అమ్రాబాద్ (మహబూబ్‌నగర్) : అటవీ జంతువుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి ఓ రైతు మృతి చెందాడు. అయితే ఆ విషయం బయటకు రాకుండా వేటగాళ్లు.. సదరు వ్యక్తి మృతదేహాన్ని గోతిలో పూడ్చిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని తిర్మలాపూర్ (బీకే)గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం... మాదవానిపల్లికి చెందిన నర్సింహ(39) సోమవారం రాత్రి ఉదయ్‌కిరణ్, బాల్‌నారాయణలతో కలిసి తప్పిపోయిన పశువులను వెతికేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో తిర్మలాపూర్ (బీకే) గ్రామ సమీపంలోని పొలాల్లో వెతుకుతుండగా అటవీ జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్ కంచె తగలడంతో విద్యుదాఘాతానికి గురై నర్సింహ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మిగతా ఇద్దరూ గ్రామానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా మృతదేహం కనిపించలేదు. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతానికి కొంత దూరంలో వ్యవసాయ బీడు భూమిలో గోతి తీసి పూడ్చినట్టు ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు... అక్కడ తవ్వించగా నర్సింహ మృతదేహం వెలుగుచూసింది. పోలీసు జాగిలాలను రప్పించగా అవి తిర్మలాపూర్(బీకే) గ్రామంలోకి వెళ్లి ఆగిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ కంచెకు రైతు బలి
Published Tue, Jun 16 2015 6:16 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement