సాక్షి, మహబూబ్‌నగర్ : మండలంలోని కుడికిళ్ల గ్రామ శివారు గురువారం ఉదయం రెండు గంటలపాటు అట్టుడికిపోయింది. రైతులు, పోలీసుల మధ్య తోపులాటలు, ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా కుడికిళ్ల గ్రామ శివారు ప్రాంతంలో కాల్వ తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికే కేఎల్‌ఐ ప్రాజెక్టు కాల్వల్లో భూములు కోల్పోయిన రైతులు రెండోసారి పాలమూరు ప్రాజెక్టుకు తమ భూములు ఇవ్వమని కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు.
పలుమార్లు భూ సేకరణ సర్వేను అడ్డుకున్నారు. ఎలాగైనా ఈసారి సర్వే పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలెక్టర్, పోలీసు అధికారులకు ఆదేశాలు రావడంతో గురువారం భారీ పోలీసు బందోబస్తు నడుమ సర్వే పనులు చేపట్టారు. సర్వే పనులను అడ్డుకునేందుకు భూములు కోల్పోతున్న రైతులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మేము భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ముందు పరిహారం ఎంత ఇస్తారో చెప్పాలని రైతులు ప్రాదేయపడ్డారు. అయితే అధికారులు ఇదేమీ పట్టించుకోకుండానే పోలీసు పహారాలో సర్వే పనులు చేపట్టారు.
ఉద్రిక్త వాతావరణం
కుడికిళ్ల శివారులో 1.5 కి.మీ మేరకు కాల్వ తవ్వకం పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్రాంతంలో కాల్వ కోసం దాదాపుగా 270 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. భూములను గుర్తించేందుకు 9 సర్వే బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆర్డీఓ హనుమానాయక్ పర్యవేక్షణలో సర్వే సాగింది. సర్వేను అడ్డుకునేందుకు మధు అనే ఓ యువకుడు తన తలను రాయితో కొట్టుకున్నాడు. దీంతో అతడి తలపగిలి రక్తం కారి సొమ్మసిల్లిపోవడంతో పోలీసులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. శ్యామల, లక్ష్మి అనే మహిళలు కూడా సొమ్మసిల్లిపోయారు. సర్వే ప్రాంతం నుంచి రైతులను పోలీసులు తరమికొట్టారు. పలువురు రైతులు, యువకులను బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనంలోకి ఎక్కించారు. దీంతో సర్వే పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
270 మంది పోలీసులతో భారీ బందోబస్తు
సర్వేను రైతులు అడ్డుకుంటారనే ముందస్తు సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ సాయిశేఖర్, ఏఎస్పీ జోగుల చెన్నయ్యతో ముగ్గురు డీఎస్పీలు బందోబస్తు పర్యవేక్షించారు. మొత్తం 270 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కుడికిళ్లలో పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సర్వే ప్రాంతానికి వెళ్లే రహదారుల్లో పోలీసులు రైతులను అడ్డుకున్నారు. సర్వే ప్రాంతానికి సమీపంలో కేఎల్‌ఐ కాల్వలు ఉండడంతో ఎవరైనా రైతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తారేమో అనే అనుమానంతో 12 మంది గజ ఈతగాళ్లను కాల్వల వద్ద మోహరించారు. అంబులెన్స్, ఫైరింజన్ అందుబాటులో ఉంచారు. కుడికిళ్ల ఎంపీటీసీ సభ్యుడు బిచ్చయ్య, నాయకులు వెంకటేశ్వర్‌రావు, కుబేరుడుతోపాటు 16 మంది నాయకులు గురువారం తెల్లవారుజామున 4 గంటలకు అదుపులోకి తీసుకుని పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీపీఎం నాయకులను కుడికిళ్లలో, కాంగ్రెస్ నాయకులను కొల్లాపూర్, పెద్దకొత్తపల్లిలో అదుపులోకి తీసుకున్నారు.
అధికారుల తీరుపై విమర్శలు..
పోలీసులు తరిమికొట్టడంతో రైతులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పరిహారం చెల్లింపు విషయం గురించి చెప్పకుండా బలవంతంగా భూములు లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. రైతులతో మాట్లాడకుండా సర్వే ప్రాంతంలో పీఎస్‌కే కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులతో ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు ముచ్చటించడం గమనార్హం. పీఎస్‌కే సిబ్బంది సర్వే ప్రాంతంలో రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో కొందరు రైతులు వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.
12 ఎకరాలు పోతోంది
మాకు 12 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి మొత్తం ఇప్పుడు కాల్వలో పోతోంది. మేం ఎట్ల బతకాలె. నష్ట పరిహారం ఎంత ఇస్తరో చెప్పకుండా పోలీసోళ్లను అడ్డం పెట్టుకుని భూములు లాక్కుంటారా. ఇదెక్కడి న్యాయం. అధికారులు, పోలీసులు ఎవరూ కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఉన్న భూమి పోతె మేం ఏం చేయాల్నో వాళ్లే చెప్పాలె.
– ఆంజనేయుడు, రైతు, కుడికిళ్ల
ఇప్పుడున్న ధర ఇవ్వాలి
మాకు ఉన్న మూడెకరాల్లో కాల్వ తీయనీకే ముగ్గు పోస్తుండ్రు. మాకు ఎన్ని పైసలిస్తరో చెప్పకుండనే భూములు తీసుకుంటున్నరు. నా పిల్లలకు భూమి ఎట్ల. వాళ్లు ఎట్ల బతుకుతరు. మాకు భూమికి భూమి ఇయ్యండి. లేదంటే మేం అడిగినన్ని పైసలియ్యండి. వచ్చిన సారోళ్లల్లా ఆ కంపెనోళ్లకు మద్దతుగా ఉంటరేందయ్యా.
– శాంతమ్మ, మహిళా రైతు, కుడికిళ్ల
Comments
Please login to add a commentAdd a comment