పాత లెక్కలా..? | first budget Telangana State | Sakshi
Sakshi News home page

పాత లెక్కలా..?

Published Wed, Nov 5 2014 4:43 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM

first budget Telangana State

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న తొలి బడ్జెట్‌పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా ఆరు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించిన జిల్లాకు ఏ మేరకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇస్తారనేది కూడా చర్చనీయాంశమవుతోంది.  సాగునీటి ప్రాజెక్టులకు ఏ మేరకు నిధులు కేటాయిస్తారోనని అన్ని రాజకీయ పక్షాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. జిల్లాలోని ఎస్సారెస్పీ రెండోదశ, ఎస్‌ఎల్‌బీసీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, ఎడమకాల్వ పనుల ఆధునికీకరణలతోపాటు మధ్య తరహా ప్రాజెక్టులైన మూసీ, పిలాయిపల్లి కాల్వ, బునాదిగానికాల్వ, ఆసిఫ్‌నహర్ లాంటి పథకాల పనులు త్వరగా పూర్తయ్యేలా నిధుల కేటాయింపులు ఉంటాయా.. లేదా అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రధాన చర్చ. నిమ్స్ అభివృద్ధికి ఎంత కేటాయిస్తారు? ‘మన ఊరు - మన ప్రణాళిక’లో తయారుచేసిన ప్రతిపాదనలకు మోక్షం లభిస్తుందా? విద్యార్థులకు ఫీజు డబ్బులు సరిపోతాయా? పెండింగ్‌లో ఉన్న దళిత, గిరిజనుల రుణాల మంజూరుకు ఇప్పటికైనా నిధులిస్తారా? అనే అంశాలన్నింటికీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం ఉదయం శాసనసభలో విప్పే బడ్జెట్ చిట్టా సమాధానం చెప్పనుంది.
 
 నాగార్జునసాగర్‌పై నజర్ పెట్టాల్సిందే..
 
 ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న నాగార్జున సాగర్ ఆధునికీకరణ పనులకు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.4,444 కోట్లు అంచనా వ్యయం కాగా, గత బడ్జెట్‌లో పెట్టింది రూ.743 కోట్లు. దీనికి తోడు ఆధునికీకరణ ప్రారంభించక ముందు మొదలు పెట్టిన పనులు, సిబ్బంది జీతభత్యాలు, కరెంటు చార్జీలు, ఇతరత్రా ఖర్చుల కోసం గత బడ్జెట్‌లో రూపాయి కూడా చూపలేదు. ఈ నేపథ్యంలో సాగర్ ఆధునికీకరణ కోసం టీఆర్‌ఎస్ సర్కారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నది జిల్లా వాసుల వినతి. మరోవైపు కీలకమైన మరో ప్రాజెక్టుపై  ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. అదే నాగార్జున సాగర్ టెయిల్ పాండ్. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే సాగర్‌లో జలవిద్యుదుత్పత్తితో పాటు వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది. రివర్సబుల్ టర్బైన్ల ద్వారా కిందికి వదిలే నీటిని మళ్లీ ప్రాజెక్టులోనికి మళ్లించుకునే అవకాశం ఉన్న ఈ ప్రాజెక్టుపై కూడా ఓ నజర్ పెట్టాల్సి ఉంది.
 
 నిమ్స్‌కు నిధులు వచ్చేనా..?
 భువనగిరి
 బీబీనగర్ మండలం రంగాపూర్ వద్ద నిర్మిస్తున్న నిమ్స్ అస్పత్రి పనులు నిధుల లేమితో నిలిచిపోయాయి. ప్రభుత్వం తాత్కాలిక, అత్యవసర పనుల కోసం రూ.5 కోట్లు కేటాయించిన విషయం విధితమే. అయితే రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య జూన్ 15న నిమ్స్‌న సందర్శించి రెండు నెలల్లో ఓపీ సేవలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అలాగే నిమ్స్ ఆస్పత్రితో పాటు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో నిమ్స్‌కు మోక్షం కలిగేనా అని ఈ ప్రాంత ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
 ఇవీ ప్రారంభిస్తామన్నారు.

 నిమ్స్‌లో వైద్య సేవలు అందుబాటులోకి తేవడానికి గత ప్రభుత్వం తాత్కాలికంగా 200 బెడ్లతో ఆస్పత్రిలో వైద్యసేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి దశలో ఆర్ధోపెడిక్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పిడియాట్రిక్స్, పల్మనాలజీ, నెప్రాలజీ, యూరాలజీ విభాగాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఓక్కో విభాగానికి 20 పడకలచొప్పున 140 పడకలు. వీటికి అనుబంధంగా మరో 60 పడకలతో మొత్తం 200 పడకలతో ఆస్పత్రిని రోగులకు అందుబాటులోకి తేవాలని నిశ్చయించింది. ఇప్పటికే ఉన్న భవనసముదాయంలో అవసరమైన నిర్మాణాలకోసం రూ.23 కోట్లు, విద్యుత్ సబ్‌స్టేషన్ కోసం రూ.4కోట్లు, వైద్య పరికారాల కోసం రూ.15 కోట్లు, సిబ్బంది, వైద్యుల నివాస భవన సదుపాయాలకు రూ.9.75 కోట్లు, ఇతర అవసరాలకు రూ. 8.25కోట్లు కేటాయించారు.
 
 నిధుల కేటాయింపులో తీవ్ర జాప్యం
 రూ.220 కోట్ల అంచనాతో చేపట్టిన నిమ్స్‌కు రూ.100 కోట్లు మంజూరు చేసి 2005 డిసెంబర్ 1న పనులను చేపట్టారు. 2009 ఫిబ్రవరి 22న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ఆ వెంటనే మరో రూ.50 కోట్లు కేటాయించారు. ఇందులో నిమ్స్ ట్రస్ట్ ఫండ్ రూ.40కోట్లు కాగా, రాష్ట్ర ఆర్థ్ధిక శాఖ రూ.10 కోట్లు కేటాయించింది. అప్పటికే పనులు ప్రారంభించి మధ్యలో వదిలేసి వెళ్లిన కాంట్రాక్ట్ సంస్థకు బకాయి కింద చెల్లించారు. వాస్తవానికి నిర్మాణపు పనులు రూ. 90 కోట్ల మేరకు జరిగాయని ఇంజినీరింగ్ అధికారులు తేల్చారు. ఈ మేరకు పూర్తి బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్ట్ సంస్థ పనులను ఎక్కడికక్కడే వదిలి వెళ్ళింది. ప్రస్తుతం సివిల్ పనులు చేస్తోంది. నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాల ప్రజలతో పాటు హైదరాబాద్ నగర ప్రజలకు అత్యాధునిక కార్పోరేట్ వైద్యాన్ని అందించే వీలున్న నిమ్స్‌కు నిధులు కేటాయించి పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
 
 సా...గుతున్న ఎస్‌ఎల్‌బీసీ
 శ్రీశైలం ఎడమగట్టు బ్రాంచ్ కెనాల్ 2010 సంవత్సరంలోనే పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు పరిపాలన అనుమతులే రూ.2800 కోట్ల పైమాటే. దీనికి తోడు ఇందులో అంతర్భాగమైన డిండి ప్రాజెక్టు(రూ.232 కోట్లు), ఉదయ సముద్రం ఎత్తిపోతల(రూ.562కోట్లు), ఏఎమ్మార్పీ ప్రాజెక్టులకు వేలకోట్ల ఖర్చు పెట్టాల్సి ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్టుకు గత బడ్జెట్‌లో పెట్టింది కేవలం రూ.420 కోట్లే. ఇలా కేటాయింపులు చేస్తే మరో పదేళ్లకు కూడా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి కావడం అనుమానమే.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement