
ఫీజు దోపిడీ
మహబూబ్‌నగర్ విద్యావిభాగం:
బీఈడీ కాలేజీలు సిండికేటుగా మారి విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు దండుకుంటున్నారు. కన్వీనర్ కోటాలో సీటు దక్కినా తాము చెప్పినంత చెల్లించాల్సిందేనంటూ భీష్మించాయి. ఈ ఫీజు చెల్లించే ఆర్థికస్తోమత లేక సగంమంది విద్యార్థులు కాలేజీల్లో చేరలేదు. ఈ విషయంపై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 40 బీఈడీ కళాశాలల యాజమాన్యాలు సిండికేట్‌గా మారాయి.
యూనివర్సిటీల పరిధిలో ఉన్న కళాశాలల్లో వసతులు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ట్యూషన్ ఫీజు నిర్ణయించింది. ట్యూషన్ ఫీజు *13,500, స్పషల్ ఫీజు *3000 కలిపి *16,500 వరకు మాత్రమే ఫీజు తీసుకోవాలని నిబంధనలు విధించింది. కౌన్సెలింగ్ ద్వారా కన్వీనర్ కోటాలో సీటు వచ్చిన విద్యార్థులకు స్పెషల్ ఫీజు మాత్రమే తీసుకొని జాయిన్ చేసుకోవాలని ఆదేశాలున్నాయి. అయితే, మొత్తం ఫీజు చెల్లించాలని యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
కొన్ని కళాశాలల యాజమాన్యాలు 30వేల వరకు వసూలు చేస్తున్నారు. స్పెషల్ ఫీజుతో అండర్‌టేకింగ్ తీసుకొని విద్యార్థులను అడ్మిషన్ చేసుకోవాలని కళాశాలల యాజమాన్యాలకు చెప్పినావినడం లేదు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన అలాట్‌మెంట్ లెటర్‌లో కూడా ఫాస్ట్ పథకం వర్తిస్తుందని పేర్కొన్నా కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. కన్వీనర్ కోటా కింద సాధించిన విద్యార్థులు కళాశాలల చుట్టూ తిరిగి వేసారిన సగం మంది విద్యార్థులు కాలేజీల్లో చేరలేదు. కాలేజీల్లో చేరేందుకు బుధవారం గడువు ముగుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో తమ అడ్మిషన్ల పరిస్థితేంటని వారు ఆందోళన చెందుతున్నారు.
స్పందించని పీయూ అధికారులు..
విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పీయూ అధికారుల దృష్టికి సమస్యను తీసుకుపోయినా పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు కళాశాలల యాజమాన్యాలతో కుమ్మక్కు కావడం వల్లే ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. విద్యార్థుల నుంచి *16,500 ఫీజు వసూలు చేయాలని వీసీ చెప్పారంటూ ఓ కళాశాల ప్రిన్సిపాల్ చెప్పుకుంటున్నా పట్టించుకోవడం లేదు.