gottikoyalu
-
గొత్తి కోయల్ని తరలించొద్దు
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ గ్రామంలో నివసిస్తున్న గొత్తి కోయలను అక్కడి నుంచి ఖాళీ చేయించవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. గొత్తి కోయల జీవన విధానా నికి ఇబ్బందులు కల్పించరాదని, వెంటనే వారికి తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశిస్తూ మధ్యం తర ఉత్తర్వులు జారీ చేసింది. అడవుల్లో నివాసం ఉండేందుకు ఆదివాసీలకు చట్టం వెసులుబాటు కల్పిస్తోందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది. షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్–2006 ప్రకారం ఆదివాసీలు అడవుల్లో నివాసం ఏర్పాటు చేసుకునేందుకు హక్కు ఉందని స్పష్టం చేసింది. 18 ఏళ్లుగా అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గొత్తి కోయల ఇళ్లను కూల్చివేయడాన్ని తప్పుపడుతూ హైదరాబాద్‌లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, పౌరహక్కుల కమిటీ సహాయ కార్యదర్శి డాక్టర్ గుంటి రవీందర్ దాఖలు చేసిన ప్రజాప్రయో జన వ్యాజ్యాన్ని సోమవారం ధర్మాసనం విచారిం చింది. గొత్తి కోయల నివాసం వల్ల అరుదైన పశుపక్ష్యాదులు కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నా కూడా.. చట్ట ప్రకారం ముందుగా వారికి నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతివాదులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, సీఎఫ్ఓ, కేంద్ర గిరిజన శాఖ కార్యదర్శి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్ఓ, ఫారెస్ట్ రేంజర్లతోపాటు వ్యక్తిగత ప్రతివా దులుగా ఉన్న అటవీ అధికారులు శిరీష, జోగీందర్ల కు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఇళ్లు కూల్చి.. బోరుపీకేసి..: గత నెల 16న పస్రా ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ శిరీష, తాడ్వాయి ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ జోగీందర్ సారథ్యంలో రెండు వందల మంది అటవీ అధికారులు ఒక్కసారిగా జేసీబీలు, ట్రాక్టర్లు, బుల్డోజర్లతో వచ్చి గొత్తి కోయలకు చెందిన 36 ఇళ్లను కూల్చేశారని, తాగునీటికి ఉన్న ఒకే ఒక బోరును కూడా పీకివేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది రఘునాథ్ వాదిం చారు. సుమారు 30 మంది ఆదివాసీల పిల్లలు చదువుకునే పాఠశాలనూ ధ్వంసం చేశారని, పంటల్ని నాశనం చేశారని ఆరోపించారు. ఆఖరికి గర్భవతులని కూడా చూడకుండా కొట్టారని, చాలా మందిని చెట్లకు కట్టివేశారని వివరించారు. 