మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
నవాబ్‌పేట: మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నవాబ్‌పేట మండల కేంద్రానికి చెందిన ఓ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఆర్‌ఎంపీ డాక్టర్ లక్ష్మీనారాయణ(50), అలివేలు(45) దంపతులు కూతురు సుప్రజ(21) ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
బుధవారం రాత్రి బుధ్ద పూర్ణిమ సందర్భంగా రామేశ్వరంలోని శివాలయంలో నిద్రచేసి తిరిగి వస్తున్న ముగ్గురు గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా.. లక్ష్మీనారాయణ, అలివేలు అప్పటికే మృతిచెందారు. కొన ఊపిరితో ఉన్న సుప్రజను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.