ఏపీ విద్యార్థుల బాధ్యత టీ ప్రభుత్వానిదే
ఫీజు రీయింబర్స్‌మెంటుపై ఆర్థిక మంత్రి యనమల
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో చదివే ఏపీ విద్యార్థుల బోధనారుసుం, స్కాలర్‌షిప్‌ల బాధ్యత తెలంగాణ ప్రభుత్వమే చూడాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంప్రదిస్తున్నారని తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. ఆ ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను అనుసరించి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఒకవేళ స్థానిక తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు బోధనారుసుం ఇవ్వని పక్షంలో రాష్ట్రప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వ్యవసాయ రుణమాఫీపై కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఖరీఫ్ సాగుకు ఇబ్బంది లేకుండా సకాలంలో రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లతో చర్చిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు సమీక్షలు జరుపుతున్నామని, వ్యవస్థను మెల్లమెల్లగా గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని తెలిపారు. లోపాలను సరిదిద్ది ఆదాయాన్ని మెరుగుపర్చుకొనే చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు.