కామారెడ్డి: కరెంటు రైతులను కంటతడి పెట్టిస్తోంది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతాంగం కరెంటు కోతలతో మరిన్ని కష్టాలపాలవుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలన్నర గడచినా భారీ వర్షాలు లేకపోవ డం రైతులకు శాపంగా మారింది.
కనీసం భూగర్భజలాలపై ఆధారపడి సేద్యం చేద్దామనుకున్నా కరెంటు కోతలు వాతలు పెడుతున్నాయి. ఏడు గంటల పాటు కరెం టు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా, ఐదు గంటలు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి డివిజన్‌లోని దోమకొండ, మాచారెడ్డి, కామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి, భిక్కనూరు తదితర మండలాలలో కరెం టు కోతలు ఎక్కువయ్యాయి. పగటిపూట ఐదు గంటలు సరఫరా ఉండాల్సిన సమయంలో నాలుగైదు మార్లు ఆటంకాలు ఏర్పడుతున్నాయని రైతులు తెలిపారు. ఏడు గంటలు కరెంటు ఇవ్వాలని అధికారులను కోరితే పై నుంచి ఎంత వస్తే అంత ఇస్తామని చేతులెత్తేస్తున్నారని రైతులు అంటున్నారు.
వరి నాట్లకు ఆటంకం
ఖరీఫ్ వరి నాట్లు వేయడానికి రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మడి నిండా నీళ్లుంటేనే దున్నడంతోపాటు రొప్పడం సాధ్యమవుతుంది. కోతలతో పారిన మడి పారుతోందని రైతులు అంటున్నారు. రోజుకొక మడిని సిద్ధం చేయలేకపోతున్నారు. ఏడు గంటల పాట నిరంతరాయంగా కరెంటు సరఫరా అయితేనే నాట్లు సాధ్యమయ్యే పరిస్థితి ఉంది. వర్షాలు కురిస్తే వర్షపు నీటితో కలిపి దున్నడం, రొప్పడం వంటి పనులు సులువుగా అయ్యేవి. వర్షాల జాడ లేకపోవడంతో నాట్లు వేయడం గగనంగా మారింది.
రోడ్డెక్కుతున్న రైతాంగం
కోతలతో రైతులు చేసేదేమిలేక రోడ్డెక్కుతున్నారు. సబ్‌స్టేషన్లను ముట్టడిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. ఆదివారం దోమకొండ, సదాశివనగర్ మండలాలలో రైతులు రోడ్డెక్కి కరెంటు కోతలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పంటలు సాగు చేయడానికి కోతలు ఇబ్బందులు పెడుతున్నాయని, కనీసం ఏడు గంటల కరెంటు నిరంతరాయంగా సరఫరా చేయాలని కోరుతున్నారు. సరఫరా మెరుగు కాకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని రైతులు అంటున్నారు.
కోతలతో యాతన
Published Mon, Aug 4 2014 4:14 AM | Last Updated on Thu, Oct 4 2018 5:34 PM
Advertisement
Advertisement