జట్రం దేవరకద్ర మార్కెట్‌లో ఉల్లి
దేవరకద్ర: ఉల్లి రైతుకు ఈ ఏడాది కన్నీరే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది.. దేవరకద్ర మార్కెట్‌లో ప్రతీ వారం జరిగే వేలంలో ధర పడిపోతుండడం వారి ఆవేదనకు కారణమవుతోంది. ఎన్నో ఆశలతో.. అప్పులు చేసి మరీ ఉల్లి సాగు చేస్తే ఆశించిన రీతిలో ధర దక్కకపోవడంతో చేసేదేం లేక అయిన కాడికి అమ్ముకుని నిరాశగా ఇంటి ముఖం పడుతున్నారు. అయితే, ఈ బుధవారం మార్కెట్‌కు వేలాదిగా బస్తాల ఉల్లిని అమ్మకానికి తీసుకురాగా ఇదే పరిస్థితి ఎదురైంది. గత కొన్ని వారాలుగా ధరలు అటూఇటు మారుతుండడమే తప్ప పెద్దగా పెరగకపోవడం గమనార్హం.
ఐదు వేల బస్తాలు
దేవరకద్ర మార్కెట్‌కు బుధవారం ఉల్లి పోటెత్తింది. దేవరకద్ర మండలంతో పాటు మరికల్, ధన్వాడ, నారాయణపేట, మక్తల్, చిన్నచింతకుంట, కోయిలకొండ మండలాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఉల్లిని అమ్మకానికి తీసుకొచ్చారు. దాదాపు 5 వేల బస్తాల ఉల్లి అమ్మకానికి రావడంతో మార్కెట్ ఆవరణలో ఎక్కడా చూసినా ఉల్లిగడ్డలే కనిపించాయి. ఇంత పెద్దమొత్తంలో ఉల్లిని వ్యాపారులు సైతం కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు రైతులు వేలం వేయకుండానే నేరుగా బస్తాలకు నింపి వినియోగదారులకు విక్రయించారు.
వారానికోసారి...
మార్కెట్‌లో ప్రతీ బుధవారం జరిగే వేలంలో రైతులు తీసుకొచ్చిన ఉల్లికి వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా ధరలు నిర్ణయిస్తారు. ఏడాది పొడువున ప్రతీ వారం సాగే ఉల్లి వేలంలో స్థానిక వ్యాపారులతో పాటు వివిధ ప్రాంతాల వ్యాపారులు పాల్గొంటారు. ఈ బుధవారం బుధవారం జరిగిన వేలంలో క్వింటా ఉల్లికి గరిష్టంగా రూ.700, కనిష్టంగా రూ.350 వరకే ధరలు పలికాయి. నాలుగు వారాలుగా పరిశీలిస్తే ధరలు అటు ఇటుగా ఉన్నాయే తప్ప పెరగడం లేదు. ఈ వారం మరింత తగ్గడంతో రైతులు వచ్చిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఆటుపోట్లు
గత 12 నెలలుగా ఉల్లి ధరలు అటుపోట్లకు గురవుతున్నాయి. ప్రస్తుతం ధరలు మరింత పడిపోవడం తో తమకు కన్నీళ్లే మిగులుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు తగిన ధర రాక పోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉల్లి ధరలు పెరగకపోతాయా అని వారం వారం ఎదురుచూసే రైతులు నిరాశే ఎదురవుతుండడం గమనార్హం. గత ఏడాది ఆగస్టు సీజన్ కింద పండించిన ఉల్లికి ధరలు అంతంత మాత్రంగా వచ్చాయి.
ప్రస్తుత సీజన్ కింద పండిన ఉల్లి గత రెండు నెలలుగా మార్కెట్‌కు తెస్తున్నారు. ధరలు మాత్రం అటు ఇటుగా రూ. వేయి దాటడం లేదు. వేసవి సమీపిస్తున్న తరు ణంలో మార్కెట్‌కు ఉల్లి పోటెత్తుతోంది. మరో నా లుగు నెలల పాటు సీజన్ కొనసాగనుండగా ఇప్పు డు తగిన ధరలు రాక పోవడంతో రైతులు కృంగిపోతున్నారు. ఎంతో శ్రమకోర్చి పండించిన ఉల్లిని మార్కెట్‌కు తీసుకువస్తే పెట్టిన పెట్టుబడి కాదు కదా.. కనీసం కూలీల ఖర్చు, మార్కెట్‌కు తీసుకొచ్చిన వాహనం కిరాయి కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల క్రితం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉల్లి కొనుగోళ్లు చేపట్టారు.ఇప్పుడు వస్తున్న ధరలు చూస్తే మళ్లీ ప్రభుత్వం రంగంలోకి దిగితే తప్ప రైతులకు న్యాయం జరగదని చెబుతున్నారు.
దిగుమతులు పెరగడమే కారణం
గత ఏడాది జనవరి ప్రారంభం వరకు మహారాష్ట్ర, కర్ణాటకలో ఉల్లి దిగుమతులు తగ్గడంతో మంచి ధరలు పలికాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతులు పెరగడం ధరల తగ్గుదలకు కారణమని చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో ఉల్లి ధరలు తగ్గడంతో ఇక్కడ కూడా పడిపోతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఉల్లి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం మళ్లీ ఫిబ్రవరి వచ్చినా ధరలో మార్పు లేకపోగా మరింత మరింత తగ్గుతుండడం గమనార్హం.
సొంతంగా అమ్ముకుంటున్నా...
దేవరకద్రలో జరిగే ఉల్లి వేలంలో మంచి ధర పలుకుతుందని ఎంతో శ్రమకోర్చి తీసుకొచ్చా. కానీ ధరలు చూసి ఏం చేయాలో పాలుపోక ఉల్లిని బస్తాలకు నింపి రూ.400కు బస్తా చొప్పున విక్రయించా. సరుకు ఎక్కువగా రావడంతో వేలానికి కూడా వ్యాపారులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం స్పందించి ఉల్లి రైతులను ఆదుకోవాలి. – రాంరెడ్డి, ఉల్లి రైతు, లక్ష్మీపురం
క్వింటాల్‌కు రూ.470 వచ్చింది
ఉల్లిని పండించిన కష్టం రాకున్నా.. కనీసం కూలీల ఖర్చులు, రవాణా చార్జీలైనా వస్తాయని భావించా. అలాగే కానీ ఇక్కడ క్వింటా ఉల్లికి రూ.470 ధర పలికింది. దీంతో రవాణా చార్జీలు, కూలీల ఖర్చులు కూడా నేనే భరించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇలా అయితే మా కుటుంబం బతకడం ఎలా? అప్పులు తీర్చడం ఎలా అనేది తెలియడం లేదు. – జంగ్యానాయక్, ఉల్లి రైతు
Comments
Please login to add a commentAdd a comment