ప్రభుత్వం ఉల్లిపై విధించిన 40 శాతం ఎగుమతి సుంకాన్ని తొలగించే అవకాశం లేదని ఇటీవల కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన వాణిజ్య వర్గాలు తెలిపాయి. ఉల్లి ధర గడిచిన 15 రోజుల్లో దాదాపు 40 శాతం పెరిగింది. గత నెలతో పోలిస్తే ఏకంగా రెట్టింపైందని మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. లాసల్‌గావ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) ధరల ప్రకారం కేజీ ఉల్లి ధర మంగళవారం రూ.28గా ఉంది.
ఉల్లి ధరల పెరుగుదలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గతనెలలో ఏకంగా 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. ఈ చర్యతో ఉల్లి ఎగుమతులు భారీగా తగ్గి, వాటి ధరలు నిలకడగా ఉంటాయన్నది ప్రభుత్వ యోచన. మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరుగుతున్నా దాన్ని గరిష్ఠ స్థాయిలో పండించే రాష్ట్రాల్లో గతంలో వర్షాభావం వల్ల దిగుబడి తగ్గింది. కర్ణాటకలోని రైతులు ఉల్లిని అధికంగా పండిస్తుంటారు. అయితే హీట్‌వేవ్స్ వల్ల రబీలో రైతులు ఉల్లి సాగుపై ఆసక్తి చూపించలేదు.
దేశీయంగా ప్రతి నెలా దాదాపు 13 లక్షల టన్నుల ఉల్లి వినియోగమవుతుంది. దేశంలో ఉల్లి ఎక్కువగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పండుతుంది. 65 శాతం పంట ఒక్క రబీలోనే వస్తుంది. అది ఏప్రిల్-మే మధ్య మార్కెట్లోకి వచ్చి అక్టోబరు-నవంబరు వరకు ఉంటుంది. అయితే నిల్వ ప్రక్రియలోనే ఉల్లిపాయలు ఉత్పత్తి బరువులో 30-40 శాతం కోల్పోతాయి. కుళ్లిపోవడంవల్ల కొన్ని వృథా అవుతాయి. అలా పరిమాణంతో పాటు నాణ్యతపరంగానూ నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఉల్లిపాయలను నిల్వ చేసేందుకు నాణ్యమైన ఏర్పాట్లు లేకపోవడంవల్ల ఏటా రూ.11 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని అంచనా.
పెరుగుతున్న ఉల్లి ధరల స్థిరీకరణ కోసం ఎగుమతి సుంకాన్ని పెంచి వ్యూహాత్మక నిల్వలను సృష్టించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉల్లి ధరలు మరింత పెరిగితే బఫర్ స్టాక్ కింద ఉల్లిని సేకరించడం ప్రభుత్వానికి సవాలుగా మారుతుంది. 2022-23లో 25 లక్షల టన్నులుగా ఉండే ఉల్లి ఎగుమతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17 లక్షల టన్నులకు తగ్గాయి. 2024 ఏప్రిల్ నుంచి ఈ ఎగుమతులు కేవలం లక్ష టన్నులు మాత్రమే ఉండవచ్చని సమాచారం.
ఇదీ చదవండి: వ్యక్తులను గుర్తించే ‘దివ్యదృష్టి’!
కొన్నిచోట్ల వ్యాపారస్థులు సిండికేట్‌గామారి ఇదే అదనుగా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. మహారాష్ట్ర ఉల్లి ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు భరత్ డిఘోలే ఒక వీడియోలో మాట్లాడుతూ..‘రైతులు ప్రభుత్వ సంస్థలైన నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్‌లకు కిలో రూ.40 కంటే తక్కువ ధరకు ఉల్లిని విక్రయించకూడదు. భవిష్యత్తులో ఉల్లి ధరలను తగ్గించేందుకు బఫర్ స్టాక్‌ను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment