Chandini Jain
-
విస్తరిస్తున్న విషసంస్కృతి..!
♦ సిటీలో గెట్ టు గెదర్స్ పేరుతో విశృంఖలత్వం ♦ స్టార్ హోటల్స్ వేదికగా విపరీత పోకడలు ♦ నిబంధనలు పట్టించుకోని వ్యాపారులు ♦ పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం ♦ ఏదైనా ఉదంతం జరిగినప్పుడే హడావుడి సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రుల అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం.. వ్యాపారుల స్వార్థం.. వెరసి నగరంలో చాపకింద నీరులా ఓ విషసంస్కృతి విస్తరిస్తోంది. ముక్కుపచ్చలారని మైనర్లు గెట్ టుగెదర్స్ పేరుతో విశృంఖలత్వానికి తెరతీస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్న ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్యోదంతం ఈ భయంకరమైన చీకటి కోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన దేవి ఉదంతం, జూలైలో చోటుచేసుకున్న రమ్య కుటుంబానికి జరిగిన ప్రమాదం సైతం అధికార యంత్రాంగంలో మార్పు తీసుకురాలేదు. ఫలితంగా ఇప్పటికీ అనేక పబ్స్, స్టార్ హోటల్స్ నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. మైనర్ల మూడు రోజుల ‘కలయిక’.. చాందినికి స్నేహితుడైన ఓ మైనర్ ఫేస్బుక్లో ‘నేషనల్ డిప్లొమాట్స్’పేరుతో పేజ్ ఏర్పాటు చేశారు. ఇందులోని సభ్యుల్లో 52 మంది గెట్ టుగెదర్‌కు ఏర్పాటు చేసుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు లక్డీకాపూల్‌లోని ఓ స్టార్ హోటల్ దీనికి వేదికైంది. మైనర్లకు నిర్వాహకులు 23 గదులు కేటాయించారు. పగలంతా అకడమిక్ సదస్సులు జరిగినా.. సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. పబ్స్, మద్యపానం, సోషలైజింగ్ పేరుతో బాలబాలికల గదుల మార్పిడి జరుగుతున్నా పట్టించుకునే నాథుడు కరవయ్యాడు. ఈ ‘గెట్ టుగెదర్’లో చాందినితో పాటు ఆమె కేసులో నిందితుడిగా ఉన్న బాలనేరగాడు సైతం పాల్గొన్నాడు. అక్కడ చాందినికి మరో మైనర్‌తో అయిన పరిచయమే పరిస్థితిని హత్య వరకు తీసుకెళ్లింది. అప్పట్లో పోలీసులేమన్నారు? పబ్స్‌తో పాటు మద్యం సరఫరా విషయంలో పక్కాగా వ్యవహరిస్తామని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. కొన్ని రోజుల పాటు తనిఖీలు, కేసుల నమోదు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ స్థాయి నిఘా, అధికారుల చర్యలూ అటకెక్కాయి. నగరంలోని పబ్స్‌లో రాత్రి 12 గంటల వరకు మ్యూజిక్ ప్లే చేయడానికి, తెల్లవారుజాము ఒంటి గంట వరకు పబ్ నడవడానికి అనుమతులు ఉన్నాయి. మైనర్లు వీటిలోకి వెళ్లడం, మద్యం సేవించడం జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. సంపన్నుల పిల్లలకు గాలం వేస్తున్న కొందరు దళారులు స్టార్ హోటల్స్, రిసార్ట్స్ వేదికగా ఇలాంటి విపరీత వ్యవహారాలను నిర్వహిస్తున్నా యంత్రాంగాల్లో స్పందన కరువైంది. చాందిని వ్యవహారం వెలుగులోకి వచ్చే వరకు అసలు ఇలాంటి సంస్కృతి ఉన్నట్లు పోలీసులు గుర్తించలేకపోవడం గమనార్హం. ఇలాంటి విషసంస్కృతికి చెక్ చెప్పాలంటూ పిల్లలపై తల్లిదండ్రుల అజమాయిషీ ఉండాలన్నది నిపుణుల మాట. వారి కదలికల్ని కనిపెట్టడంతో పాటు వారి ఇంటర్నెట్, సోషల్‌మీడియా వ్యవహరాల్లో గోప్యత లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. రమ్య కుటుంబాన్ని చిదిమారిలా.. నగరానికి చెందిన విద్యార్థులు ఎన్.