18 ఏళ్లుగా అడవి తల్లినే నమ్ముకున్న గొత్తి కోయలకు కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు దాడి చేశారన్నారు. వన్య ప్రాణులకు ముప్పు..: గొత్తి కోయలు పోడు వ్యవసాయం చేయడం వల్ల వన్య ప్రాణులకు ముప్పు ఏర్పడుతోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్ర రావు వాదించారు. పోడు వ్యవసాయం పేరిట వృక్షాలను కొట్టేస్తున్నారని చెప్పారు. మానవీయ కోణంలో వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా తరలి వెళ్లేందుకు ముందుకు రావడం లేదని వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోలకు, సల్వాజుడుం కార్యకర్తలకు మధ్య ఘర్షణల నేపథ్యంలో అక్కడి నుంచి తప్పించుకుని తాడ్వాయి మండలం జలగలంచ ప్రాంతానికి వలస వచ్చారని చెప్పారు. -
రణరంగంగా మారిన తాడ్వాయి అటవీ ప్రాంతం
-
మహిళలను చెట్టుకు కట్టేసి చావబాదారు
-
అడవిలో అరాచకం
► గొత్తికోయలపై అటవీశాఖ సిబ్బంది దౌర్జన్యం ► 36 కుటుంబాలపై విరుచుకుపడ్డ 200 మంది ► జేసీబీలు, ట్రాక్టర్లతో ఇళ్లు, గుడిసెల కూల్చివేత ► అడ్డొచ్చిన మహిళలను చెట్టుకు కట్టేసి చావబాదిన వైనం ► తిరగబడ్డ గొత్తికోయలు.. ► రణరంగంగా మారిన తాడ్వాయి అటవీ ప్రాంతం ► జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన తాడ్వాయి: వారంతా పదేళ్లుగా ఆ అడవిలో నివాసం ఉంటున్నారు.. పోడు వ్యవసాయం చేసుకుంటూ పొట్టబోసుకుంటున్నారు.. అడవిని వదలాలంటూ అధికారులు ఎన్నోసార్లు హుకుం జారీ చేసినా పట్టించుకోలేదు.. చివరికి శనివారం ఆ గూడెంలో అధికారగణం దిగింది.. ఒకరిద్దరు కాదు.. ఆ గూడెంలో 36 కుటుంబాలుంటే ఏకంగా 200 మంది సిబ్బంది వచ్చారు.. మూడు జేసీబీలు, ఏడు ట్రాక్టర్లతో విరుచుకుపడ్డారు.. గుడిసెలు, ఇళ్లను నేలమట్టం చేశారు.. అడ్డొచ్చిన వారిపై దౌర్జన్యానికి దిగారు.. ఎదురుతిరిగిన మహిళలను చెట్టుకు కట్టేసి విచక్షణాæ రహితంగా బాదారు.. అయినా అడవిని వదిలేది లేదని నినాదాలు చేస్తూ వారంతా అక్కడే ఉండిపోయారు.. అటవీ సిబ్బంది గొత్తికోయల ఇళ్లలోని సామగ్రిని ట్రాక్టర్లలో వేసి వేరేచోటుకు తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలోని లవ్వాల అటవీ ప్రాంతం గొత్తికోయలు, ఫారెస్టు సిబ్బంది ఘర్షణతో రణరంగంగా మారింది. గొత్తికోయల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. 100 మంది గొత్తికోయలు.. 200 మంది అటవీ సిబ్బంది.. లవ్వాల సమీపంలో జలగలంచ వద్ద ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఆదివాసీలు గూడెం ఏర్పాటు చేసుకుని పదేళ్లుగా నివసిస్తున్నారు. సుమారు 36 కుటుంబాలు ఈ గూడెంలో నివసిస్తున్నాయి. ఇందులో 35 మంది పురుషులు, 40 మంది స్త్రీలు, 25 మంది పిల్లలు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తాడ్వాయి, ఏటూరునాగారం, పస్రా రేంజ్‌లతో పాటు పలిమెల, కాటారం, వెంకటాపురం (కే) రేంజ్‌ల నుంచి సుమారు 170 నుంచి 200 మంది అటవీ సిబ్బంది జలగలంచ అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. మూడు జేసీబీలు, ఏడు ట్రాక్టర్లతో