రాజశేఖర్ మృతదేహం (ఫైల్)
ఈ చిత్రంలో నిర్జీవంగా పడి ఉన్న వ్యక్తి రాజశేఖర్. చిత్తూరు పోలీసువిభాగంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ (ఎస్టీఎఫ్)లో పని చేసేవాడు. పెళ్లి చూపులకు వెళ్లేందుకు సెలవు అడిగితే ఉన్నతాధికారులు నిరాకరించారు. సెలవు అడిగిన ప్రతిసారీ ఇతనికి నిరాశే ఎదురయ్యేది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురై గతేడాది ఏప్రిల్ 20న ఎస్పీ క్యాంపు కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చిత్తూరు అర్బన్: బహుశా ఈ ఒక్క ఉదాహరణ చాలనుకుంటా.. విధి నిర్వహణలో సగటు పోలీసు పడుతున్న ఒత్తిడి భారం.. జిల్లాలో పోలీసుల సంఖ్య..24 గంటల్లో ఎప్పుడు పిలిచినా పరుగెత్తాల్సిన పోలీసుశాఖలో సెలవు ఇవ్వకుంటే ఓ వ్యక్తి మానసిన పరిస్థితి ఎలా ఉంటుందనడానికి రాజశేఖర్ మరణమే సాక్ష్యం. సెలవు.. ప్రభుత్వ ఉద్యోగి హక్కు. కానీ అత్యవసర సేవల్లాంటి పోలీసు విభాగంలో సెలవు పేరు ఎత్తే అర్హత ఏ ఒక్కరికీ ఉండదు. ఎండలో నిలబడి ట్రాఫిక్ విధులు, అడవుల్లో కూంబింగ్, ఇతర రాష్ట్రాల్లో ఎర్రచందనం స్మగ్లర్ల వేట, ఆర్‌ఐల వద్ద ఆర్డర్లీ డ్యూటీలు.. ఇన్నింటి నుంచి కాస్త ఉపసమనం ఇచ్చే వారంతపు సెలవు జిల్లాలోని ఏ ఒక్క కానిస్టేబుల్‌కు అమలు కావడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పోలీసుశాఖలో వారాంతపు సెలవు (వీక్లీ ఆఫ్)ను తప్పనిసరి చేస్తానంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటివ్వడం ఆ శాఖలో సంతోషాన్ని నింపిందనే చెప్పాలి.
సమయం ఎక్కడ..?
పోలీసుశాఖ అత్యవసర విభాగమే అయినప్పటికీ వారాంతపు సెలవు ఇవ్వకపోవడంతో పోలీసులు, వారి కుటుంబాలు నలిగిపోతున్నాయి. వేళకాని వేళల్లో విధులు నిర్వహిస్తూ నలిగిపోతున్నారు. దీంతో వ్యక్తిగత, కుటుంబ జీవితానికి దూరమైపోతున్నారు. ప్రధానంగా ఇంట్లో తల్లిదండ్రులు, భార్యా పిల్లలతో గడపలేని పరిస్థితి. పిల్లలు ఏం చదువుతున్నారు ? ఏం చేస్తున్నారు? వారి ఇష్టాఇష్టాలు తెలుసుకునే సమయం కూడా చాలామందికి దొరకడం లేదు. కొన్నిసార్లు పనిలో అధికారుల నుంచి ఎదురయ్యే చీవాట్లు, చీత్కారాలను ఇంట్లో వారిపై చూపించేవాళ్లూ ఉన్నారు. తండ్రి కుటుంబంపై దృష్టి పెట్టకపోవడంతో చెడుదారిను ఎంచుకునే వాళ్లు ఉన్నారు. చిత్తూరులో ఓ ఏఎస్‌ఐ కొడుకు తొమ్మిదో తరగతిలోనే తోటి విద్యార్థిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో అతనిపై కేసు నమోదు చేసి జువైనెల్ హోమ్‌కు తరలించడమే ఇందుకు నిదర్శనం.
పట్టించుకునే వారేరీ?
జిల్లాలో తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో పోలీసుల బాగోగుల కోసం సంక్షేమ సంఘాలున్నాయి. పోలీసుల కష్టాలు, ఇబ్బందులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికే సంక్షేమ సంఘాన్ని ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైన అధికారుల్లో చాలా మంది డ్యూటీలకు వెళ్లకుండా.. ఇంకా చెప్పాలంటే అసలు యూనిఫాం తొడగకుండా ఉన్నతాధికారుల అడుగులకు మడుగులొత్తుతుంటారు. ప్రభుత్వ పెద్దలు చెప్పేట్లు నడుచుకుంటూ వేలాది మంది పోలీసుల మనోభావాలను తాకట్టు పెడుతుంటారు. అధికారపార్టీ నేతలు పోలీసులపై దౌర్జన్యం చేసినా ఖండించని నేతలు.. ప్రతిపక్ష నాయకులు చిన్నమాట అంటే మాత్రం మీడియా ఎదుటకొచ్చి విమర్శలు గుప్పించిన ఘటనలు చాలానే ఉన్నాయి. జిల్లాలో పోలీసులకు ట్రావెల్ అలవెన్స్ ఇచ్చి ఆర్నెళ్లవుతున్నా ఏ యూనియన్ ప్రశ్నించదు. స్పెషల్ పార్టీ పోలీసులకు ఇతర ప్రాంతాలకు, దూరంగా డ్యూటీలు వేస్తే ఆరోగ్య సమస్యలున్న వారికి డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వండంటూ అధికారులను అడిగే ధైర్యం ఎవరికీ ఉండదు.
వైఎస్‌జగన్ హామీతో ఆశలు..
పోలీసుశాఖలో సిబ్బంది పడుతున్న కష్టాలను ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించారు. ‘పోలీసుల కష్టాలు నే విన్నాను.. మీకు తోడుగా నేనుంటాను. మన ప్రభుత్వం రాగానే పోలీసుశాఖలో వారాంతపు సెలవు(వీక్లీఆఫ్)ను కచ్చితంగా ఇస్తాను. హోంగార్డులకు సైతం ఇది వర్తింపజేస్తాం’ అంటూ ఇచ్చిన హామీ పోలీసుల్లో కొత్త ఆశలను చిగురింపచేస్తోంది.
జీవితాంతం రుణపడి ఉంటారు
వైఎస్‌జగన్ ఇచ్చిన హామీ అమల్లోకి వస్తే బతికున్నంత వరకు ఏ ఒక్క పోలీసు మర్చిపోరు. జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఏళ్ల తరబడి ఈ శాఖలో డ్యూటీలు చేస్తూ కుటుంబాలకు దూరమైపోయాం. పిల్లల బాగోగులు చూసుకునే టైం ఉండడం లేదు. తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగలేకుంటే ప్రశాంతత లేకుండా పోతోంది. వీక్లీ ఆఫ్ అమలు చేస్తే మాత్రం ప్రతి పోలీసు కుటుంబం జగన్‌కు రుణపడి ఉంటుంది.
– కేఎన్ మురళి, జిల్లా పోలీసు సంక్షేమ సంఘ మాజీ అధ్యక్షుడు, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment