
సాక్షి, సిద్దిపేట: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఓ ట్రైనీ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా దుద్దెడ శివారులో జరిగింది. హైదరాబాద్ హకీంపేటకు చెందిన బ్రిగేడియర్ రాజీవ్ రైనా కుమార్తె.. రాశి రైనా (24) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (హకీంపేట అకాడమీ)లో శిక్షణ పొందుతోంది. రోజువారీగా శుక్రవారం 4 ఎయిర్‌క్రాఫ్ట్‌లలో రాశి, ఇతర సహచరులు సిద్దిపేట వైపు వచ్చారు. రాశి ఉన్న శిక్షణ విమానం దుద్దెడ సమీపంలోని దర్గా బందారం కమాన్ సెంటర్ వద్ద చక్కర్లు కొట్టింది. దీంతో వెంటనే ఆమె అప్రమత్తమై సహచరులకు సమాచారం అందించింది. అనంతరం ప్యారాచూట్ సహాయంతో కిందికి దిగేందుకు ప్రయత్నించింది.
అదే సమయంలో హెలికాప్టర్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్యారాచూట్‌కు రంధ్రాలు పడ్డాయి. భూమికి 50 ఫీట్ల ఎత్తుకు రాగానే ప్యారాచూట్ మూసుకుపోయింది. ఈ క్రమంలో రాశి రాజీవ్ రహదారిపై పడటంతో చెయ్యి, కాలు విరిగాయి. ఎయిర్‌క్రాఫ్ట్ పెద్ద శబ్దంతో కిందకు పడిపోవడంతో ఇంజిన్ కాలిబూడిదైంది. కాగా, అదే సమయంలో అక్కడే పనిచేస్తున్న గ్రామస్తులు వెంటనే 108కు సమాచారం అందించారు. రాశిని సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందచేశారు. విషయం తెలుసుకున్న ఇండియన్ ఎయిలైన్స్ అధికారులు, మెడికల్ సిబ్బంది హుటాహుటిన సిద్దిపేటకు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో బాధితురాలిని హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. శిక్షణ విమాన శకలాలు, రాశి వస్తువులు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment