ఖరీఫ్ కాటేసింది.. రబీ వెక్కిరించింది
తెలంగాణ పల్లెల్లో కరువు ఛాయలు
తీవ్ర వర్షాభావంతో కుదేలైన వ్యవసాయం
అడుగంటిన ప్రాజెక్టులు, పడిపోయిన భూగర్భ జలాలు
దిక్కుతోచని స్థితిలో రైతులు, కూలీలు
కరువు ప్రభావంతో పెరుగుతున్న వలసలు
పనులు లేక ఖాళీ అవుతున్న ఊళ్లు
నగరాలు, పట్టణాలకు తరలివెళుతున్న కుటుంబాలు
సాక్షి నెట్‌వర్క్/హైదరాబాద్: తెలంగాణ పల్లెలు కరువు కోరల్లో చిక్కాయి. తీవ్ర వర్షాభావంతో వ్యవసాయం వెక్కిరించింది. ఆదాయమార్గం లేక రైతన్నలకు దిగులే మిగిలింది. ఉపాధి కరువై కూలీల్లో కలవరం మొదలైంది. గత్యంతరం లేక పేద కుటుంబాలు వలసబాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అరకొర వర్షాలతో ఖరీఫ్ ఆదుకోలేదు. నీళ్లు లేక రబీలో పంటలే వేయలేదు. దీంతో ఉపాధి కోసం వలసలు జోరందుకున్నాయి. ఈ సమయానికి రబీ పనులతో కళకళలాడాల్సిన పల్లెలు కళావిహీనమయ్యాయి. కాలం కలసిరాక చిన్నకారు రైతులు, పొలం పనులు దొరక్క వ్యవసాయ కూలీలు ఉన్న ఊళ్లను విడిచిపెడుతున్నారు. ఉన్నచోట ఉపాధి లభించక తల్లడిల్లే దయనీయస్థితిలో పట్టణాలకు బయలుదేరుతున్నారు. ఈ ఏడాది తగ్గిపోయిన సాగు విస్తీర్ణమే అసలు దుస్థితిని కళ్లకు కట్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో 13.09 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉంటే.. ఇప్పటివరకు కేవలం 5.16 లక్షల హెక్టార్లలోనే సాగయ్యాయి. దాదాపు 120 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు అలుముకున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అంటే రాష్ర్టంలో నాలుగో వంతు పల్లెలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. సాధారణ వర్షపాతంకన్నా ఈ ఏడాది 33 శాతం తక్కువగా వర్షాలు నమోదయ్యాయి. ఇప్పటికే ఖరీఫ్‌లో అకాల వర్షాల వల్ల వాటిల్లిన పంట నష్టం రైతుల కొంప ముంచింది. మరోవైపు నిరుటితో పోల్చితే జల వనరులన్నీ బాగా ఇంకిపోయాయి. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల్లో నీటిమట్టం ఆందోళనకరస్థాయికి పడిపోయింది. భూగర్భ జలాలు కూడా అడుగంటాయి. గత రబీ సీజన్ ఆరంభంలో 7 మీటర్ల లోతున ఉన్న భూగర్భ జలం ఈ రబీ సీజన్ ఆరంభానికి 9.70 మీటర్లకు పడిపోయింది. బోర్లు, బావుల నుంచి నీటిని తోడే భగీరథ యత్నాలకే రైతులు అప్పుల పాలవుతున్నారు. దీంతో అన్నదాతలకు సేద్యం భారంగా మారింది. ఈ దుర్భర పరిస్థితులు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీయగా.. ఈ ప్రభావంతో పరోక్షంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి.
వ్యవసాయ కూలీలకు గడ్డుకాలం
చిన్న సన్నకారు రైతులు ఉపాధి వెతుక్కునే పనిలో పడటంతో కూలీలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 20 లక్షల మంది కూలీలు వలస వెళ్లినట్లు అంచనా. గత ఏడాది ఆగస్టు 19న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా 6.18 లక్షల ఇళ్లకు తాళాలున్నట్లు లెక్క తేలింది. అప్పటికీ పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన లక్షలాది కుటుంబాలు ఎంతో ప్రయాస పడి ఈ సర్వేలో పాలుపంచుకునేందుకు స్వస్థలాలకు తిరిగొచ్చాయి. అయినా లక్షలాది ఇళ్లకు తాళాలే దర్శనమిచ్చాయి. ఈ లెక్కన వసల వెళ్లిన కుటుంబాల సంఖ్య భారీగానే ఉంటుందని అర్థమవుతోంది. కాగా, తాజాగా నెలకొన్న పరిస్థితులతో రెండు నెలలుగా పనులు దొరక్క పల్లెలు ఖాళీ అవుతున్నాయి. పాలమూరు జిల్లా నుంచే ఏటా పది లక్షల మంది కూలీలు వలసపోతున్నట్లు అధికారులు అంగీకరిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానాతో పాటు హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా వారే కనిపిస్తారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి గల్ఫ్ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ర్టం నుంచి దాదాపు 15 లక్షల మంది కార్మికులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉన్నట్లు అంచనా. వీరిలో అప్పుల పాలైన రైతులే ఎక్కువ మంది ఉన్నారు. ఇక గుజరాత్‌లో దాదాపు మూడు లక్షల మంది తెలంగాణ వారున్నారని ఇటీవలే ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లిన ప్రభుత్వ బృందం గుర్తించింది. రైతులతో పాటు చేనేత, గీత కార్మికులు ఉపాధి కరువై గుజరాత్, ముంబాయిలో బతికేందుకు బయల్దేరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి చాలా మంది పొరుగున ఉన్న మహారాష్ట్రకు వలస వెళుతున్నారు. ఇప్పటికే సిర్పూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు ఖాళీ అయ్యాయి. మరోవైపు వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి పనులు అరకొరగానే సాగుతున్నాయి. గత నెల రోజుల్లో కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉపాధి పనులు కావాలని కోరుతున్న కూలీల సంఖ్య రెట్టింపైంది. కానీ ఉపాధి హామీ పనులను విస్తరించేందుకు అధికారులు శ్రద్ధ చూపడం లేదు. దీంతో పేదలకు వలస మార్గమే శరణ్యమవుతోంది.
కరువు మండలాలు 120
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరువు మండలాలపై ప్రభుత్వ యంత్రాంగం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ మేరకు జిల్లాల నుంచి ప్రభుత్వానికి శుక్రవారం నివేదిక అందింది. ఆ ప్రకారం రాష్ట్రంలో 120 వరకు కరువు మండలాలున్నాయి. అయితే పంట కోత ప్రయోగాల (సీసీఈ) రిపోర్టు రావాల్సిన అవసరం ఉందని... అప్పుడే పూర్తిస్థాయి నివేదిక వచ్చినట్లు అవుతుందని వ్యవసాయ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. సీసీఈ రిపోర్టు వస్తే మరో 80 మండలాలు కరువు జాబితాలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాటితో కలిపి రాష్ట్రంలో 200 కరువు మండలాలు అవుతాయి. సీసీఈ రిపోర్టు వచ్చాకే కరువు మండలాలపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. సీసీఈ నివేదిక రావడానికి ఈ నెలాఖరు వరకు పట్టనున్నట్లు సమాచారం. అయితే కరువు మండలాల ఎంపికలో జాగు ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణ వస్తున్నాయి. యంత్రాంగం నిర్లిప్తత ఫలితంగా కరువుపై కేంద్రానికి నివేదిక పంపడం ఆలస్యం అవుతుందని రైతు నేతలు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత కేంద్ర బృందం పర్యటన మరింత ఆలస్యం అవుతుంది. ఫలితంగా రైతుకు అందాల్సిన పరిహారం సరైన సమయంలో అందని పరిస్థితి దాపురించనుంది.
అప్పులు తీర్చేందుకు వెళ్లాడు
మాకు రెండెకరాల భూమి ఉంది. పొలం సాగు చేద్దామని రూ. 30 వేలు పెట్టి బోరు వేశాం. చుక్కనీరు కూడా రాలేదు. ఉన్న భూమి బీడుగా మారుద్దని మరో చోట బోరు వేశాం. రూ. 40 వేలు ఖర్చయినా నీళ్లు పడలేదు. వ్యవసాయం చేసి అప్పులు తీర్చే మార్గం కనిపించక మరో రూ. లక్ష అప్పు చేసి మా ఆయన దేవరాజు సౌదీకి వెళ్లాడు. నేను కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాను.
- గద్ద పద్మ, కొలనూర్, కోనరావుపేట మండలం, కరీంనగర్
వరంగల్‌లో తండాలు ఖాళీ
ఉపాధి లభించే పరిస్థితి లేక వరంగల్ జిల్లాలోని పలు తండాల్లోని కుటుంబాలు వలసబాట పట్టాయి. కురవి మండల కేంద్రం శివారులోని కీమ్యా తండాలో 20 కుటుంబాలు వలస వెళ్లాయి. వారిలో చాలా మంది హైదరాబాద్‌కు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అలాగే మహబూబాబాద్ మండలంలోని అమనగల్ గ్రామంలో 10 కుటుంబాలు, కస్నా తండాలో 30 కుటుంబాలు, గుండ్రాళ్ళగడ్డ తండాలో 10 కుటుంబాలు పట్టణాలకు తరలాయి.
పనిలేక వలసపోతుండ్రు
మా తండాలో పని కరువై గిరిజనులంతా వలస పోతుండ్రు. నేను, నా భార్య, మనుమరాలు ముగ్గురమే ఇక్కడ ఉన్నాం. నా ఇద్దరు కొడుకులు, కోడళ్లు కూడా నిజామాబాద్ జిల్లాలోని ఫ్యాక్టరీలో పనికి వెళ్లారు. అందరూ మళ్లీ ఉగాదికి తిరిగొస్తరు. తండాలోని 50 ఇళ్లలో ప్రస్తుతం పది మంది వృద్ధులం మాత్రమే ఉన్నాం. వ్యవసాయభూమి ఉన్నా నీళ్లు లేవు. మా తండాకు రోడ్డు మార్గం లేదు. నీటి కోసం రెండు కిలోమీటర్ల దూరం పోతున్నాం.
- హఠ్యానాయక్, మల్పరేగడి తండా, అబ్బెంద, నారాయణఖేడ్ మండలం, మెదక్