ఒక్కసారిగా గుడిసెలు, ఇళ్లు కూల్చివేయడం మొదలుపెట్టారు. ఫారెస్టు అధికారుల దాడితో గూడెంలో ఉన్న పురుషులు చెల్లాచెదురయ్యారు. కొందరు అడవిలోకి పారిపోగా, మరికొందరు గుడిసెలు కూల్చవద్దంటూ మొర పెట్టుకున్నారు. అయినా ఫారెస్టు అధికారులు విచక్షణారహితంగా ఇళ్లు కూల్చడం మొదలెట్టారు. ఈ సందర్భంగా అటవీశాఖ సిబ్బంది విచక్షణా రహింతగా గొత్తికోయలను కొట్టారు. దీంతో గూడెంలో ఉన్న మహిళలు, పిల్లలు ఏడుపులతో అడవి దద్దరిల్లింది. అందరినీ తీసుకెళ్లి చెట్టుకు కట్టి.. కాళ్లా వేళ్లా పడ్డా కనికరించకుండా ఇళ్లు నేలమట్టం చేయడం, విచక్షణారహితంగా కొడుతుండటంతో ఫారెస్ట్ అధికారులు, సిబ్బందిపై గొత్తికోయ మహిళలు ఎదురు దాడికి దిగారు. దీంతో రెచ్చిపోయిన ఫారెస్టు అధికారులు గొత్తికోయ మహిళలను ఇష్టారాజ్యంగా లాఠీలతో బాదారు. ఎడాపెడా ఈడ్చి పారేశారు. దీంతో గొత్తికోయ మహిళల దుస్తులు చిరిగిపోయాయి. అయినా ఫారెస్టు అధికారులు శాంతించలేదు. సామగ్రిని తరలిస్తున్న ట్రాక్టర్లకు గొత్తికోయ మహిళల అడ్డంగా పడుకున్నారు. వారిని ఫారెస్ట్ సిబ్బంది బలవంతంగా ఈడ్చి పారేశారు. ఓ మహిళను ఇద్దరు మహిళా సిబ్బంది బలవంతంగా పక్కకు తరలించారు. అయినా మహిళలు తీవ్రంగా ప్రతిఘటించడంతో పురుష సిబ్బంది వారిపై దాడి చేశారు. గొత్తికోయ మహిళలందరినీ చెట్టు దగ్గరకి తీసుకెళ్లి చెట్టుకు తాడుతో కట్టేశారు. కుటుంబ పెద్దలు అడవుల్లోకి పారిపోవడం, ఇంట్లో మహిళలు అటవీ సిబ్బంది చేతిలో దెబ్బలు తింటుండటంతో గొత్తికోయ పిల్లలు భీతిల్లారు. పకడ్బందీగా.. కొంతకాలంగా అడవుల్లో ఉన్న గొత్తికోయ గూడేలను ఫారెస్టు అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. ఒక రేంజ్ పరిధిలో గొత్తికోయగూడేన్ని ఖాళీ చేయించాలంటే పక్కన ఉన రేంజ్ సిబ్బందిని ఉపయోగిస్తున్నారు. గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారంలో తరచుగా ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. వాటన్నింటీని తలదన్నెలా శనివారం ఫారెస్టు సిబ్బంది భారీ స్థాయిలో గొత్తికోయగూడెంపై దాడి చేశారు. పోడు సాగుదార్లకు రక్షణ కరువు: చాడ జయశంకర్ భూపాలపల్లి జల్లాలో గొత్తికోయలపై అటవీ శాఖ అధికారులు జరిపిన దాడిని ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంఘటనకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలి: తమ్మినేని గొత్తికోయలపై ఫారెస్టు అధికారులు దుశ్చర్యలకు పాల్పడకుండా చూడాలని, దాడులకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. అయినా అడవిని వదల్లేదు.. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు అటవీ సిబ్బంది, గొత్తికోయలకు మధ్య తీవ్రంగా ఘర్షణ జరిగింది. చివరకు గుడిసెలను తొలగించిన అనంతరం గొత్తికోయల వంట సామగ్రి, దుస్తులు, ఇతర వస్తువులను తాడ్వాయి మండల కేంద్రంలో మేడారం వెళ్లే రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో పడేశారు. అటవీశాఖ అధికారుల దాడులతో గొత్తికోయల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. తమ సామగ్రిని అటవీ సిబ్బంది తీసుకుపోయినా గొత్తికోయలు అడవి వదలి రాలేదు. కూలిన గుడిసెల మధ్యనే ఉండిపోయారు. పంటలు ధ్వంసం గొత్తికోయలు జీవనోపాధి కోసం సాగు చేసిన మొక్కజొన్న పంటలను సైతం అటవీ సిబ్బంది ధ్వంసం చేశారు. పంట సాగు కోసం ఏర్పాటు చేసుకున్న కుంటలకు గండ్లు పెట్టారు. రెక్కాడితేగానీ డొక్కాడని గొత్తికోయలు కూలీ పనులకు వెళ్లి కష్టపడి డబ్బులు సంపాదించుకుని వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి పోడు భూముల్లో వేసిన మొక్కజొన్న పంటలను అటవీ సిబ్బంది ధ్వంసం చేయడంతో వారు ఆర్థికంగా నష్ట పోయారు. గొత్తికోయలపై ఫారెస్టు సిబ్బంది దాడి చేయడాన్ని గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. నోటీసులు ఇచ్చినా స్పందించలేదు.. ‘‘జలగలంచ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సుమారు 36 కుటుంబాలు పదేళ్లుగా నివాసం ఉంటున్నాయి. అక్కడే అడవిని నరికి పోడు వ్యవసాయం కొనసాగిస్తున్నారు. ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని పలుమార్లు చెప్పాం. గుడిసెలను ఖాళీ చేస్తే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని హామీఇచ్చాం. రెండు నెలల క్రితం నుంచి నోటీసులు ఇస్తున్నాం. అయినా మాట వినలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఖాళీ చేయించే ప్రయత్నం చేశాం. కొందరు మహిళలు ట్రాక్టర్ ముందు పడుకుని అడ్డగించారు. అయినా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా వారిని అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా తాడ్వాయిలో మేడారం వెళ్లే దారి సమీపంలో ఏర్పాటు చేసిన గుడిసెలకు తరలించాం’’ – శిరీష, పస్రా వైల్డ్‌లైఫ్ రేంజ్ అధికారి -
గొత్తికోయలు మూఢనమ్మకాలు వీడాలి
ఏటూరునాగారం : గొత్తికోయలు మూఢ నమ్మకాల వైపు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలని ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య సూచించారు. గోగుపల్లి లింగాపురం గ్రామ గొత్తికోయ మహిళ పోచమ్మ ప్రసవం కోసం వెళ్తుండగా మంగళవారం దారి మధ్యలో కవలలకు జన్మనిచ్చిన విషయం విదితమే. ఇందులో ఓ శిశువు మృతి చెందగా మరో శిశువు, తల్లి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండగా.. పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ మేరకు సామాజిక ఆస్పత్రిలో ఉన్న పోచమ్మ ఆరోగ్య పరిస్థితిని అప్పయ్య పరీక్షించి మాట్లాడారు. వైద్యాధికారులు శిరీష, క్రాంతికుమార్, మంకిడి వెంకటేశ్వర్లు, ఏఎ¯ŒSఎం ధనలక్ష్మి ఉన్నారు. -
పుష్కరాలా.. అంటే ఏమిటి?
