విస్తరిస్తున్న విషసంస్కృతి..! | Expanding bad culture in hyderabad city | Sakshi
Sakshi News home page

విస్తరిస్తున్న విషసంస్కృతి..!

Published Fri, Sep 15 2017 1:33 AM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM

విస్తరిస్తున్న విషసంస్కృతి..!

విస్తరిస్తున్న విషసంస్కృతి..!

సిటీలో గెట్‌ టు గెదర్స్‌ పేరుతో విశృంఖలత్వం
స్టార్‌ హోటల్స్‌ వేదికగా విపరీత పోకడలు
నిబంధనలు పట్టించుకోని వ్యాపారులు
పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం
ఏదైనా ఉదంతం జరిగినప్పుడే హడావుడి


సాక్షి, హైదరాబాద్‌: తల్లిదండ్రుల అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం.. వ్యాపారుల స్వార్థం.. వెరసి నగరంలో చాపకింద నీరులా ఓ విషసంస్కృతి విస్తరిస్తోంది. ముక్కుపచ్చలారని మైనర్లు గెట్‌ టుగెదర్స్‌ పేరుతో విశృంఖలత్వానికి తెరతీస్తున్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో చోటు చేసుకున్న ఇంటర్‌ విద్యార్థిని చాందిని జైన్‌ హత్యోదంతం ఈ భయంకరమైన చీకటి కోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన దేవి ఉదంతం, జూలైలో చోటుచేసుకున్న రమ్య కుటుంబానికి జరిగిన ప్రమాదం సైతం అధికార యంత్రాంగంలో మార్పు తీసుకురాలేదు. ఫలితంగా ఇప్పటికీ అనేక పబ్స్, స్టార్‌ హోటల్స్‌ నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి.

మైనర్ల మూడు రోజుల ‘కలయిక’..
చాందినికి స్నేహితుడైన ఓ మైనర్‌ ఫేస్‌బుక్‌లో ‘నేషనల్‌ డిప్లొమాట్స్‌’పేరుతో పేజ్‌ ఏర్పాటు చేశారు. ఇందులోని సభ్యుల్లో 52 మంది గెట్‌ టుగెదర్‌కు ఏర్పాటు చేసుకున్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి 3 వరకు లక్డీకాపూల్‌లోని ఓ స్టార్‌ హోటల్‌ దీనికి వేదికైంది. మైనర్లకు నిర్వాహకులు 23 గదులు కేటాయించారు. పగలంతా అకడమిక్‌ సదస్సులు జరిగినా.. సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. పబ్స్, మద్యపానం, సోషలైజింగ్‌ పేరుతో బాలబాలికల గదుల మార్పిడి జరుగుతున్నా పట్టించుకునే నాథుడు కరవయ్యాడు. ఈ ‘గెట్‌ టుగెదర్‌’లో చాందినితో పాటు ఆమె కేసులో నిందితుడిగా ఉన్న బాలనేరగాడు సైతం పాల్గొన్నాడు. అక్కడ చాందినికి మరో మైనర్‌తో అయిన పరిచయమే పరిస్థితిని హత్య వరకు తీసుకెళ్లింది.

అప్పట్లో పోలీసులేమన్నారు?
పబ్స్‌తో పాటు మద్యం సరఫరా విషయంలో పక్కాగా వ్యవహరిస్తామని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. కొన్ని రోజుల పాటు తనిఖీలు, కేసుల నమోదు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ స్థాయి నిఘా, అధికారుల చర్యలూ అటకెక్కాయి. నగరంలోని పబ్స్‌లో రాత్రి 12 గంటల వరకు మ్యూజిక్‌ ప్లే చేయడానికి, తెల్లవారుజాము ఒంటి గంట వరకు పబ్‌ నడవడానికి అనుమతులు ఉన్నాయి. మైనర్లు వీటిలోకి వెళ్లడం, మద్యం సేవించడం జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. సంపన్నుల పిల్లలకు గాలం వేస్తున్న కొందరు దళారులు స్టార్‌ హోటల్స్, రిసార్ట్స్‌ వేదికగా ఇలాంటి విపరీత వ్యవహారాలను నిర్వహిస్తున్నా యంత్రాంగాల్లో స్పందన కరువైంది. చాందిని వ్యవహారం వెలుగులోకి వచ్చే వరకు అసలు ఇలాంటి సంస్కృతి ఉన్నట్లు పోలీసులు గుర్తించలేకపోవడం గమనార్హం. ఇలాంటి విషసంస్కృతికి చెక్‌ చెప్పాలంటూ పిల్లలపై తల్లిదండ్రుల అజమాయిషీ ఉండాలన్నది నిపుణుల మాట. వారి కదలికల్ని  కనిపెట్టడంతో పాటు వారి ఇంటర్నెట్, సోషల్‌మీడియా వ్యవహరాల్లో గోప్యత లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

రమ్య కుటుంబాన్ని చిదిమారిలా..
నగరానికి చెందిన విద్యార్థులు ఎన్‌.సూర్య, విష్ణు, శ్రావెల్, అశ్విన్, సాయి రమేశ్, అలెన్‌ జోసెఫ్‌ గత ఏడాది జూలై 1న బంజారాహిల్స్‌లోని సినీమ్యాక్స్‌లో సినిమా చూసేందుకు వెళ్లారు. విష్ణు తండ్రికి చెందిన ఐ10 కారులో అక్కడికి వెళ్లారు. సినిమా చూడటం సాధ్యపడక పోవడంతో మాల్‌లోనే ఉన్న టీజీఐ ఫ్రైడే బార్‌లో ఫూటుగా మద్యం తాగారు. బార్‌ నిర్వాహకులు నిబంధనలకు తిలోదకాలిస్తూ 21 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నా మద్యం సరఫరా చేశారు. తిరిగి వస్తున్న సమయంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని శ్రావెల్‌ వాహనాన్ని నడుపుతూ పంజగుట్ట శ్మశాన వాటిక వద్ద రమ్య కుటుంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి కారకుడ య్యాడు. ఈ ఘటన  మూడు ప్రాణాలు తీయడంతో పాటు నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఇలా..
జూబ్లీహిల్స్‌లోని డీకే నగర్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థిని కె.దేవి, మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీకి చెందిన సామ భరత్‌సింహారెడ్డి రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యారు. గత ఏడాది ఏప్రిల్‌ 30 రాత్రి గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఉన్న బీట్స్‌ పర్‌ మినిట్స్‌ పబ్‌లో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. దేవితో పాటు ఆమె స్నేహితురాలు సోనాలీ సైతం వెళ్లింది. పార్టీ పూరై్తన తర్వాత తెల్లవారుజామున 2.45 గంటలకు దేవి, భరత్, సోనాలీ పబ్‌ నుంచి బయటకు వచ్చారు. మద్యం మత్తులో దేవిని తీసుకుని కార్‌ డ్రైవ్‌ చేసుకుంటూ వస్తున్న భరత్‌ చేసిన ప్రమాదం ఆమె ప్రాణాలు తీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement