కోసం రాస్తారోకో చేస్తున్న రైతులు
సాక్షి, కల్వకుర్తి రూరల్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు ఎండిపోతున్నాయి.. కేఎల్‌ఐ సాగునీరు వస్తుందనుకుంటే నిరాశే మిగిలింది.. నీళ్లందక కళ్లముందే పంటలు వాడుపట్టి పోతుంటే చూడలేకపోతున్నాం.. అధికారులు వెంటనే సాగునీరందించి పంటలను కాపాడాలి.. అని శనివారం తిమ్మరాశిపల్లి, జంగారెడ్డిపల్లి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. కల్వకుర్తి-అచ్చంపేట రహదారిపై తిమ్మరాశిపల్లి గేటు ఎదుట రాస్తారోకో నిర్వహించారు. నాలుగు రోజులుగా నీరందక సాగు చేసిన వేరుశెనగ, వరి పంటలు ఎండిపోయే దశకు చేరాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వేరుశెనగ గింజ పట్టే దశలో ఉందని, ఇప్పుడు నీరందక పోతే పంట దిగుబడి తగ్గిపోతుందని తెలిపారు.
చివరి ఆయకట్టు అయిన జంగారెడ్డిపల్లి వరకు నీరు రాకుండా ఎగువ ప్రాంతాల్లో కాలువలను ధ్వంసం చేసి నీటిని వృథా చేస్తున్నారని, దీంతో వేలాది ఎకరాల్లో లక్షలాది రూపాయలు పెట్టి సాగుచేసిన పంటలు చేతికందకుండా పోయే ప్రమాదం ఉందని కన్నీళ్ల పర్యంతమయ్యారు. అందరికీ న్యాయం చేయాలంటే కాలువలను ధ్వంసం చేయకుండా నిఘా పెట్టించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నర్సింహులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అలాగే వారి ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సంఘీభావం ప్రకటించారు. అక్కడినుంచే కేఎల్‌ఐ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సాగునీరందించేలా చూస్తామని వారు భరోసా ఇవ్వడంతో అదే విషయాన్ని రైతులకు చెప్పి ఆందోళన విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment