సమగ్ర సర్వేతో బయటపడ్డ కుటుంబ కలహాలు
సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా కుటుంబ కలహాలు కూడా బయటపడుతున్నాయి. హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో ఇంతకాలం తమ కుటుంబానికి దూరంగా ఉన్న మహిళ.. ఇప్పుడు తనను కుటుంబంలో భాగంగా చేయాలని కోరుతూ ఇంటికి వచ్చింది. అయితే, మూడేళ్లుగా కనీసం ముఖం కూడా చూపించలేదని, తన కొడుకును కూడా తనకు చూపించలేదని ఇప్పుడు ఎందుకు వచ్చావని అంటూ ఆమె భర్తతో పాటు అత్తమామలు కూడా ఆమెను ఇంట్లోకి రానివ్వడానికి తిరస్కరించారు.
ఆమె తమపై తప్పుడు కేసులు పెట్టిందని, హత్యాయత్నం, 498ఎ కేసులు పెట్టిందని చెబుతున్నారు. ఆమె నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలని కూడా తాను కోర్టులో కోరినట్లు ఆమె భర్త చెబుతున్నారు. ప్రొఫెసర్గా పనిచేస్తున్న సదరు మహిళ ఇంటిముందు బైఠాయించింది. కానీ చుట్టుపక్కల కుటుంబాల వాళ్లు కూడా మహిళనే తప్పుబడుతున్నారు. అత్తమామల పట్ల ఆమె చాలా దురుసుగా ప్రవర్తించేదని అంటున్నారు.
కేవలం తమ ఆస్తి కోసమే ఆమె ఇప్పుడు వచ్చిందని ఆమె అత్తమామలు అంటున్నారు. ఇన్నాళ్లూ తమతో ఎలాంటి సంబంధాలు లేకుండా, సమాజంలో దుర్మార్గంగా చిత్రీకరించిందని చెబుతున్నారు. సర్వే మాట దేవుడెరుగు, కుటుంబ కలహాలతో చుట్టుపక్కల వాళ్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.