
రంగారెడ్డి కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం
► వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా చెలరేగిన మంటలు
► ప్రాణభయంతో పరుగులెట్టిన అధికారులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సమయం మధ్యాహ్నం 2.50 గంటలు. ప్రశాంతంగా కొనసాగుతున్న వ్యవసాయ శాఖ వీడియో కాన్ఫరెన్స్ .. ఇంతలో ఒక్కసారిగా ఎగిసిన మంటలు.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే చుట్టూ దట్టంగా ఆవహించిన పొగ.. ప్రాణభయంతో అధికారులు, సిబ్బంది పరుగులు.. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో కనిపించిన ప్రమాదకర దృశ్యాలివి. స్నేహ సిల్వర్ జూబ్లీ భవనం మొదటి అంతస్తులోని వీడియో కాన్ఫరెన్స్ హాలు అగ్నికి ఆహుతైంది.
ఆ సమయంలో ఆ హాలులో 30 మందికిపైగా ఉండటం గమనార్హం. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో పైన ఉన్న ఇంటీరియర్‌కు తాకాయి. అది ముందే ఏసీ హాలు. అన్ని కిటికీలు, ప్రధాన ద్వారం మూసి ఉన్నాయి. దీంతో అసలేం కనిపించనంత స్థాయిలో పొగ కమ్ముకోవడంతో.. బిక్కుబిక్కుమంటూ సిబ్బంది గ్రౌండ్‌ఫ్లోర్‌కి పరుగులు తీశారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.
‘సాక్షి’ హెచ్చరించినా..మేల్కొనని అధికారులు
కలెక్టరేట్‌లో ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ వైర్లు తేలి కనిపిస్తున్న తీరుపై ఇటీవలే ‘సాక్షి’ఫొటో స్టోరీని ప్రచురించింది. దీన్ని హెచ్చరికగా భావించి అధికారులు మేల్కోకపోవడం గమనార్హం.