Onions crop
-
నెలలో రెట్టింపైన ఉల్లి ధర.. ఎగుమతి సుంకంపై మంత్రి ఏమన్నారంటే..
ప్రభుత్వం ఉల్లిపై విధించిన 40 శాతం ఎగుమతి సుంకాన్ని తొలగించే అవకాశం లేదని ఇటీవల కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన వాణిజ్య వర్గాలు తెలిపాయి. ఉల్లి ధర గడిచిన 15 రోజుల్లో దాదాపు 40 శాతం పెరిగింది. గత నెలతో పోలిస్తే ఏకంగా రెట్టింపైందని మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. లాసల్గావ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) ధరల ప్రకారం కేజీ ఉల్లి ధర మంగళవారం రూ.28గా ఉంది.ఉల్లి ధరల పెరుగుదలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గతనెలలో ఏకంగా 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. ఈ చర్యతో ఉల్లి ఎగుమతులు భారీగా తగ్గి, వాటి ధరలు నిలకడగా ఉంటాయన్నది ప్రభుత్వ యోచన. మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్నా దాన్ని గరిష్ఠ స్థాయిలో పండించే రాష్ట్రాల్లో గతంలో వర్షాభావం వల్ల దిగుబడి తగ్గింది. కర్ణాటకలోని రైతులు ఉల్లిని అధికంగా పండిస్తుంటారు. అయితే హీట్‌వేవ్స్ వల్ల రబీలో రైతులు ఉల్లి సాగుపై ఆసక్తి చూపించలేదు.దేశీయంగా ప్రతి నెలా దాదాపు 13 లక్షల టన్నుల ఉల్లి వినియోగమవుతుంది. దేశంలో ఉల్లి ఎక్కువగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పండుతుంది. 65 శాతం పంట ఒక్క రబీలోనే వస్తుంది. అది ఏప్రిల్-మే మధ్య మార్కెట్లోకి వచ్చి అక్టోబరు-నవంబరు వరకు ఉంటుంది. అయితే నిల్వ ప్రక్రియలోనే ఉల్లిపాయలు ఉత్పత్తి బరువులో 30-40 శాతం కోల్పోతాయి. కుళ్లిపోవడంవల్ల కొన్ని వృథా అవుతాయి. అలా పరిమాణంతో పాటు నాణ్యతపరంగానూ నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఉల్లిపాయలను నిల్వ చేసేందుకు నాణ్యమైన ఏర్పాట్లు లేకపోవడంవల్ల ఏటా రూ.11 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని అంచనా.పెరుగుతున్న ఉల్లి ధరల స్థిరీకరణ కోసం ఎగుమతి సుంకాన్ని పెంచి వ్యూహాత్మక నిల్వలను సృష్టించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉల్లి ధరలు మరింత పెరిగితే బఫర్ స్టాక్ కింద ఉల్లిని సేకరించడం ప్రభుత్వానికి సవాలుగా మారుతుంది. 2022-23లో 25 లక్షల టన్నులుగా ఉండే ఉల్లి ఎగుమతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17 లక్షల టన్నులకు తగ్గాయి. 2024 ఏప్రిల్ నుంచి ఈ ఎగుమతులు కేవలం లక్ష టన్నులు మాత్రమే ఉండవచ్చని సమాచారం.ఇదీ చదవండి: వ్యక్తులను గుర్తించే ‘దివ్యదృష్టి’!కొన్నిచోట్ల వ్యాపారస్థులు సిండికేట్‌గామారి ఇదే అదనుగా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. మహారాష్ట్ర ఉల్లి ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు భరత్ డిఘోలే ఒక వీడియోలో మాట్లాడుతూ..‘రైతులు ప్రభుత్వ సంస్థలైన నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్‌లకు కిలో రూ.40 కంటే తక్కువ ధరకు ఉల్లిని విక్రయించకూడదు. భవిష్యత్తులో ఉల్లి ధరలను తగ్గించేందుకు బఫర్ స్టాక్‌ను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది’ అని తెలిపారు. -
ఉల్లి.. రైతు భీతిల్లి..!
