రైస్‌మిల్లులో కాలిపోతున్న మిర్చి బస్తాలు
మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని సాయికృష్ణ బిన్ని రైస్‌మిల్లులో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మిల్లు ప్రస్తుతం పనిచేయకపోవడంతో అందులో నిల్వ ఉంచిన మిర్చి, పత్తి, కందులు, అపరాలు కాలిబూడిదయ్యాయి. ఉదయం 7 గంటలకు మిల్లు నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు, అందులో సరుకులు నిల్వ ఉంచిన వ్యాపారులకు సమాచారం ఇచ్చారు.
వారు వెంటనే అక్కడికి చేరుకుని అగ్నిమాపకదళం, పోలీస్ అధికారులకు ప్రమాదం విషయాన్ని తెలియజేశారు. మహబూబాబాద్ అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండటంతో ఇల్లందు, నర్సంపేట, మరిపెడ, వరంగల్ ప్రాంతాల నుంచి అదనపు అగ్నిమాపక వాహనాలను రప్పించారు. టౌన్ సీఐ జబ్బార్ పొక్లెయిన్ తెప్పించి మిల్లు గోడలు పగులగొట్టించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.కోటి విలువైన సరుకులు కాలిపోగా, రూ.కోటి విలువైన భవనం కూలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment