తండ్రి ఇక్కడ పుడితేనే ఫీజు!
రీయింబర్స్‌మెంట్ వర్తింపుపై అధికారుల ప్రతిపాదనలు
విద్యార్థుల స్థానికతకు తండ్రి జన్మస్థలమే ప్రాతిపదిక
‘మన వాళ్లకే ఫీజులు’ అన్న కేసీఆర్ ఆదేశంతో నిర్ణయం
తుది ఫైల్ సిద్ధం.. సీఎం ఆమోదమే తరువాయి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు తెలంగాణలోనే పుట్టినా, ఇక్కడే విద్యాభ్యాసం కొనసాగిస్తున్నా సరే.. వారి తండ్రి కూడా తెలంగాణలో పుట్టినట్లయితేనే ఇక నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించనుంది. దీనికి దరఖాస్తు చేసుకునేప్పుడే తండ్రి స్థానికతను ధ్రువీకరించే పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుపై అధికారులు రూపొందించిన ప్రతిపాదనల్లో ముఖ్యమైన అంశమిది. ‘మన బిడ్డలకే ఫీజులు..’ అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులు ఈ తరహా ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో.. తెలంగాణ విద్యార్థులంటే ఎవరు? ఏ ప్రామాణికతను ఆధారంగా స్థానికతను నిర్ధారించాలనే అంశంపై కొద్దిరోజులుగా కసరత్తు చేసిన అధికారులు ఈ మేరకు తుది ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
హైదరాబాద్ చుట్టుపక్కల విద్యాసంస్థల్లో వేలాది మంది సీమాంధ్ర విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న నేపథ్యంలో వారికి ఫీజులు చెల్లించడం అనవసరమనే ప్రభుత్వ భావన కూడా ఈ ప్రతిపాదనలకు కారణమవుతోంది. వీటికి సీఎం ఆమోద ముద్ర పడగానే అమల్లోకి వస్తాయి. శనివారం సీఎస్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపు, సబ్‌ప్లాన్‌ల అమలు తదితర అంశాలపై సమావేశం జరిగింది. పంచాయతీరాజ్, సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు రేమండ్ పీటర్, టి.రాధా, గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌తో పాటు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సమన్వయకర్త మల్లేపల్లి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
సమావేశంలో భిన్నాభిప్రాయాలు..
తెలంగాణ విద్యార్థులుగా ఎవరిని పరిగణించాలనే అంశంపై అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముల్కీ నిబంధనను (వరుసగా 15 ఏళ్లు ఎక్కడ నివసిస్తే అక్కడ స్థానికుడు అవుతాడు) అనుసరిద్దామని కొందరు, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 4 నుంచి 10వ తరగతి వరకు వరుసగా ఏవైనా నాలుగేళ్లు తెలంగాణలో విద్యనభ్యసించిన వారందరినీ స్థానికులుగా పరిగణించాలని మరికొందరు సూచించారు. అయితే అధికారులు మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఇటీవల జరిగిన అఖిలపక్షంలో సీఎం కేసీఆర్ ‘మన బిడ్డలకే ఫీజులు చెల్లిద్దాం..’ అని చెప్పిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వందలాది కాలేజీల్లో వృత్తివిద్యా కోర్సులు చదవటానికి సీమాంధ్ర జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు వస్తున్న నేపథ్యంలో.. వారికి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదనేది తెలంగాణ ప్రభుత్వ భావన.
ఈ మేరకు విద్యార్థులు ఇక్కడే పుట్టినా, ఇక్కడే పాఠశాల విద్య అభ్యసించినా సరే.. వారి తండ్రి కూడా ఇక్కడ పుట్టినవారైతేనే స్థానికులుగా పరిగణించాలని నిర్ణయించినట్లు సమాచారం. అప్పుడే ‘మన బిడ్డలకే ఫీజులు..’ అనే కేసీఆర్ ఆదేశం సరిగ్గా నెరవేరుతుందన్న ఆలోచనతో ఉన్నతాధికారులు ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తుది ప్రతిపాదనలతో అధికారులు ఫైల్‌ను రూపొందించారు కూడా. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేయడమే మిగిలింది.
సబ్‌ప్లాన్‌లకు ప్రత్యేక విధివిధానాలు..
అయితే ఈ సమావేశంలో తొలుత ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ల అమలుపై చర్చ జరిగింది. వీటికి సంబంధించి స్పష్టమైన విధి విధానాలను రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను సబ్‌ప్లాన్ నుంచి చెల్లించకూడదని తీర్మానించారు. భూముల కొనుగోలుతోపాటు ఆయా సామాజికవర్గాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అవసరమైన కార్యక్రమాల కోసం మాత్రమే సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.