రాజు మృతదేహం వద్ద విలపిస్తున్న భార్యాపిల్లలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘నాన్న ఒక్కసారి కళ్లు తెరువు.. నీ బిడ్డలను వదిలిపెట్టి వెళ్లకు’ అంటూ రోదించిన చిన్నారులను చూసి అక్కడున్న వారందరూ కన్నీటి పర్యంతమయ్యారు. రెక్కాడితేగాని డొక్కాడని నేత కుటుంబంపై విధి పగబట్టింది. రేయింబవళ్లు చెమటోడుస్తూ భార్య, నలుగురు పిల్లలను పోషించుకుంటున్న నేతన్నను మృత్యువు బ్లడ్‌క్యాన్సర్ రూపంలో కబలించివేసింది. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలో అద్దె ఇంటిలో ఉంటున్న గడ్డం రాజు(40) బ్లడ్‌క్యాన్సర్‌తో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు.
ఇతడికి భార్య అనిత(35), ముగ్గురు కూతుళ్లు రమ్యశ్రీ(14), ఐశ్వర్య (12), శృతి (9), కొడుకు శివగణేష్ (7)ఉన్నారు. రాజు మరమగ్గాల కార్మికునిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆరు నెలల క్రితం అనారోగ్యం బారిన పడగా సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేయించారు. వ్యాధి తగ్గకపోవడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా బ్లడ్‌క్యాన్సర్‌గా తేలింది. చేతిలో డబ్బులు లేని రాజు దంపతులు రూ.4 లక్షల మేర అప్పులు చేసినప్పటికీ వైద్య ఖర్చులకు సరిపోలేదు.
మెరుగైన వైద్యం చేయించుకోలేక దిక్కులేని పరిస్థితిలో రాజు తుది శ్వాస విడిచాడు. గ్రామస్తులు చందాలు వేసుకుని మృతదేహన్ని ఇందిరమ్మకాలనీకి తరలించారు. ఇంటిపెద్ద దూరమవడంతో నలుగురు చిన్నారులు అనాథలయ్యారు. సొంతగూడు లేకపోవడంతో అద్దె ఇంటిముందే శవాన్ని రోడ్డుపై వేసి మాకు దిక్కు ఎవరంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిరుపేద చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment