శంషాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు విదేశీ నకిలీ కరెన్సీ పట్టుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ కథనం ప్రకారం.. సోమవారం ఉదయం నగరానికి చెందిన యువకుడు ఆది శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కస్టమ్స్ తనిఖీల్లో అతడి వద్ద దుబాయ్‌కి చెందిన దీర్హామ్‌లతో పాటు సౌదీకి చెందిన నకిలీ రియాల్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. భారత కరెన్సీలో వీటి విలువ సుమారు రూ. 74 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. కాగా, నకిలీ కరెన్సీ పట్టుకున్న వివరాలను విమానాశ్రయవర్గాలు అధికారికంగా వెల్లడించలేదు.