Heart Health Awareness
-
మీరు హార్ట్ హీరోలు అవొచ్చు
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మీరు హార్ట్ హీరోలు అవొచ్చు. ఇందుకు కొండలెత్తాల్సిన అవసరమేమీ లేదు. మీ వయసు ఎంతైనా.. రక్తపోటు పరీక్ష చేయించుకుంటే చాలు. మీరో బుల్లి హార్ట్ హీరో. దీంతోపాటు ధూమపానం లాంటి అలవాట్లను తక్షణమే మానేసి, ఆరోగ్యకరమైన తిండి తినడం అలవాటు చేసుకుంటే 35 ఎంఎం హార్ట్ హీరో అయిపోవచ్చు. వీటన్నింటితోపాటు రోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేయడం మొదలుపెట్టారనుకోండి. సూపర్ హార్ట్ హీరో మీరే! మీరొక్కరే ఆరోగ్యంగా మారిపోతే మజా ఏముంటుంది చెప్పండి. అందుకే మీరు ఎలా హార్ట్ హీరో అయ్యారో చుట్టుపక్కల వాళ్లకూ చెప్పండి. వీలైతే వరల్డ్హార్ట్డే. ఓఆర్జీ వెబ్సైట్లోకి వెళ్లి ఓ పోస్టర్ సిద్ధం చేయండి. పది మందికీ తెలిసేలా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఓ సెల్ఫీ కూడా పడేయండి. చివరగా ఒక్క మాట హీరోయిజం ఒకట్రెండు రోజులకు మాత్రమే పరిమితం చేయొద్దు. మీ గుండెను భద్రంగా ఉంచే పనులు జీవితాంతం చేస్తూనే ఉండండి. ఇంకో ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే... మీకిష్టమైన వారిని రోజుకు ఒక్కసారి హత్తుకుంటే చాలు.. ఆక్సిటోసిన్ అనే రసాయనం విడుదలై గుండె జబ్బులు రాకుండా చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఆక్సిటోసిన్ కణజాలం విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది కాబట్టి గుండెకు అత్యంత అరుదైన పరిస్థితుల్లో మాత్రమే కేన్సర్ సోకుతుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఈ పదితో గుండె పదిలం
సాక్షి,హైదరాబాద్: మనం ఆహారం తీసుకునే ముందు అవి తీసుకుంటే లావెక్కుతామా, స్లిమ్ అవుతామా అనే చూస్తాం కానీ..శరీర అవయవాలు ముఖ్యంగా గుండెకు సంబంధించి మనం తీసుకునే ఆహారం ఎలాంటి ప్రభావం చూపుతుందని మాత్రం ఆలోచించం. గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే ఈ పది ఆహారపదార్ధాలను మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం మన వంటింట్లో అందుబాటులో ఉండే ఈ పదర్ధాలను డైట్లో తీసుకుంటే ఆరోగ్యకరమైన గుండె మన సొంతమంటున్నారు నిపుణులు. మరి ఆ టాప్ 10 సూపర్ ఫుడ్స్ ఏంటో చూద్దాం...వెల్లుల్లి మన హృదయానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. వీటిని రోజూ తీసుకుంటే గుండె రక్తకణాలు పలుచన కావడంతో పాటు రక్త ప్రసరణ సాఫీగా జరిగి బీపీని కంట్రోల్లో ఉంచేలా చేస్తుంది. శరీర వేడిని తగ్గిస్తూ తాపాన్ని తీర్చే వాటర్మెలన్ గుండె ఆరోగ్యానికి వరప్రసాదం. ఇది కొలెస్ర్టాల్ లెవెల్‌ను తగ్గించడంతో పాటు ముప్పుకారక ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. డిప్రెషన్‌ను దూరం చేసే డార్క్ చాక్లెట్ గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది.డార్క్ చాక్లెట్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంతో పాటు ఆరోగ్యకర స్థాయిలో కొలెస్ర్టాల్‌ను మెయింటెయిన్ చేస్తుంది. నిత్యం ఓట్‌తో చేసిన ఆహార పదార్ధాలతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.వీటిలో ఉండే ఫైబర్‌తో చెడు కొవ్వులు తగ్గడమే కాక జీర్ణశక్తి మెరుగవుతుంది. ఇక బాదం, జీడిపప్పు, కిస్మిస్ వంటి నట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ర్టాల్ తగ్గడంతో పాటు అవసరమైన విటమిన్ ఈ, ప్రొటీన్ ఫైబర్లు శరీరానికి అందుతాయి. ఇంకా గుండె ఆరోగ్యానికి గ్రీన్ టీ, ఫ్యాటీ ఫిష్, సినామన్‌లు ఎంతో ఉపకరిస్తాయని పలు అథ్యయనాలు వెల్లడించాయి. -
వాకింగ్@హార్ట్
వాకింగ్‌తోనే గుండె బలం పెరుగుతుందంటున్నారు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. శారీరక శ్రమ తగ్గడం, మారిన జీవన శైలి మనిషి గుండెను బలహీనంగా చేస్తున్నాయన్నారు. హెల్దీ ఫుడ్ హాబిట్స్, వాకింగ్ వల్ల వ్యాధులను అరికట్టవచ్చని చెప్పారు. ప్రపంచ హృద్రోగ దినోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ‘కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ‘హార్ట్ హెల్త్ అవేర్నెస్’ సైకిల్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. గుండె వ్యాధులపై ప్రజల్లో అవేర్నెస్ పెంచాలన్నారు.