సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడం, ఎమ్మెల్యేలంతా మాజీలు అయిన నేపథ్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సాయం ఇకపై నేరుగా లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సంక్షేమశాఖల అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో కల్యాణలక్ష్మిపై సమీక్షించారు. అసెంబ్లీ రద్దు కారణంగా ప్రస్తుతం ఎమ్మెల్యేలు లేకపోవడంతో లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ల ద్వారా చెక్కుల పంపిణీ చేసే అంశాన్ని సీఎస్ ప్రస్తావించారు.
దీనికి ఎన్నికల ప్రవర్తనా నియమావళికి తోడు ఎన్నికల పనుల్లో కలెక్టర్లు బిజీ కావడంతో చెక్కుల పంపిణీ మరింత ఆలస్యం కావచ్చనే అభిప్రాయాన్ని కొందరు అధికారులు వ్యక్తం చేశారు. దీంతో నేరుగా లబ్ధిదారుల ఖాతాకే నగదును పంపిణీ చేయాలని సీఎస్ నిర్ణయించారు. ఇకపై కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సం బంధించి వచ్చిన దరఖాస్తులను వారంలోగా పరిష్కరించి అర్హతను నిర్ధారించాలన్నారు. అర్హత నిర్ధారణ జరిగిన మరో వారం రోజుల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు నగదును బదిలీ చేసేలా ఖజానా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment