డిష్యుం.. డిష్యుం
గద్వాల : గద్వాల రాజకీయ ఆధిపత్యం డిప్యూటీ సీఎం సాక్షిగా తోపులాటలు, అరుపులు, కేకలు నినాదాలతో అట్టుడికింది. రెండువర్గాలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయన్న విషయాన్ని పోలీసులు అంచనా వేయలేక బలగాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోలేకపోయారు. దీంతో డిప్యూటీ సీఎం సభ వద్ద ఆందోళనలు ఎక్కువయ్యాయి. గద్వాల నియోజకవర్గంలో డీకే కుటుంబానికి రెండు పర్యాయాలుగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పోటీనిస్తున్నారు.
వీరిరువురి మధ్య రెండు ఎన్నికలు జరిగాయి. ఇంతటి పోటీ ఉన్న గద్వాలలో ఆసుపత్రుల కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య శనివారం గద్వాలకు వచ్చారు. ఆయన వస్తున్న కార్యక్రమానికి స్వాగతం చెప్పే ఏర్పాట్లు, ప్రకటనల్లోనూ రెండు పార్టీల మధ్య పోటాపోటీ కనిపించింది. అదేవిధంగా కార్యక్రమాల్లోనూ ఆధిపత్యం కొరకు ఎవరి ప్రయత్నం వారు చేశారు. ఇరువురి ప్రయత్నాలతో కార్యక్రమం కేకలు, అరుపులు, తోపులాటలతో అర్థంతరంగా ముగిసింది.
డిప్యూటీ సీఎం కార్యక్రమంలో ఇలా...
ఏరియా ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన వేదికపైకి ముందే చేరుకున్న ఎమ్మెల్యే డీకే అరుణ డిప్యూటీ సీఎంకు స్వాగతం చెప్పారు. అదే ప్రసంగంలోనే వేదికపై ప్రజాప్రతినిధులు కానివారు ఉండరాదని డిమాండ్ చేశారు. కనీసం మాజీ ఎమ్మెల్యే కాని వ్యక్తులు కూడా వేదికపై కూర్చోవడం సరికాదని, అలాంటి వారి ని వేదికపై నుంచి పంపాలని పదే పదే కోరారు. డిప్యూటీ సీఎం రాజయ్య జో క్యం చేసుకొని ఎమ్మెల్యే అరుణకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఎమ్మెల్యే తన పట్టును వీడకపోవడంతో పెద్ద ఎత్తున నినాదాలు, ఈలలు, అరుపులు జరిగాయి.
ఒక దశలో వేదికపై ఉన్న నేతల మధ్య వాగ్వాదం పెరిగిన సందర్భంలో అక్కడికి వేదిక దిగువన ఉన్న నాయకులు చొరబడి తోపులాటకు దిగా రు. అక్కడే ఉన్న డీఎస్పీ బాలకోటి ఆ ధ్వర్యంలోని పోలీసుల బృందం వేదిక పై ఉన్న డిప్యూటీ సీఎం, ఇతర నేతలకు పోలీసులు రక్షణగా నిలిచారు. కింద ఉన్న వారిని చెదరగొట్టేలా లాఠీలను గాల్లోకి విసురుతూ జనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఎంతకూ పరిస్థితి సద్దుమణగకపోవడం, వేదికలో ఉన్న జనం చెల్లాచెదురు కావడం, సభ జరిగే పరిస్థితులు లేని పరిస్థితి ఏర్పడింది. డిప్యూటీ సీఎం సభావేదికను దిగి వెళ్లిపోవడంతో వేదికపైనే ఉన్న అరుణ అనంతరం కార్యకర్తలకు అభివాదం చేసి వెళ్లిపోయారు.
అరుణ, కృష్ణమోహన్‌ల మధ్య
ఆరేళ్లుగా రాజకీయ పోరు...
ఒకే ఇంటి నాయకత్వంలో పనిచేసిన డీకే అరుణ, కృష్ణమోహన్‌రెడ్డిలు 2004 ఎన్నికల అనంతరం వేర్వేరు పార్టీల్లోకి మారారు. డీకే అరుణ భర్త డీకే భరతసింహారెడ్డి సోదరి కుమారుడైన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 2005 ఎన్నికల్లో గద్వాల జెడ్పీటీసీగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. నాటి నుంచి అరుణ, కృష్ణమోహన్‌రెడ్డిల మధ్య రాజకీయ విమర్శలు ప్రారంభమయ్యాయి.
2009 ఎన్నికల్లో కృష్ణమోహన్‌రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం రావడంతో ఆ ఎన్నికల్లో గెలుపు కోసం రెండు కుటుంబాల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు పెరిగాయి. ఆ ఎన్నికల్లోనూ అరుణ తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భరతసింహారెడ్డికి చెందిన క్రస్సింగ్ యూనిట్‌లో నీలి కిరోసిన్ ఉందంటూ కృష్ణమోహన్‌రెడ్డి మీడియాకు చూపించడంతో పాటు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండువర్గాల మధ్య వ్యక్తిగత విమర్శలు ప్రారంభమయ్యాయి. ఆస్తులపై విచారణలు, వాటిని కూలగొట్టడానికి ప్రయత్నాలు చేశారు.
క్రస్సింగ్ ప్లాంట్‌లో అనుమతికి మించి గుట్టలను కబ్జా చేసుకున్నారని కృష్ణమోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో విచారణలు, సర్వేలు జరిగాయి. ఈ సందర్భంలోనూ కృష్ణమోహన్‌రెడ్డి, భరతసింహారెడ్డిల మధ్య తిట్ల దండకం జరిగింది. కృష్ణమోహన్‌రెడ్డికి చెందిన పూడూరు గోదాములలో రోడ్డు కబ్జాలను చూపి ప్రొక్లెయినర్లతో కూలగొట్టించారు. ఇలా కొనసాగుతున్న వైరం మరోసారి 2014 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే ఎన్నికల రంగం వేదికైంది. టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా డీకే అరుణలు పోటీ పడ్డారు. ఈ సందర్భంలోనూ పోటాపోటీ విమర్శలు జరిగాయి.
ఇలా అరుణ, కృష్ణమోహన్‌రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. ఈ క్రమంలో అధికార పార్టీలో ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో తన ప్రత్యేకతను చాటుకునేలా ప్రయత్నిస్తుండగా ఎమ్మెల్యేగా ఉన్న అరుణ తాను ప్రజాప్రతినిధి కనుక కార్యక్రమాల్లో తన గుర్తింపు ఉండాలనే పట్టు ఉంది.
ఈ తరుణంలోనే గద్వాల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ భాస్కర్, డీకే అరుణల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆధిపత్యం కోసం రెండు వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మొదటిసారిగా డిప్యూటీ సీఎం కార్యక్రమం గద్వాలకు ఖరారు కావడం, ఆధిపత్యం కోసం రెండు వర్గాలు ప్రయత్నించడం వల్లే గద్వాలలో డిప్యూటీ సీఎం కార్యక్రమం రసాభాసగా మారిందన్న చర్చ జరుగుతుంది.