
అడవిలో అరాచకం
► గొత్తికోయలపై అటవీశాఖ సిబ్బంది దౌర్జన్యం
► 36 కుటుంబాలపై విరుచుకుపడ్డ 200 మంది
► జేసీబీలు, ట్రాక్టర్లతో ఇళ్లు, గుడిసెల కూల్చివేత
► అడ్డొచ్చిన మహిళలను చెట్టుకు కట్టేసి చావబాదిన వైనం
► తిరగబడ్డ గొత్తికోయలు..
► రణరంగంగా మారిన తాడ్వాయి అటవీ ప్రాంతం
► జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
తాడ్వాయి: వారంతా పదేళ్లుగా ఆ అడవిలో నివాసం ఉంటున్నారు.. పోడు వ్యవసాయం చేసుకుంటూ పొట్టబోసుకుంటున్నారు.. అడవిని వదలాలంటూ అధికారులు ఎన్నోసార్లు హుకుం జారీ చేసినా పట్టించుకోలేదు.. చివరికి శనివారం ఆ గూడెంలో అధికారగణం దిగింది.. ఒకరిద్దరు కాదు.. ఆ గూడెంలో 36 కుటుంబాలుంటే ఏకంగా 200 మంది సిబ్బంది వచ్చారు.. మూడు జేసీబీలు, ఏడు ట్రాక్టర్లతో విరుచుకుపడ్డారు.. గుడిసెలు, ఇళ్లను నేలమట్టం చేశారు.. అడ్డొచ్చిన వారిపై దౌర్జన్యానికి దిగారు.. ఎదురుతిరిగిన మహిళలను చెట్టుకు కట్టేసి విచక్షణాæ రహితంగా బాదారు.. అయినా అడవిని వదిలేది లేదని నినాదాలు చేస్తూ వారంతా అక్కడే ఉండిపోయారు.. అటవీ సిబ్బంది గొత్తికోయల ఇళ్లలోని సామగ్రిని ట్రాక్టర్లలో వేసి వేరేచోటుకు తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలోని లవ్వాల అటవీ ప్రాంతం గొత్తికోయలు, ఫారెస్టు సిబ్బంది ఘర్షణతో రణరంగంగా మారింది. గొత్తికోయల ఆర్తనాదాలతో దద్దరిల్లింది.
100 మంది గొత్తికోయలు..
200 మంది అటవీ సిబ్బంది..
లవ్వాల సమీపంలో జలగలంచ వద్ద ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఆదివాసీలు గూడెం ఏర్పాటు చేసుకుని పదేళ్లుగా నివసిస్తున్నారు. సుమారు 36 కుటుంబాలు ఈ గూడెంలో నివసిస్తున్నాయి. ఇందులో 35 మంది పురుషులు, 40 మంది స్త్రీలు, 25 మంది పిల్లలు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తాడ్వాయి, ఏటూరునాగారం, పస్రా రేంజ్‌లతో పాటు పలిమెల, కాటారం, వెంకటాపురం (కే) రేంజ్‌ల నుంచి సుమారు 170 నుంచి 200 మంది అటవీ సిబ్బంది జలగలంచ అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. మూడు జేసీబీలు, ఏడు ట్రాక్టర్లతో ఒక్కసారిగా గుడిసెలు, ఇళ్లు కూల్చివేయడం మొదలుపెట్టారు. ఫారెస్టు అధికారుల దాడితో గూడెంలో ఉన్న పురుషులు చెల్లాచెదురయ్యారు. కొందరు అడవిలోకి పారిపోగా, మరికొందరు గుడిసెలు కూల్చవద్దంటూ మొర పెట్టుకున్నారు. అయినా ఫారెస్టు అధికారులు విచక్షణారహితంగా ఇళ్లు కూల్చడం మొదలెట్టారు. ఈ సందర్భంగా అటవీశాఖ సిబ్బంది విచక్షణా రహింతగా గొత్తికోయలను కొట్టారు. దీంతో గూడెంలో ఉన్న మహిళలు, పిల్లలు ఏడుపులతో అడవి దద్దరిల్లింది.
అందరినీ తీసుకెళ్లి చెట్టుకు కట్టి..
కాళ్లా వేళ్లా పడ్డా కనికరించకుండా ఇళ్లు నేలమట్టం చేయడం, విచక్షణారహితంగా కొడుతుండటంతో ఫారెస్ట్ అధికారులు, సిబ్బందిపై గొత్తికోయ మహిళలు ఎదురు దాడికి దిగారు. దీంతో రెచ్చిపోయిన ఫారెస్టు అధికారులు గొత్తికోయ మహిళలను ఇష్టారాజ్యంగా లాఠీలతో బాదారు. ఎడాపెడా ఈడ్చి పారేశారు. దీంతో గొత్తికోయ మహిళల దుస్తులు చిరిగిపోయాయి. అయినా ఫారెస్టు అధికారులు శాంతించలేదు. సామగ్రిని తరలిస్తున్న ట్రాక్టర్లకు గొత్తికోయ మహిళల అడ్డంగా పడుకున్నారు. వారిని ఫారెస్ట్ సిబ్బంది బలవంతంగా ఈడ్చి పారేశారు. ఓ మహిళను ఇద్దరు మహిళా సిబ్బంది బలవంతంగా పక్కకు తరలించారు. అయినా మహిళలు తీవ్రంగా ప్రతిఘటించడంతో పురుష సిబ్బంది వారిపై దాడి చేశారు. గొత్తికోయ మహిళలందరినీ చెట్టు దగ్గరకి తీసుకెళ్లి చెట్టుకు తాడుతో కట్టేశారు. కుటుంబ పెద్దలు అడవుల్లోకి పారిపోవడం, ఇంట్లో మహిళలు అటవీ సిబ్బంది చేతిలో దెబ్బలు తింటుండటంతో గొత్తికోయ పిల్లలు భీతిల్లారు.
పకడ్బందీగా..
కొంతకాలంగా అడవుల్లో ఉన్న గొత్తికోయ గూడేలను ఫారెస్టు అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. ఒక రేంజ్ పరిధిలో గొత్తికోయగూడేన్ని ఖాళీ చేయించాలంటే పక్కన ఉన రేంజ్ సిబ్బందిని ఉపయోగిస్తున్నారు. గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారంలో తరచుగా ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. వాటన్నింటీని తలదన్నెలా శనివారం ఫారెస్టు సిబ్బంది భారీ స్థాయిలో గొత్తికోయగూడెంపై దాడి చేశారు.
పోడు సాగుదార్లకు రక్షణ కరువు: చాడ
జయశంకర్ భూపాలపల్లి జల్లాలో గొత్తికోయలపై అటవీ శాఖ అధికారులు జరిపిన దాడిని ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంఘటనకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అధికారులపై చర్యలు తీసుకోవాలి: తమ్మినేని
గొత్తికోయలపై ఫారెస్టు అధికారులు దుశ్చర్యలకు పాల్పడకుండా చూడాలని, దాడులకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.
అయినా అడవిని వదల్లేదు..
మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు అటవీ సిబ్బంది, గొత్తికోయలకు మధ్య తీవ్రంగా ఘర్షణ జరిగింది. చివరకు గుడిసెలను తొలగించిన అనంతరం గొత్తికోయల వంట సామగ్రి, దుస్తులు, ఇతర వస్తువులను తాడ్వాయి మండల కేంద్రంలో మేడారం వెళ్లే రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో పడేశారు. అటవీశాఖ అధికారుల దాడులతో గొత్తికోయల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. తమ సామగ్రిని అటవీ సిబ్బంది తీసుకుపోయినా గొత్తికోయలు అడవి వదలి రాలేదు. కూలిన గుడిసెల మధ్యనే ఉండిపోయారు.
పంటలు ధ్వంసం
గొత్తికోయలు జీవనోపాధి కోసం సాగు చేసిన మొక్కజొన్న పంటలను సైతం అటవీ సిబ్బంది ధ్వంసం చేశారు. పంట సాగు కోసం ఏర్పాటు చేసుకున్న కుంటలకు గండ్లు పెట్టారు. రెక్కాడితేగానీ డొక్కాడని గొత్తికోయలు కూలీ పనులకు వెళ్లి కష్టపడి డబ్బులు సంపాదించుకుని వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి పోడు భూముల్లో వేసిన మొక్కజొన్న పంటలను అటవీ సిబ్బంది ధ్వంసం చేయడంతో వారు ఆర్థికంగా నష్ట పోయారు. గొత్తికోయలపై ఫారెస్టు సిబ్బంది దాడి చేయడాన్ని గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
నోటీసులు ఇచ్చినా స్పందించలేదు..
‘‘జలగలంచ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సుమారు 36 కుటుంబాలు పదేళ్లుగా నివాసం ఉంటున్నాయి. అక్కడే అడవిని నరికి పోడు వ్యవసాయం కొనసాగిస్తున్నారు. ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని పలుమార్లు చెప్పాం. గుడిసెలను ఖాళీ చేస్తే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని హామీఇచ్చాం. రెండు నెలల క్రితం నుంచి నోటీసులు ఇస్తున్నాం. అయినా మాట వినలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఖాళీ చేయించే ప్రయత్నం చేశాం. కొందరు మహిళలు ట్రాక్టర్ ముందు పడుకుని అడ్డగించారు. అయినా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా వారిని అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా తాడ్వాయిలో మేడారం వెళ్లే దారి సమీపంలో ఏర్పాటు చేసిన గుడిసెలకు తరలించాం’’
– శిరీష, పస్రా వైల్డ్‌లైఫ్ రేంజ్ అధికారి