దేవరకద్ర: ఉల్లి రైతుకు ఈ ఏడాది కన్నీరే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది.. దేవరకద్ర మార్కెట్లో ప్రతీ వారం జరిగే వేలంలో ధర పడిపోతుండడం వారి ఆవేదనకు కారణమవుతోంది. ఎన్నో ఆశలతో.. అప్పులు చేసి మరీ ఉల్లి సాగు చేస్తే ఆశించిన రీతిలో ధర దక్కకపోవడంతో చేసేదేం లేక అయిన కాడికి అమ్ముకుని నిరాశగా ఇంటి ముఖం పడుతున్నారు. అయితే, ఈ బుధవారం మార్కెట్‌కు వేలాదిగా బస్తాల ఉల్లిని అమ్మకానికి తీసుకురాగా ఇదే పరిస్థితి ఎదురైంది. గత కొన్ని వారాలుగా ధరలు అటూఇటు మారుతుండడమే తప్ప పెద్దగా పెరగకపోవడం గమనార్హం. ఐదు వేల బస్తాలు దేవరకద్ర మార్కెట్‌కు బుధవారం ఉల్లి పోటెత్తింది. దేవరకద్ర మండలంతో పాటు మరికల్, ధన్వాడ, నారాయణపేట, మక్తల్, చిన్నచింతకుంట, కోయిలకొండ మండలాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఉల్లిని అమ్మకానికి తీసుకొచ్చారు. దాదాపు 5 వేల బస్తాల ఉల్లి అమ్మకానికి రావడంతో మార్కెట్ ఆవరణలో ఎక్కడా చూసినా ఉల్లిగడ్డలే కనిపించాయి. ఇంత పెద్దమొత్తంలో ఉల్లిని వ్యాపారులు సైతం కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు రైతులు వేలం వేయకుండానే నేరుగా బస్తాలకు నింపి వినియోగదారులకు విక్రయించారు. వారానికోసారి... మార్కెట్లో ప్రతీ బుధవారం జరిగే వేలంలో రైతులు తీసుకొచ్చిన ఉల్లికి వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా ధరలు నిర్ణయిస్తారు. ఏడాది పొడువున ప్రతీ వారం సాగే ఉల్లి వేలంలో స్థానిక వ్యాపారులతో పాటు వివిధ ప్రాంతాల వ్యాపారులు పాల్గొంటారు. ఈ బుధవారం బుధవారం జరిగిన వేలంలో క్వింటా ఉల్లికి గరిష్టంగా రూ.700, కనిష్టంగా రూ.350 వరకే ధరలు పలికాయి. నాలుగు వారాలుగా పరిశీలిస్తే ధరలు అటు ఇటుగా ఉన్నాయే తప్ప పెరగడం లేదు. ఈ వారం మరింత తగ్గడంతో రైతులు వచ్చిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆటుపోట్లు గత 12 నెలలుగా ఉల్లి ధరలు అటుపోట్లకు గురవుతున్నాయి. ప్రస్తుతం ధరలు మరింత పడిపోవడం తో తమకు కన్నీళ్లే మిగులుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు తగిన ధర రాక పోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉల్లి ధరలు పెరగకపోతాయా అని వారం వారం ఎదురుచూసే రైతులు నిరాశే ఎదురవుతుండడం గమనార్హం. గత ఏడాది ఆగస్టు సీజన్ కింద పండించిన ఉల్లికి ధరలు అంతంత మాత్రంగా వచ్చాయి. ప్రస్తుత సీజన్ కింద పండిన ఉల్లి గత రెండు నెలలుగా మార్కెట్‌కు తెస్తున్నారు. ధరలు మాత్రం అటు ఇటుగా రూ. వేయి దాటడం లేదు. వేసవి సమీపిస్తున్న తరు ణంలో మార్కెట్‌కు ఉల్లి పోటెత్తుతోంది. మరో నా లుగు నెలల పాటు సీజన్ కొనసాగనుండగా ఇప్పు డు తగిన ధరలు రాక పోవడంతో రైతులు కృంగిపోతున్నారు. ఎంతో శ్రమకోర్చి పండించిన ఉల్లిని మార్కెట్‌కు తీసుకువస్తే పెట్టిన పెట్టుబడి కాదు కదా.. కనీసం కూలీల ఖర్చు, మార్కెట్‌కు తీసుకొచ్చిన వాహనం కిరాయి కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల క్రితం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉల్లి కొనుగోళ్లు చేపట్టారు.ఇప్పుడు వస్తున్న ధరలు చూస్తే మళ్లీ ప్రభుత్వం రంగంలోకి దిగితే తప్ప రైతులకు న్యాయం జరగదని చెబుతున్నారు. దిగుమతులు పెరగడమే కారణం గత ఏడాది జనవరి ప్రారంభం వరకు మహారాష్ట్ర, కర్ణాటకలో ఉల్లి దిగుమతులు తగ్గడంతో మంచి ధరలు పలికాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతులు పెరగడం ధరల తగ్గుదలకు కారణమని చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్లో ఉల్లి ధరలు తగ్గడంతో ఇక్కడ కూడా పడిపోతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఉల్లి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం మళ్లీ ఫిబ్రవరి వచ్చినా ధరలో మార్పు లేకపోగా మరింత మరింత తగ్గుతుండడం గమనార్హం. సొంతంగా అమ్ముకుంటున్నా... దేవరకద్రలో జరిగే ఉల్లి వేలంలో మంచి ధర పలుకుతుందని ఎంతో శ్రమకోర్చి తీసుకొచ్చా. కానీ ధరలు చూసి ఏం చేయాలో పాలుపోక ఉల్లిని బస్తాలకు నింపి రూ.400కు బస్తా చొప్పున విక్రయించా. సరుకు ఎక్కువగా రావడంతో వేలానికి కూడా వ్యాపారులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం స్పందించి ఉల్లి రైతులను ఆదుకోవాలి. – రాంరెడ్డి, ఉల్లి రైతు, లక్ష్మీపురం క్వింటాల్‌కు రూ.470 వచ్చింది ఉల్లిని పండించిన కష్టం రాకున్నా.. కనీసం కూలీల ఖర్చులు, రవాణా చార్జీలైనా వస్తాయని భావించా. అలాగే కానీ ఇక్కడ క్వింటా ఉల్లికి రూ.470 ధర పలికింది. దీంతో రవాణా చార్జీలు, కూలీల ఖర్చులు కూడా నేనే భరించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇలా అయితే మా కుటుంబం బతకడం ఎలా? అప్పులు తీర్చడం ఎలా అనేది తెలియడం లేదు. – జంగ్యానాయక్, ఉల్లి రైతు -
పేలనున్న ఉల్లి బాంబు!
* నిండుకున్న నిల్వలు * రెండు నెలలు ఇదే పరిస్థితి తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్: ఉల్లి బాంబు మళ్లీ పేలనుంది. దేశంలో ఉల్లి నిల్వలు నిండుకోవడంతో డిమాండ్‌కు, సరఫరాకు మధ్య తీవ్ర వ్యత్యాసం నెలకొంది. దేశంలో ఉల్లి అవసరాలను ప్రస్తుతం ఒక్క మహారాష్ట్ర మాత్రమే తీరుస్తోంది. ఈ సమయానికి అక్కడ ఉల్లి నిల్వలు నిండుగా ఉండాలి. అకాల వర్షాలు, తుపాన్ల కారణంగా ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతింది. ముందుగా పంట చేతికొచ్చిన రైతులు గోదాముల్లో నిల్వచేశారు. ఆలస్యంగా వచ్చిన పంటలో ఎక్కువశాతం దెబ్బతింది. యూఏఈ వంటి దేశాలకు ఎగుమతుల ఒప్పందం కారణంగా నాణ్యమైన సరుకును అక్కడికి పంపించారు. నాణ్యత కలిగిన సరుకులు పోను మిగిలిన మూడో రకం ఉల్లిపాయలు దేశంలోని అన్ని మార్కెట్లకు మహారాష్ట్ర నుంచి వెళుతున్నాయి. స్థానిక అవసరాల నిమిత్తం వీటిని వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో కర్నూలు నుంచి రెండో పంట ఉల్లి ఏప్రిల్ నెలాఖరు వరకు వచ్చింది. మహారాష్ట్ర నుంచి తక్కువ సరుకులు వచ్చినా, కర్నూలు ఉల్లి అందుబాటులో ఉండటంతో రాష్ట్రంలో ధరలపై ఆ ప్రభావం పడలేదు. కర్నూలు ఉల్లి అయిపోవడంతో 10 రోజుల నుంచి మార్కెట్ అవసరాలను మహారాష్ట్ర ఉల్లి మాత్రమే తీరుస్తోంది. దీంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. గుత్త మార్కెట్లో 10 కిలోల ఉల్లిపాయల ధర పది రోజుల కిందటి వరకు రూ.70నుంచి రూ.80ఉంటే, ప్రస్తుతం రూ.170కి చేరింది. రిటైల్ మార్కెట్లో కిలో రూ.20 వరకు అమ్ముతున్నారు. వారంలో 10 కిలోల ధర రూ.230కి పెరిగే సూచనలున్నాయని, జూలై నాటికి గుత్త మార్కెట్లో 10 కిలోల ఉల్లి రూ.300 వరకు చేరుకోవచ్చని వ్యాపారుల అంచనా. ఆగస్టు మొదటి వారం నుంచి కర్నూలు మొదటి పంట ఉల్లి మార్కెట్‌కు వస్తుంది. వర్షాలు పడితేగానీ మహారాష్ట్రలో ఉల్లి పంట వేయరు. అప్పటివరకు గోదాముల్లో ఉన్న సరుకును మాత్రమే వినియోగించాల్సి రావటం, మార్కెట్లో ఉల్లి పాయలకున్న డిమాండ్ నేపథ్యంలో ఆ ప్రభావం ధరలపై పడి వినియోగదారుల ఇంట్లో బాంబు పేలనుంది.