సూర్య, విష్ణు, శ్రావెల్, అశ్విన్, సాయి రమేశ్, అలెన్ జోసెఫ్ గత ఏడాది జూలై 1న బంజారాహిల్స్‌లోని సినీమ్యాక్స్‌లో సినిమా చూసేందుకు వెళ్లారు. విష్ణు తండ్రికి చెందిన ఐ10 కారులో అక్కడికి వెళ్లారు. సినిమా చూడటం సాధ్యపడక పోవడంతో మాల్లోనే ఉన్న టీజీఐ ఫ్రైడే బార్లో ఫూటుగా మద్యం తాగారు. బార్ నిర్వాహకులు నిబంధనలకు తిలోదకాలిస్తూ 21 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నా మద్యం సరఫరా చేశారు. తిరిగి వస్తున్న సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ లేని శ్రావెల్ వాహనాన్ని నడుపుతూ పంజగుట్ట శ్మశాన వాటిక వద్ద రమ్య కుటుంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి కారకుడ య్యాడు. ఈ ఘటన మూడు ప్రాణాలు తీయడంతో పాటు నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఇలా.. జూబ్లీహిల్స్‌లోని డీకే నగర్‌కు చెందిన బీటెక్ విద్యార్థిని కె.దేవి, మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి చెందిన సామ భరత్‌సింహారెడ్డి రెండేళ్ల క్రితం ఫేస్బుక్లో పరిచయమయ్యారు. గత ఏడాది ఏప్రిల్ 30 రాత్రి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న బీట్స్ పర్ మినిట్స్ పబ్‌లో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. దేవితో పాటు ఆమె స్నేహితురాలు సోనాలీ సైతం వెళ్లింది. పార్టీ పూరై్తన తర్వాత తెల్లవారుజామున 2.45 గంటలకు దేవి, భరత్, సోనాలీ పబ్ నుంచి బయటకు వచ్చారు. మద్యం మత్తులో దేవిని తీసుకుని కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న భరత్ చేసిన ప్రమాదం ఆమె ప్రాణాలు తీసింది. -
స్నేహితుడే హంతకుడు
♦ మరో ఇద్దరితో సన్నిహితంగా ఉండటంతో చాందినిని హతమార్చిన క్లాస్మేట్ ♦ అమీన్పూర్ గుట్టపైకి రమ్మని పిలిచి.. గొంతు నులిమి హత్య ♦ ఆపై గుట్టపై నుంచి కిందకు తోసివేత ♦ మృతురాలి సెల్‌ఫోన్ చెరువులో పడేసి పరారీ ♦ సీసీటీవీ ఫుటేజీ, ఆటోడ్రైవర్ సాయంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కేసులో మిస్టరీ వీడింది. క్లాస్మేటే కాలాంతకుడయ్యాడు. తనతో గాకుండా మరో ఇద్దరితో స్నేహంగా ఉండటాన్ని భరించలేక పథకం ప్రకారం హత్య చేశాడు. మాట్లాడదామని నమ్మబలికి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అమ్మాయి గొంతు నులిమి చంపేశాడు. తర్వాత గుట్టపై నుంచి కిందకు తోసేశాడు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఠాణా పరిధిలో చాందిని జైన్ మృతదేహం దొరికిన 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. బుధవారం ఈ కేసు వివరాలను సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌తో కలసి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య మీడియాకు వెల్లడించారు. పదో తరగతి దాకా కలిసి చదువు సిల్వర్ ఓక్స్ స్కూల్లో చాందిని జైన్, నిందితుడు(మైనర్) పదో తరగతి వరకు చదివారు. ఆ సమయంలో వీరి మధ్య చిగురించిన స్నేహం బలపడింది. తర్వాత చాందిని ఈ స్కూల్లోనే చదువు కొనసాగించగా.. నిందితుడు డీఆర్ఎస్ కాలేజీలో చేరి ప్రస్తుతం ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నగరానికి చెందిన ఓ విద్యార్థి ఫేస్బుక్లో ఓ పేజీ(నేషనల్ డిప్లొమోస్ సమ్మిట్) క్రియేట్ చేసి అందులో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులను సభ్యులుగా చేర్చాడు. ఇలా ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్స్‌గా మారిన వీరంతా సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు రోజుల పాటు నగరంలోని సెంట్రల్ కోర్టు హోటల్లో కలిశారు. ఈ పార్టీకి చాందిని జైన్‌తోపాటు ఆమె స్నేహితుడు కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా చాందిని మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి భరించలేకపోయాడు. అప్పట్నుంచి ఆమెకు దూరంగా ఉండే ప్రయత్నం చేశాడు. మరో స్నేహితుడితో కలిసి పబ్‌కు వెళ్తున్నట్టు ఈ నెల 9న చాందిని నిందితుడికి చాటింగ్ ద్వారా చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు.. మాట్లాడుకుందాం రమ్మం టూ చాందినిని పిలిచాడు. సాయంత్రం ఐదు గంటలకు దీప్తిశ్రీ నగర్ క్రాస్ రోడ్స్‌కు వచ్చి చాందినితో కలిసి ఆటోలో అమీన్పూర్ గుట్టపైకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వా దం జరిగింది. స్నేహం ఎప్పట్లాగే కొనసాగించాలని చాందిని ఒత్తిడి తెచ్చింది. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో నిందితుడు చాందిని ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. తర్వాత గొంతు నులిమి చంపి గుట్టపై నుంచి 10 మీటర్ల కిందకు పడేశాడు. అనంతరం మృతురాలి సెల్‌ను చెరువులో పడేసి వెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కాడిలా.. అమీన్‌పూర్‌లోని మాధవీపూరి హిల్స్ వద్ద ఓ సీసీటీవీలో నిందితుడు ముఖానికి గుడ్డ కట్టుకున్న దృశ్యాలు చిక్కాయి. చాందినితో కలసి ఆటోలో దిగి గుట్టల వైపు వెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి. ఆటో నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని అతడి ద్వారా వివరాలు సేకరించారు. అప్పటికే సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా నిందితుడు మియాపూర్‌లోని ప్రగతి ఎన్‌క్లేవ్‌లో ఉంటున్నట్టు గుర్తించారు. ఆటో డ్రైవర్‌ను కూడా అతడి ఇంటికి తీసుకెళ్లి ప్రశ్నించారు. చాందిని హత్య జరిగిన 9 తేదీ సాయంత్రం తాను క్రికెట్ ఆడుతున్నట్టు నిందితుడు చెప్పినా.. పోలీసు విచారణలో అబద్ధమని తేలింది. అతడి తండ్రి కూడా సీసీటీవీ ఫుటేజీలకు చిక్కిన దృశ్యాల్లో ఉన్నది తన కుమారుడేనని తెలపడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి పాఠశాలలు, కళాశాలలకు వెళుతున్న పిల్లలు ఏం చేస్తున్నారనే దానిపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. ఓ మైనర్ ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసి నగరంలోని ఓ హోటల్లో కలవడం, పబ్‌ల్లో మద్యం సేవించడం మామూలు విషయం కాదు. ఎవరినైనా గుడ్డిగా నమ్మవద్దు. ఫేస్బుక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. – సందీప్ శాండిల్య, సీపీ నిందితుడిని కఠినంగా శిక్షించాలి స్నేహం పేరుతో దగ్గరై మా కూతుర్ని చంపినవాడిని కఠినంగా శిక్షించాలి. హత్య ఒక్కడే చేశాడంటే మేం నమ్మలేకపోతున్నాం. అతడు ఎప్పుడూ మా ఇంటికి రాలేదు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. స్నేహంగా నటించి హత్య చేశాడు. – కవిత, చాందిని తల్లి -
'సాయికిరణ్ ప్లే బాయ్ అయ్యుండొచ్చు'
సాక్షి, హైదరాబాద్ : సాయికిరణ్ రెడ్డి ప్లేబాయ్ అయ్యుండొచ్చునని, ఆరు నెలలకో అమ్మాయిని మార్చేవాడు కావొచ్చని దారుణ హత్య గురైన చాందిని తల్లిదండ్రులు ఆరోపించారు. బహుశా తన కూతురితో ఎట్రాక్షన్ లాంటి రిలేషన్ ఏర్పడి అతడి పనులకు తమ కూతురు అడ్డును తొలగించుకోవాలనే ప్రణాళిక ప్రకారం హత్య చేసి ఉంటాడని భావిస్తున్నామని చాందిని తల్లి చెప్పారు. చాందిని, సాయికిరణ్ రెడ్డి సిల్వర్ ఓక్స్ స్కూళ్లో చదువుకున్నారు. కానీ ఇద్దరు వేరే సెక్షన్లు. అదే సంస్థలో చాందని ఇంటర్ చదువుతుండగా.. సాయికిరణ్ ఎక్కడ చదువుతున్నాడో.. వీరిమధ్య ఏం ఉందో మాకు మాత్రం తెలియదు కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్లాన్ ప్రకారమే చాందిని హత్య సాయికిరణ్ మంచివాడని అనుకున్నాం, కానీ అతడు ఇంత దారుణానికి పాల్పడుతాడని మేం ఎవరం ఊహించలేదు. మీడియాలో చూసేవరకూ ఈ హత్య చేసిందన్నది మాకు కూడా తెలియదు. సాయికిరణ్ ప్లే బాయ్ అయ్యుండొచ్చు. చాందినితో పాటు మరికొందరు అమ్మాయిల్ని వేధించి ఉంటాడు. అసలు ఏమైందో తెలియదు కానీ.. ఎందుకో తనకు అడ్డుగా ఉందని భావించిన సాయికిరణ్.. మరి కొందరు అబ్బాయిలతో కలిసి ప్లాన్‌చేసి చాందినిని హత్యచేశారు. సాయికిరణ్ గురించి తమకు స్పెషల్‌గా ఎప్పుడు చెప్పలేదు. అతడితో పాటు ఫ్రెండ్స్ గురించి చాలా క్యాజువల్‌గా చెప్పేది. టీనేజ్‌లో ఉన్న వీరిమధ్య అట్రాక్షన్ ఉండటం సహజమే. కానీ సాయికిరణ్‌ను ప్రేమిస్తున్నట్లు నా కూతురు చాందిని ఎప్పుడూ చెప్పలేదు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. మియాపూర్ కు చెందిన చాందిని జైన్ దారుణహత్య కేసును కేసును పోలీసులు ఛేదించారు. చాందిని స్కూల్‌మేట్ సాయికిరణ్ రెడ్డి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం మదీనాగూడలోని అపార్ట్మెంట్లో సాయికిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేటి మధ్యాహ్నం నిందితుడు సాయికిరణ్‌ను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. -
చాందిని కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మియాపూర్ కు చెందిన ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ (17) దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. చాందిని జైన్‌ను ఆమె స్కూల్‌మేట్, ప్రియుడిగా భావిస్తున్న సాయికిరణ్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన నగర పోలీసులు సాయికిరణ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మదీనాగూడలోని అపార్ట్మెంట్లో నివాసం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని చాందిని ఒత్తిడి చేస్తుండటంతో ఆమెను సాయికిరణ్ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. నేటి మధ్యాహ్నం నిందితుడు సాయికిరణ్‌ను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. శనివారం ఇంటి నుంచి బయటికి వెళ్లి అదృశ్యమైన చాందిని సోమవారం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ గుట్టల్లో మరణించిన స్థితిలో కనిపించింది. సాయికిరణే ఆమెను ఆ గుట్టల వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి.. ఆమెపై అత్యాచారయత్నం చేసి, హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం రాత్రి చాందిని స్నేహితులను, కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా సాయికిరణే ఈ హత్యకు సూత్రధారి అని తేలింది.