మన పులులు క్షేమమే..!
► రాష్ట్రంలో 23 పులులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు
► పులుల కోసం బిహార్ నుంచి వేటగాళ్ల ముఠా!
► సమాచారం అందడంతో పులుల లెక్క తేల్చిన అటవీ సిబ్బంది
► నల్లమలలో 14, కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులో 9సీసీ కెమెరాలు, పాద ముద్రల ద్వారా గుర్తింపు
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలోని అడవుల్లో ఉన్న పులులు క్షేమంగా ఉన్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. నల్లమల టైగర్ రిజర్వులో 14, కవ్వాల్ అభయారణ్యంలో 9 పులులు కలిపి మొత్తంగా రాష్ట్రంలో 23 పులులు ఉన్నట్లు లెక్కించారు. నల్లమలలో పెద్ద పులుల వేటగాళ్లు సంచరిస్తున్నారన్న సమాచారం అందడంతో అప్రమత్తమైన అధికారులు.. అటవీ ప్రాంత గిరిజనులను, సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు పులులను గుర్తించే ప్రక్రియను చేపట్టారు. సీసీ కెమెరాల చిత్రాలు, పులుల పాదముద్రలు, పెంటిక (మలం) పరీక్షల ద్వారా వాటి సంఖ్యను, ఆరోగ్యాన్ని నిర్ధారించారు.
సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు పులుల గణనను చేపట్టారు. తెలంగాణ ఏర్పాటయ్యాక పూర్తిస్థాయిలో గణనను చేపట్టలేదు. కానీ వాటి సంఖ్యను నిర్ధారించుకునే ప్రయత్నాలు చేశారు. పులులు తిరిగే ప్రాంతాల్లో ప్రతి నాలుగు చదరపు కిలోమీటర్లకు ఒక జత చొప్పున సీసీ కెమెరాలను అమర్చి వాటి ఉనికిని నిర్ధారించారు. ఇక టైగర్ ట్రాకర్లు (పులుల ఆనవాళ్లను గుర్తించేవారు) కూడా తమకు కేటాయించిన చోట్ల ఆనవాళ్లను గుర్తించి అధికారులకు అందజేశారు. వీటన్నింటి ఆధారంగా నల్లమలలో 14 పులులు, కవ్వాల్ ప్రాజెక్టులో 9 పులులు ఉన్నాయని.. అవి వాటి పిల్లలతో సహా సురక్షితంగా ఉన్నాయని గుర్తించారు. మహారాష్ట్రలో పులుల సంఖ్య పెరగడంతో అక్కడి నుంచి మన రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులోకి పులులు వలస వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
వేటగాళ్లను వదలబోం..
‘‘బిహార్ ప్రాంతం నుంచి వేటగాళ్ల ముఠా ఒకటి వచ్చిందనే సమాచారం వచ్చింది. కానీ వాళ్లు అడవుల్లోకి ప్రవేశించినట్టు ఆనవాళ్లు దొరకలేదు. వేటగాళ్లు సాధారణంగా అడవిలోకి గుంపుగా వెళతారు. ఇక్కడి భాష కూడా మాట్లాడలేరు. దాంతో అడవుల్లోని గిరిజనులు, అటవీ సిబ్బంది వెంటనే పసిగడతారు. వారిని వదలబోం.’’
– అటవీ జంతు సంరక్షణ విభాగం ఓఎస్‌డీ శంకరన్
కృష్ణా నదిని దాటుతూ..
నల్లమల అటవీ ప్రాంతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సరిహద్దుగా కృష్ణా నది ప్రవహిస్తుంది. ఇక్కడ తెలంగాణ అటవీ ప్రాంతంలోని ఒకటి, రెండు పులులు ఏపీ అటవీ ప్రాంతంలోకి వెళ్లగా... అక్కడి పులులు కొన్ని తెలంగాణ ప్రాంతంలోకి వచ్చాయి. దీంతో పులులు కృష్ణా నదిని దాటుతూ.. అటూ ఇటూ తిరుగుతున్నాయని ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా మార్కాపురం ఫారెస్టు డివిజన్ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్ ఫారెస్ట్ డివిజన్‌లోకి ఒక పులి వచ్చిందని.. మన్ననూర్ నుంచి కర్నూలు జిల్లా ఆత్మకూర్ ఫారెస్టు డివిజన్‌లోకి ఒక పులి వెళ్లిందని అధికారులు నిర్ధారించారు.