
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఫుట్‌పాత్‌లు, రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. ముఖ్యంగా ఫుట్‌పాత్‌లు సరిగా లేక, ఉన్నవి ఆక్రమణలకు గురవడంతో నగరంలో నడవడమే యాతనగా మారిందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రహదారులు, ఫుట్‌పాత్‌ల పనులపై దృష్టి సారించారు. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టి దాదాపు నాలుగు నెలల కాలంలో 12 వేల ఆక్రమణలను తొలగించారు. వీటిని తొలగించిన ప్రాంతాల్లో «ధ్వంసమైన ఫుట్‌పాత్‌లను పునరుద్ధరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పీపీఎం (పీరియాడికల్ ప్రివెంటివ్ మెయింటనెన్స్)లో భాగంగా రీకార్పెటింగ్ చేస్తున్న ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్లతోపాటే ఫుట్‌పాత్‌లు కూడా నిర్మించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఆదేశించారు.
900 కి.మీ. ఎప్పటికో?
నగరంలోని అన్ని ప్రధానమార్గాల్లో దాదాపు 900 కి.మీ.ల మేర ఫుట్‌పాత్‌లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న ఫుట్‌పాత్‌ల నిర్వహణ సైతం సరిగా లేదు. వీటి నిర్వహణను మెరుగుపరచాల్సిందిగా కమిషనర్ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. పీపీఎంలో భాగంగా రూ.721 కోట్లతో దాదాపు 800 లేన్ కి.మీ.ల మేర రోడ్ల రీకార్పెటింగ్ పనులు చేపట్టారు. వాటితో పాటే ఫుట్‌పాత్‌ల నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు పూర్తయినప్పటికీ, అన్ని ప్రాంతాల్లో కాలేదు. వాటితో సహా మొత్తం 900 కి.మీ.ల మేర ఫుట్‌ఫాత్‌లు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక అధికారులు, సిబ్బంది మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నమవడంతో పాటు ఎన్నికల కోడ్ కారణంగా పనులకు బ్రేక్ వేశారు.కోడ్ ముగియడంతో ఇక యుద్ధప్రాతిపదికన పుట్‌ఫాత్ నిర్మాణాలు పూర్తిచేయాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు.
నడక దారేదీ..?
జీహెచ్‌ఎంసీ చేపట్టిన కూల్చివేతల స్పెషల్ డ్రైవ్‌కు పలు ప్రశంసలు లభించాయి. ఇప్పటి వరకు దాదాపు 12 వేల ఆక్రమణల్ని తొలగించారు. కానీ ఆమేర నడక సదుపాయం అందుబాటులోకి రాలేదు. తొలగింపు సందర్భంగా ఫుట్‌పాత్‌లు ధ్వంసమైన ప్రాంతాల్లో మరమ్మతులు, కొత్త ఫుట్‌పాత్‌ల నిర్మాణం తదితరమైన వాటికి దాదాపు రూ.88 కోట్లతో 310 కి.మీ.ల మేర ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఈపనుల్ని అక్టోబర్‌లోగా పూర్తిచేయాలని గత ఆగస్టులో నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్..తదితర కారణాలతో పనులు ముందుకు కదల్లేదు. ఈలోపున మళ్లీ పలు ప్రాంతాల్లో తిరిగి ఆక్రమణలు మొదలయ్యాయి. కుత్బుల్లాపూర్ సుచిత్ర రోడ్,సికింద్రాబాద్ మినర్వా కాంప్లెక్స్, పీజీరోడ్ , ప్యారడైజ్ మంజు ధియేటర్, మినర్వా గ్రాండ్ హోటల్ , ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ , అశోక్‌నగర్, తార్నా క, సంతోష్‌నగర్, కంచన్‌బాగ్, మదీనగూడ.. ఇలా ఆక్రమణాలు తొలగించిన చాలా ప్రాంతాల్లో తిరిగి వ్యాపారాలు వెలిశాయి. దీంతో ప్రజలకు నడకదారి అందుబాటులోకి రాలేదు.
పాదచారుల మృతి..
ఈ సంవత్సరం ఆరంభం నుంచి ఇప్పటి వరకు నగరంలో దాదాపు 2500 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, వీటిల్లో దాదాపు వందమంది పాదచారులు మృతిచెందారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పుట్‌పాత్‌ల వెడల్పు ఇరుగ్గా ఉంది. ఇవి పాదచారులు నడవడానికి అనుకూలంగా లేవు.
మారని రోడ్ల దుస్థితి..
ఫుట్‌పాత్‌ల పరిస్థితి ఇలా ఉండగా..నగరంలోని అనేక ప్రాంతాల్లో నాలుగు చినుకులకే రోడ్లు అధ్వాన్నంగా మారాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం రోడ్ల సమస్యలు తీర్చాలంటూ పలువురు నెటిజెన్లు ట్విట్టర్‌లో కోరారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ పొంగిపొర్లుతోందని, కొన్ని ప్రాంతాల్లో రోడ్లను తవ్వి తిరిగి వేయలేదని ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment