సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రోడ్డు దాటేందుకు పలు ఇబ్బందులు పడుతున్న పాదచారులకు కొన్ని ప్రాంతాల్లో త్వరలో ఉపశమనం లభించనుంది. మొత్తం 60 రద్దీ ప్రాంతాల్లో పాదచారులు రోడ్డు దాటేందుకు అవసరమైన 52 ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు(ఎఫ్‌ఓబీ), 8 జంక్షన్లలో స్కైవేలు నిర్మించేందుకు రూ. 207.71 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం దాదాపు ఐదునెలల క్రితం పరిపాలన అనుమతులు మంజూరు చేయగా...జీహెచ్‌ఎంసీ టెండర్లను ఆహ్వానించింది. మొత్తం నాలుగు ప్యాకేజీలుగా ఈ టెండర్లు పిలవగా, వీటిల్లో మొదటి ప్యాకేజీ టెండర్లు పూర్తయ్యాయి. టెండరు దక్కించుకున్న ఏజెన్సీకి త్వరలో వర్క్ ఆర్డర్ ఇవ్వనున్నారు. అగ్రిమెంట్ పూర్తయ్యాక ఏడెనిమిది నెలల్లోగా ఇవి అందుబాటులోకి రానున్నాయి. మొదటి ప్యాకేజీలో భాగంగా 11 ఫ్లై ఓవర్లతో పాటు ఉప్పల్ రింగ్‌రోడ్డు వద్ద స్కైవేను కూడా నిర్మించనున్నారు. వీటన్నింటి అంచనా వ్యయం రూ. 47.80 కోట్లు. ఈ ఎఫ్‌ఓబీలు, స్కైవే అందుబాటులోకి వస్తే మొత్తం 12 రద్దీ ప్రాంతాల్లో పాదచారులు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు తప్పనున్నాయి.
ఎట్టకేలకు..
నగరంలో పలు రద్దీప్రాంతాల్లో రోడ్డు దాటలేక పాదచారులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. రోడ్డు దాటుతుండగా, ప్రమాదాల బారిన పడుతున్న వారూ అధికసంఖ్యలోనే ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఆయా ప్రాంతాల్లో పాదచారులు రోడ్డు దాటేందుకు ఎఫ్‌ఓబీలు నిర్మించేందుకు ఎంతోకాలంగా ప్రయత్నాలు జరిగినా ఆచరణకు నోచుకోలేదు. వివిధ కారణాలతో నిర్మాణం ప్రారంభం కాక లక్ష్యం నీరుగారిపోయింది. గతంలో పీపీపీ పద్ధతిలో నిర్మించాలనుకున్నారు. వాటివల్ల పాదచారుల ఉపయోగం కంటే టెండరు దక్కించుకున్న ఏజెన్సీల వ్యాపార ప్రకటనలే ఎక్కువవుతాయని భావించి, టెండరు నిబంధనలు మార్చారు. వాటి మేరకు వ్యాపార ప్రకటనల ఆదాయం పెద్దగా ఉండదు. దాంతో ఏజెన్సీలు ముందుకు రాలేదు. ఈనేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల ఆధ్వర్యంలోనే ఎఫ్‌ఓబీలు నిర్మించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీలో నిధుల లేమి తదితర కారణాలతో 44 ఎఫ్‌ఓబీల నిర్మాణం హెచ్‌ఎండీఏకు అప్పగించినా, అదీ చేతులెత్తేసింది. కేవలం ఐదు తప్ప మిగతా 39 ప్రాంతాల్లో నిర్మాణం తాము చేయలేమని పేర్కొంది. వాటితో సహ మొత్తం 52 ఎఫ్‌ఓబీలు, 8 జంక్షన్ల నిర్మాణ బాధ్యతల్ని జీహెచ్‌ఎంసీకే అప్పగించింది. వీటిల్లో 39 ఎఫ్‌ఓబీలకయ్యే వ్యయాన్ని హెచ్‌ఎండీఏ, మిగతా వ్యయాన్ని జీహెచ్‌ఎంసీ భరిస్తుంది.
త్వరలో పనులు..
మొత్తం 52 ఎఫ్‌ఓబీలు, 8 స్కైవేలకు నాలుగుప్యాకేజీలుగా టెండర్లు ఆహ్వానించారు. వీటిల్లో మొదటి ప్యాకేజీ టెండర్లు పూర్తయ్యాయి. పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మిగతా మూడు ప్యాకేజీల టెండర్లు ఈనెలాఖరుకు పూర్తికానున్నాయని సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకట్‌రెడ్డి తెలిపారు.
మొదటి ప్యాకేజీలో భాగంగా ఎఫ్‌ఓబీలు, స్కైవే నిర్మించనున్న ప్రాంతాలు..
♦ చక్రిపురం క్రాస్‌రోడ్స్(నాగారం)
♦ హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్, రామంతాపూర్
♦ నోమా ఫంక్షన్‌హాల్, మల్లాపూర్
♦ సాయిసుధీర్ కాలేజ్ బస్టాప్(ఏఎస్‌రావునగర్)
♦ విశాల్‌మార్ట్, రామంతాపూర్
♦ ఎస్‌బీఐ, హబ్సిగూడ
♦ సుష్మ థియేటర్, వనస్థలిపురం
♦ దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్
♦ కొత్తపేట ఫ్రూట్‌మార్కెట్
♦ సరూర్‌నగర్ స్టేడియం
♦ వర్డ్ అండ్ డీడ్ స్కూల్, హయత్‌నగర్
♦ స్కైవే (ఉప్పల్ రింగ్‌రోడ్)
వీటిల్లో చక్రిపురం క్రాస్‌రోడ్స్, నోమా ఫంక్షన్‌హాల్, సుష్మ థియేటర్, దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్, కొత్తపేట ఫ్రూట్‌మార్కెట్, సరూర్‌నగర్ స్టేడియం, వర్డ్ అండ్ డీడ్ స్కూల్‌ల వద్ద ఎఫ్‌ఓబీలతోపాటు ఉప్పల్ స్కైవే వద్ద ఎస్కలేటర్లను సైతం నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment