స్ట్రాంగ్ రూమ్ వద్ద పహారా
సాక్షి, అమరావతి: ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 68 స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు పహారా కాస్తాయని.. మిగిలిన ఆవరణను రాష్ట్ర పోలీసు బలగాలు పర్యవేక్షిస్తాయని తెలిపింది. స్ట్రాంగ్ రూమ్‌లకు ఉన్న అన్ని ప్రవేశ ద్వారాలకు సీల్ వేసినట్లు వెల్లడించింది. అలాగే అన్ని ద్వారాలను సీసీ కెమెరాల ద్వారా 24 గంటలూ పర్యవేక్షించేందుకు ప్రతి స్ట్రాంగ్ రూమ్ పక్కన ఒక సీనియర్ అధికారి, గెజిటెడ్ అధికారి నేతృత్వంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వివరించింది.
స్ట్రాంగ్ రూమ్‌లకు రెండంచెల లాకింగ్ వ్యవస్థ ఉంటుందని పేర్కొంది. ద్వితీయ భద్రతా వలయం దాటుకొని లోపలికి వచ్చే వారి పేర్లు, తేదీ, సమయం సీపీఎఫ్ లాగ్‌బుక్‌లో నమోదు చేస్తారని తెలిపింది. ఈ నిబంధన అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసు సూపరింటెండెంట్‌లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు రోజున స్ట్రాంగ్ రూమ్‌ను అభ్యర్థులు, వారి ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారి, పరిశీలకుడి సమక్షంలో వీడియో చిత్రీకరణలో తెరుస్తారని వివరించింది. ఓట్ల లెక్కింపు కేంద్రానికి ఈవీఎంలను తీసుకెళ్లే వరకు వీడియో తీస్తారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment