అదే ‘అవ్వై హోమ్ అండ్ ఆర్ఫనేజ్’. తనకెంతో తోడ్పాటుగా ఉన్న చెల్లెలు 1923లో క్యాన్సర్‌తో మరణించడం ముత్తులక్ష్మికి పెద్ద విఘాతం. క్యాన్సర్ చికిత్సాలయం కోసం ఆమె ఆనాడే కంకణం కట్టుకున్నారు. తన కారును అమ్మి వేసి క్యాన్సర్ వ్యాధి అధ్యయనం కోసం కుమారుణ్ణి అమెరికా పంపారు. ఎంతోమంది నుంచి విరా ళాలు సేకరించి 1952లో దక్షిణ భారతదేశంలోనే తొలి క్యాన్సర్ ఆసుపత్రిని అడయార్‌లో అప్పటి ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. 1954 నుంచి సేవలు ప్రారంభించిన ఈ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ నేటికీ గొప్పగా సేవలందిస్తోంది. 1968 జూలై 22న కన్నుమూసిన ముత్తు లక్ష్మి సేవలు చిరస్మరణీయం.
-డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి
Comments
Please login to add a commentAdd a comment