మాట్లాడుతున్న ముత్తులక్ష్మి
టీనగర్: తన భర్త వీరప్పన్ బతికి ఉండి ఉంటే కావేరి జలాల విషయంలో కర్ణాటక తోక తిప్పి ఉండేదా అని ముత్తులక్ష్మి వీరప్పన్ శుక్రవారం వ్యాఖ్యానించారు. తంజావూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ కావేరి మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ మన్‌కాకుం వీరతమిళర్ పేరమైప్పు ఆధ్వర్యంలో తంజావూరు జిల్లా కల్లనైలో ఈ నెల 30న భారీ ర్యాలీ జరిపేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో వ్యవసాయ సంఘాల అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ధీరన్, ప్రస్తుత ఎమ్మెల్యేలు తనియరసు, కరుణాస్, తమీమున్ అన్సారీ పాల్గొననున్నారు. తమిళనాడు నుంచి కర్ణాటకకు విద్యుత్ సరఫరా చేయకుండా నిలుపుదల చేయాలని కోరుతూ ఎన్నెల్సీ సంస్థ చైర్మన్ శరత్‌కుమార్‌ను కలువనున్నట్లు తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పును గౌరవించకుండా రాష్ట్రానికి కావేరి జలాలను ఇవ్వకుండా కర్ణాటక వంచిస్తోందని ఆరోపించారు. కర్ణాటకకు విద్యుత్‌ను అందజేయకుండా ఆయనపై ఒత్తిడి తేనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన భర్త బతికి ఉంటే ఒక్క క్యాసెట్ చాలని వ్యాఖ్యానించారు. గతంలో కర్ణాటక తమిళనాడుకు నీళ్లివ్వకుండా మారాం చేసిన సందర్భాల్లో తన భర్త వినూత్న పంథాను అనుసరించడం జరిగిందని, ఈ విషయం కొందరికే తెలుసని వివరించారు. రూ. 30 పెట్టి ఒక ఆడియో కేసెట్ కొనుగోలు చేసి, అందులో తన భర్త వీరప్పన్ కర్ణాటకకు హెచ్చరిక పంపేవారని, మరుక్షణమే నీళ్లు తమిళనాడుకు వచ్చిన సందర్భాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇప్పుడు తన భర్త బతికి ఉంటే కర్ణాటక చర్యలను ఎండగట్టి తమిళనాడులోకి నీళ్లు రప్పించి ఉండేవారని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక స్పందించకుండా ఉండి ఉంటే కేఆర్‌ఎస్ డ్యాంను బాంబులతో పేల్చి ఉండేవారని హెచ్చరించారు. సుప్రీం కోర్టు తీర్పును అమలుపరచాల్సిన బాధ్యత కేంద్ర, కర్ణాటక ప్రభుత్వాలపై ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment