వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మీరు హార్ట్ హీరోలు అవొచ్చు. ఇందుకు కొండలెత్తాల్సిన అవసరమేమీ లేదు. మీ వయసు ఎంతైనా.. రక్తపోటు పరీక్ష చేయించుకుంటే చాలు. మీరో బుల్లి హార్ట్ హీరో. దీంతోపాటు ధూమపానం లాంటి అలవాట్లను తక్షణమే మానేసి, ఆరోగ్యకరమైన తిండి తినడం అలవాటు చేసుకుంటే 35 ఎంఎం హార్ట్ హీరో అయిపోవచ్చు. వీటన్నింటితోపాటు రోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేయడం మొదలుపెట్టారనుకోండి. సూపర్ హార్ట్ హీరో మీరే! మీరొక్కరే ఆరోగ్యంగా మారిపోతే మజా ఏముంటుంది చెప్పండి. అందుకే మీరు ఎలా హార్ట్ హీరో అయ్యారో చుట్టుపక్కల వాళ్లకూ చెప్పండి.
వీలైతే వరల్డ్‌హార్ట్‌డే. ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓ పోస్టర్ సిద్ధం చేయండి. పది మందికీ తెలిసేలా ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఓ సెల్ఫీ కూడా పడేయండి. చివరగా ఒక్క మాట హీరోయిజం ఒకట్రెండు రోజులకు మాత్రమే పరిమితం చేయొద్దు. మీ గుండెను భద్రంగా ఉంచే పనులు జీవితాంతం చేస్తూనే ఉండండి. ఇంకో ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే... మీకిష్టమైన వారిని రోజుకు ఒక్కసారి హత్తుకుంటే చాలు.. ఆక్సిటోసిన్ అనే రసాయనం విడుదలై గుండె జబ్బులు రాకుండా చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఆక్సిటోసిన్ కణజాలం విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది కాబట్టి గుండెకు అత్యంత అరుదైన పరిస్థితుల్లో మాత్రమే కేన్సర్ సోకుతుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment