రైతు ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకోండి
నివారణకు తగిన సలహాలు, సూచనల స్వీకరణకు కమిటీ వేయండి
ఏపీ, తెలంగాణ రాష్ట్ర {పభుత్వాలకు హైకోర్టు ఆదేశం
మూలాల్లోకి వెళ్లి వెతికితేనే శాశ్వత పరిష్కారం లభిస్తుంది
రుణమాఫీ లబ్ధి చిన్న, సన్నకారు రైతులకు దక్కేలా చూడండి
అసలు రుణమాఫీ సరైన విధానమే కాదన్న ధర్మాసనం
విచారణ 4వ తేదీకి వాయిదా
హైదరాబాద్: రైతులు ఆత్మహత్యలకు పాల్పడటానికి ప్రధాన కారణాలేమిటో తెలుసుకోవాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మూలాల్లోకి వెళ్లి వెతికితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొంది. ఆత్మహత్యల నివారణకు అన్ని వర్గాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాతనే ఈ వ్యాజ్యాలపై విచారణ చేపడతామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెతుల ఆత్మహత్యల నివారణకు ఉభయ రాష్ట్రాలు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేయడంతో పాటు, రైతుల ఆత్మహత్యల నివారణకు 2006లో స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను అమలు చేసేలా ఏపీ, తెలంగాణలను ఆదేశించాలని కోరుతూ వ్యవసాయ జన చైతన్య సమితి అధ్యక్షుడు రామయ్య యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో జీవో 69 ప్రకారం రూ.1 లక్ష వరకు రైతులు తీసుకున్న పంట, బంగారు రుణాలను వన్ టైం సెటిల్‌మెంట్ కింద మాఫీ చేసేలా ఆ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త దొంతిరెడ్డి నర్సింహారెడ్డి, మరొకరు కూడా వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ ప్రొఫెసర్ కోదండరాం అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ.. రైతులను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించేందుకు రూ.17వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
ఆత్మహత్యలపై ఎప్పుడైనా సర్వే చేశారా?
ధర్మాసనం జోక్యం చేసుకుని.. రైతుల ఆత్మహత్యలకు రుణాల బాధ ఒక్కటే కారణం కాదని, అనేక కారణాలున్నాయని పేర్కొంది. ప్రధాన కారణాలేమిటో తెలుసుకోవాలంది. ‘అసలు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఎప్పుడైనా సర్వే చేసి తెలుసుకున్నారా..? బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి మాట్లాడారా..? ఆత్మహత్యలకు ఉన్న ఒకేరకమైన కారణాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారా..? ఇవన్నీ చేయకుండా, మూలాల్లోకి వెళ్లి సమస్యను తెలుసుకోకుండా, అవి చేస్తున్నాం.. ఇవి చేస్తున్నామంటే ఆత్మహత్యలు ఆగుతాయా..! మహారాష్ట్రలో కూడా రుణమాఫీ అమలవుతోంది. అక్కడ వందల ఎకరాలున్న ఆసాములు మైనర్లయిన తమ పిల్లల పేర్ల మీద రుణాలు తీసుకుంటున్నారు. రుణమాఫీ పొందుతున్నారు. ఇలా వందల ఎకరాలున్న వారికి రుణమాఫీ వర్తింప చేయాలా..? ఇటువంటి వారికి రుణమాఫీ ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం కలుగుతోంది?’ అని ప్రశ్నించింది. రైతుల ఆత్మహత్యల నివారణకు రుణమాఫీ ఎంతమాత్రం పరిష్కారం కాదని వ్యాఖ్యానించింది. తీసుకున్న రుణాన్ని కట్టొద్దని రైతులకు చెప్పినంత మాత్రాన వారి సమస్యలన్నీ తీరిపోవని, అసలు రుణమాఫీ సరైన విధానం కాదని అభిప్రాయపడింది. రుణ మాఫీయే పరిష్కారమైతే, రైతులు ఇంకా ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. రుణమాఫీ వల్ల అర్హుల కంటే అనర్హులకే ఎక్కువ లబ్ది చేకూరుతోందని తెలిపింది.
‘పాతిక, ముప్పై ఎకరాలున్న రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారా? లేదు కదా. ఆత్మహత్యలు చేసుకుంటోంది ఎకరం, రెండెకరాలున్న చిన్న, సన్నకారు రైతులే కాబట్టి రుణమాఫీ వారికి మాత్రమే అందేలా చూడాలి. అప్పుడే కొంతవరకైనా వారి ఆర్థిక కష్టాలు తీరతాయి..’ అని సూచించింది. ఈ సమయంలో కోదండరాం తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి స్పందిస్తూ.. ఆత్మహత్యల నివారణ చర్యల కోసం నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. రైతుల కోసం ప్రభుత్వాల ద్వారా ఇప్పటివరకు 53 కమిటీలు ఏర్పాటైనా.. కోర్టు ద్వారా కమిటీ ఏర్పాటు కాలేదని తెలిపారు. కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం వ్యవహారాన్ని కోర్టే పర్యవేక్షించాలని కోరారు. తమ పర్యవేక్షణ సాధ్యం కాదని చెప్పిన ధర్మాసనం.. నిపుణుల కమిటీ విషయంలో ప్రస్తుతం ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేమంటూ.. ఆత్మహత్యల నివారణకు అన్ని వర్గాల నుంచి సూచనలు, సలహాలు తీసుకునేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రెండు రాష్ట్రాలూ కలసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటాయా..? లేక వేర్వేరుగా చేసుకుంటారా..? అన్నది పరస్పరం చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.