
నకిలీ ‘ఆధార్’ కేసులో ఐదుగురి రిమాండ్
లింగంపేట : ఆధార్ కార్డులలో తక్కువ వయస్సు ఉండగా, ఎక్కువ వయస్సు ఉన్నట్లు చేసి తప్పుడు ఆధార్ కార్డులను తయారుచేసిన కేసులో బుధవారం ఐదుగురి నిందితులను రిమాండ్ చేసినట్లు ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎంజీఎస్ రామకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. మండలంలోని ఎక్కపల్లితండాకు చెందిన గుగ్లోత్ సక్రూ, సబావత్ హరియా, లింగంపేట గ్రామానికి చెందిన కటికెరాజయ్య అనే వ్యక్తులు వృద్ధాప్య పింఛన్లను అక్రమంగా పొందడానికి ఎల్లారెడ్డిలోని ఎస్‌ఎస్ కంప్యూటర్ నిర్వాహకుడు దర్జి ప్రవీణ్ కుమా ర్, లింగంపేటలోని రేణుకా జిరాక్స్‌సెంటర్ నిర్వాహకుడు గుర్రపు నరేష్‌లను సంప్రదించారు.
తమకు ఎక్కువ వయస్సు ఉన్నట్లుగా ఆధార్ కార్డులను తయారు చేసి ఇవ్వాలని కోరారు. వీరి అవసరాన్ని ఆసరా చేసుకున్న ప్రవీణ్,నరేష్ డబ్బులకు ఆశపడి కంప్యూటర్, ల్యాప్‌టాప్, కలర్ ప్రింటర్స్‌ల సహాయంతో ఎక్కువ వయస్సు ఉన్నట్లుగా ఆధార్‌కార్డులను తయారుచేసి ఇచ్చారు. వాటిని తీసుకున్న సక్రూ, హరియా, కటికె రాజయ్యలు తమకు వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని స్థానిక ఎంపీ డీఓ సతీష్ వద్దకు వెళ్లారు.
ఆధార్ కార్డులను పరిశీలించిన ఎంపీడీఓ అవి నకిలీవిగా గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ పల్లె రాకేశ్ విచారణ చేపట్టగా డబ్బులకు కక్కుర్తి పడి ప్రవీణ్, నరేష్ బోగస్ ఆధార్‌కార్డులు తయారుచేసినట్లు తేలిందన్నారు. వీరి నుంచి ఐదు స్కానర్‌కం జిరాక్స్ మిషన్లు, రెండు కంప్యూటర్లు, రెండు ప్రింటర్లు, ఒకటి లామినేషన్ మిషన్, ఒక ల్యాప్‌టాప్ (రెండులక్షల విలువ జేసే ఎలక్ట్రానిక్ పరికరాలు) లను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. వీరిపై కుట్ర, ఫోర్జరీ, చీటింగ్ కేసులను నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.