kudikilla
-
అట్టుడికిన కుడికిళ్ల.. రైతుల్ని తరిమి కొట్టిన పోలీసులు
సాక్షి, మహబూబ్‌నగర్ : మండలంలోని కుడికిళ్ల గ్రామ శివారు గురువారం ఉదయం రెండు గంటలపాటు అట్టుడికిపోయింది. రైతులు, పోలీసుల మధ్య తోపులాటలు, ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా కుడికిళ్ల గ్రామ శివారు ప్రాంతంలో కాల్వ తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికే కేఎల్ఐ ప్రాజెక్టు కాల్వల్లో భూములు కోల్పోయిన రైతులు రెండోసారి పాలమూరు ప్రాజెక్టుకు తమ భూములు ఇవ్వమని కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. పలుమార్లు భూ సేకరణ సర్వేను అడ్డుకున్నారు. ఎలాగైనా ఈసారి సర్వే పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలెక్టర్, పోలీసు అధికారులకు ఆదేశాలు రావడంతో గురువారం భారీ పోలీసు బందోబస్తు నడుమ సర్వే పనులు చేపట్టారు. సర్వే పనులను అడ్డుకునేందుకు భూములు కోల్పోతున్న రైతులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మేము భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ముందు పరిహారం ఎంత ఇస్తారో చెప్పాలని రైతులు ప్రాదేయపడ్డారు. అయితే అధికారులు ఇదేమీ పట్టించుకోకుండానే పోలీసు పహారాలో సర్వే పనులు చేపట్టారు. ఉద్రిక్త వాతావరణం కుడికిళ్ల శివారులో 1.5 కి.మీ మేరకు కాల్వ తవ్వకం పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్రాంతంలో కాల్వ కోసం దాదాపుగా 270 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. భూములను గుర్తించేందుకు 9 సర్వే బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆర్డీఓ హనుమానాయక్ పర్యవేక్షణలో సర్వే సాగింది. సర్వేను అడ్డుకునేందుకు మధు అనే ఓ యువకుడు తన తలను రాయితో కొట్టుకున్నాడు. దీంతో అతడి తలపగిలి రక్తం కారి సొమ్మసిల్లిపోవడంతో పోలీసులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. శ్యామల, లక్ష్మి అనే మహిళలు కూడా సొమ్మసిల్లిపోయారు. సర్వే ప్రాంతం నుంచి రైతులను పోలీసులు తరమికొట్టారు. పలువురు రైతులు, యువకులను బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనంలోకి ఎక్కించారు. దీంతో సర్వే పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 270 మంది పోలీసులతో భారీ బందోబస్తు సర్వేను రైతులు అడ్డుకుంటారనే ముందస్తు సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ సాయిశేఖర్, ఏఎస్పీ జోగుల చెన్నయ్యతో ముగ్గురు డీఎస్పీలు బందోబస్తు పర్యవేక్షించారు. మొత్తం 270 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కుడికిళ్లలో పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సర్వే ప్రాంతానికి వెళ్లే రహదారుల్లో పోలీసులు రైతులను అడ్డుకున్నారు. సర్వే ప్రాంతానికి సమీపంలో కేఎల్ఐ కాల్వలు ఉండడంతో ఎవరైనా రైతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తారేమో అనే అనుమానంతో 12 మంది గజ ఈతగాళ్లను కాల్వల వద్ద మోహరించారు. అంబులెన్స్, ఫైరింజన్ అందుబాటులో ఉంచారు. కుడికిళ్ల ఎంపీటీసీ సభ్యుడు బిచ్చయ్య, నాయకులు వెంకటేశ్వర్రావు, కుబేరుడుతోపాటు 16 మంది నాయకులు గురువారం తెల్లవారుజామున 4 గంటలకు అదుపులోకి తీసుకుని పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీపీఎం నాయకులను కుడికిళ్లలో, కాంగ్రెస్ నాయకులను కొల్లాపూర్, పెద్దకొత్తపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. అధికారుల తీరుపై విమర్శలు.. పోలీసులు తరిమికొట్టడంతో రైతులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పరిహారం చెల్లింపు విషయం గురించి చెప్పకుండా బలవంతంగా భూములు లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. రైతులతో మాట్లాడకుండా సర్వే ప్రాంతంలో పీఎస్కే కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులతో ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు ముచ్చటించడం గమనార్హం. పీఎస్కే సిబ్బంది సర్వే ప్రాంతంలో రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో కొందరు రైతులు వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. 12 ఎకరాలు పోతోంది మాకు 12 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి మొత్తం ఇప్పుడు కాల్వలో పోతోంది. మేం ఎట్ల బతకాలె. నష్ట పరిహారం ఎంత ఇస్తరో చెప్పకుండా పోలీసోళ్లను అడ్డం పెట్టుకుని భూములు లాక్కుంటారా. ఇదెక్కడి న్యాయం. అధికారులు, పోలీసులు ఎవరూ కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఉన్న భూమి పోతె మేం ఏం చేయాల్నో వాళ్లే చెప్పాలె. – ఆంజనేయుడు, రైతు, కుడికిళ్ల ఇప్పుడున్న ధర ఇవ్వాలి మాకు ఉన్న మూడెకరాల్లో కాల్వ తీయనీకే ముగ్గు పోస్తుండ్రు. మాకు ఎన్ని పైసలిస్తరో చెప్పకుండనే భూములు తీసుకుంటున్నరు. నా పిల్లలకు భూమి ఎట్ల. వాళ్లు ఎట్ల బతుకుతరు. మాకు భూమికి భూమి ఇయ్యండి. లేదంటే మేం అడిగినన్ని పైసలియ్యండి. వచ్చిన సారోళ్లల్లా ఆ కంపెనోళ్లకు మద్దతుగా ఉంటరేందయ్యా. – శాంతమ్మ, మహిళా రైతు, కుడికిళ్ల -
వర్షిణి కుటుంబానికి అండగా ఉంటాం..
కొల్లాపూర్ రూరల్: మండలంలోని కుడికిళ్లకు చెందిన వర్షిణిపై సామూహిక అత్యాచారం బాధాకరమని మాదిగ హక్కుల పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం మండలంలోని కుడికిళ్లలో మృతురాలు వర్షిణి కుటుంబాన్ని ఆయన పరామర్శించి భర్తతో పాటు కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్‌చేసి, మిగతావారిని తప్పించడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. వైశ్యకులంపై చులకనభావమే ఈ అత్యాచారానికి కారణమైందన్నారు. ఈ కేసులో మంత్రి జూపల్లి కొందరిని తప్పించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెంటనే నిర్భయ చట్టం ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. వైశ్య సమాజానికి ఎమ్మార్పీఎస్ పూర్తిగా అండగా ఉంటుందని, వారు చేసే ప్రతి ఆందోళనకు మద్దతిస్తామన్నారు. ఈ కేసులో ఎసై ్స నుంచి డీఎస్పీ వరకు మంత్రి జూపల్లి మాటలు విన్నట్లుగా కనిపిస్తుందన్నారు. రెండు రోజుల్లో డీజీపీ, హోం మంత్రిని కలిసి దోషులకు శిక్ష పడే విధంగా కషిచేస్తామన్నారు. ఈ కేసుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వారంరోజులపాటు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. జిల్లాలో కలెక్టర్, ఎస్పీ మహిళలు ఉన్నత పదవిలో ఉన్నా వర్షిణి మతిపై సానుభూతి కూడా చూపి పరామర్శించకపోవడం విడ్డూరమన్నారు. వారు ఆ పదవుల్లో ఉండేందుకు అనర్హులన్నారు. కార్యక్రమంలో జాతీయ దండోరా నాయకులు కోళ్ల వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు కోళ్ల శివ, మంద నర్సింహ్మ, టైగర్ జంగయ్య, మంగి విజయ్, తాలుకా ఇన్చార్జి నాగులపల్లి లక్ష్మయ్య, జిల్లా నాయకులు అగ్రస్వామి, రాజమౌలి, వడ్డెమాన్ రాముడు, సన్నయ్య, పుట్టపాగ రాముడు, పత్తి కురుమూర్తి, సహదేవుడు, బోరెల్లి కష్ణయ్య, తోలు రాముడు, వీరపాగ చంద్రశేఖర్, శంకర్‌నాయుడు, వర్షిణి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.