స్నేహితుడే హంతకుడు
♦ మరో ఇద్దరితో సన్నిహితంగా ఉండటంతో చాందినిని హతమార్చిన క్లాస్‌మేట్
♦ అమీన్‌పూర్ గుట్టపైకి రమ్మని పిలిచి.. గొంతు నులిమి హత్య
♦ ఆపై గుట్టపై నుంచి కిందకు తోసివేత
♦ మృతురాలి సెల్‌ఫోన్ చెరువులో పడేసి పరారీ
♦ సీసీటీవీ ఫుటేజీ, ఆటోడ్రైవర్ సాయంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కేసులో మిస్టరీ వీడింది. క్లాస్‌మేటే కాలాంతకుడయ్యాడు. తనతో గాకుండా మరో ఇద్దరితో స్నేహంగా ఉండటాన్ని భరించలేక పథకం ప్రకారం హత్య చేశాడు. మాట్లాడదామని నమ్మబలికి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అమ్మాయి గొంతు నులిమి చంపేశాడు. తర్వాత గుట్టపై నుంచి కిందకు తోసేశాడు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ ఠాణా పరిధిలో చాందిని జైన్ మృతదేహం దొరికిన 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. బుధవారం ఈ కేసు వివరాలను సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌తో కలసి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య మీడియాకు వెల్లడించారు.
పదో తరగతి దాకా కలిసి చదువు
సిల్వర్ ఓక్స్ స్కూల్‌లో చాందిని జైన్, నిందితుడు(మైనర్) పదో తరగతి వరకు చదివారు. ఆ సమయంలో వీరి మధ్య చిగురించిన స్నేహం బలపడింది. తర్వాత చాందిని ఈ స్కూల్‌లోనే చదువు కొనసాగించగా.. నిందితుడు డీఆర్‌ఎస్ కాలేజీలో చేరి ప్రస్తుతం ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నగరానికి చెందిన ఓ విద్యార్థి ఫేస్‌బుక్‌లో ఓ పేజీ(నేషనల్ డిప్లొమోస్ సమ్మిట్) క్రియేట్ చేసి అందులో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులను సభ్యులుగా చేర్చాడు. ఇలా ఫేస్‌బుక్ ద్వారా ఫ్రెండ్స్‌గా మారిన వీరంతా సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు రోజుల పాటు నగరంలోని సెంట్రల్ కోర్టు హోటల్‌లో కలిశారు. ఈ పార్టీకి చాందిని జైన్‌తోపాటు ఆమె స్నేహితుడు కూడా హాజరయ్యాడు.
ఈ సందర్భంగా చాందిని మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి భరించలేకపోయాడు. అప్పట్నుంచి ఆమెకు దూరంగా ఉండే ప్రయత్నం చేశాడు. మరో స్నేహితుడితో కలిసి పబ్‌కు వెళ్తున్నట్టు ఈ నెల 9న చాందిని నిందితుడికి చాటింగ్ ద్వారా చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు.. మాట్లాడుకుందాం రమ్మం టూ చాందినిని పిలిచాడు. సాయంత్రం ఐదు గంటలకు దీప్తిశ్రీ నగర్ క్రాస్ రోడ్స్‌కు వచ్చి చాందినితో కలిసి ఆటోలో అమీన్‌పూర్ గుట్టపైకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వా దం జరిగింది. స్నేహం ఎప్పట్లాగే కొనసాగించాలని చాందిని ఒత్తిడి తెచ్చింది. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో నిందితుడు చాందిని ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. తర్వాత గొంతు నులిమి చంపి గుట్టపై నుంచి 10 మీటర్ల కిందకు పడేశాడు. అనంతరం మృతురాలి సెల్‌ను చెరువులో పడేసి వెళ్లిపోయాడు.
పోలీసులకు చిక్కాడిలా..
అమీన్‌పూర్‌లోని మాధవీపూరి హిల్స్ వద్ద ఓ సీసీటీవీలో నిందితుడు ముఖానికి గుడ్డ కట్టుకున్న దృశ్యాలు చిక్కాయి. చాందినితో కలసి ఆటోలో దిగి గుట్టల వైపు వెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి. ఆటో నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని అతడి ద్వారా వివరాలు సేకరించారు. అప్పటికే సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా నిందితుడు మియాపూర్‌లోని ప్రగతి ఎన్‌క్లేవ్‌లో ఉంటున్నట్టు గుర్తించారు. ఆటో డ్రైవర్‌ను కూడా అతడి ఇంటికి తీసుకెళ్లి ప్రశ్నించారు. చాందిని హత్య జరిగిన 9 తేదీ సాయంత్రం తాను క్రికెట్ ఆడుతున్నట్టు నిందితుడు చెప్పినా.. పోలీసు విచారణలో అబద్ధమని తేలింది. అతడి తండ్రి కూడా సీసీటీవీ ఫుటేజీలకు చిక్కిన దృశ్యాల్లో ఉన్నది తన కుమారుడేనని తెలపడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి
పాఠశాలలు, కళాశాలలకు వెళుతున్న పిల్లలు ఏం చేస్తున్నారనే దానిపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. ఓ మైనర్ ఫేస్‌బుక్ పేజీ క్రియేట్ చేసి నగరంలోని ఓ హోటల్‌లో కలవడం, పబ్‌ల్లో మద్యం సేవించడం మామూలు విషయం కాదు. ఎవరినైనా గుడ్డిగా నమ్మవద్దు. ఫేస్‌బుక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
– సందీప్ శాండిల్య, సీపీ
నిందితుడిని కఠినంగా శిక్షించాలి
స్నేహం పేరుతో దగ్గరై మా కూతుర్ని చంపినవాడిని కఠినంగా శిక్షించాలి. హత్య ఒక్కడే చేశాడంటే మేం నమ్మలేకపోతున్నాం. అతడు ఎప్పుడూ మా ఇంటికి రాలేదు. ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. స్నేహంగా నటించి హత్య చేశాడు.
– కవిత, చాందిని తల్లి