ఏళ్లకేళ్లుగా కొండలు, గుట్టలే వారి ఆవాసాలు. సంప్రదాయాలు.. కట్టుబాట్లే వారి ఆస్తిపాస్తులు. గోదావరి పరివాహకమే వారి జీవనాధారం. కానీ, ప్రస్తుత గోదావరి పుష్కరాల సందడి వారి గూడేల్లో కన్పించడం లేదు. అసలామాటకొస్తే తమకు పుష్కరాలంటేనే తెలియదంటున్నారు గొత్తికోయలు. ఏటూరునాగారం: ఏటూరునాగారం అభయారణ్యంలో సుమారు 3వేల మంది గొత్తికోయలు జీవిస్తున్నారు. వీరు ఏడాదిలో రెండు సార్లు(పుష్యమాసం, వైశాఖ మాసం) తమ దేవతామూర్తులను గోదావరి నీటితో శుద్ధి చేస్తారు. అసలు తమకు పుష్కరాలు అంటే ఏమిటోతెలియదంటున్నారు . నాయకపోడ్లు తమ ఆడబిడ్డ అయిన లక్ష్మీదేవరను గోదావరి పుణ్యస్నానాలు ఆచరించి ఉత్సవా లు జరుపుకుంటారు. మడుగులోని నీటిని కూడా ఆదివాసీ గిరిజనులు పవిత్ర జలాలుగా భావిస్తారు. ఎన్నో తెగలు.. భిన్న సంస్కృతులు ఏడు రాష్ట్రాల్లో విస్తరించిన గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎన్నో తెగలు, భిన్న సంస్కృతులతో జీవనం సాగిస్తున్నారుు. గోండ్, అంబుజ్ మేరి యా, బిస్నోమ్ మెరియ, మురియా, హల్పా, బట్రా, పజ్రా, గొత్తికోయ, కోయలు, మాంజీ, బంజారాలంబాడీ, నాయకపోడ్ తెగలు ఏజెన్సీలో జీవిస్తున్నాయి. ఒకప్పుడు వేట.. ప్రస్తుతం పోడు వ్యవసాయం వీరి కడుపు నింపుతోంది. వెదురుతో సృజానాత్మక వస్తువులు తయారు చేస్తారు.నాసిక్‌లో నివసించే వర్లితెగ గిరిజనులు రూపొందించే వర్లి చిత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇప్పటి వరకు ఎప్పుడు చేయలె పుష్కరాలకు స్నానాలు అంటే ఏమిటి? ఇప్పటి వరకు ఎప్పు డూ చేయలె. ఇక్కడికి వచ్చినకాడి నుంచి వాగులు, కుంటల్లోనే స్నానాలు చేస్తాం. సంక్రాంతి ముందు వడ్లు కోసేటప్పుడు పండుగ చేసుకొని గొర్రెలు, మేకలను బలిస్తాం. పొలిమేరల చుట్టూ నల్లటి ముగ్గు పోసి ఎవరు రాకుండా చూస్తాం. - మాడవి జోగయ్య, చింతలపాడు -
ఇక్కడే బతుకుతం.. ఇక్కడే చస్తం
ఏటూరునాగారం : ప్రాణాలు పొయిన ఈ అడవి ఈడి ఏడికెల్లిపోం.. వలస వచ్చిన మా బతుకులను ఆగం చెత్తాండ్లు.. అడవిని నమ్ముకుని జీవి సున్నం. అటవీఅధికారులు ఇక్కడి నుంచి వెల్లగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. ఇక్కడే బతుకు తం.. ఇక్కడే చస్తం.’ అంటూ గొత్తికోయలు సోమవారం ఏటూరునాగారం మండలంలోని ఐటీడీఏ కార్యాలయూన్ని ముట్టడించారు. ఏటూరునాగా రం, మంగపేట, తాడ్వాయి మండలాలకు చెందిన వారు సుమారు వెయ్యి మంది రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు సున్నం బాబురావు మాట్లాడుతూ గొత్తికోయలపై దాడు లు చేసిన అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమో దు చేయాలని డిమాండ్ చేశారు. అడవిలోని టేకు, జిట్రేగి, పెద్దేగి కర్రలను కొందరు అటవీశాఖ అధికారులే స్మగ్లర్లతో కుమ్మకై రవాణా చేస్తున్నారని ఆరోపించారు. సీపీఎం మండల కార్యదర్శి దావూ ద్, సీపీఎం డివిజన్ కార్యదర్శి వెంకటరెడ్డి, గిరి జన నాయకులు నారాయణ, కిష్టయ్య,నాగరాజు, ఆంజీ, వెంకన్న, చిట్టిబాబు, ముత్యాలు, నర్రాశివప్రసాద్, మడె రమేష్, గొత్తికోయలు నాగరాజు, జోగయ్య, ఆంజయ్య పాల్గొన్నారు. ఎస్సై వినయ్‌కుమార్ ప్రజాసంఘాల నాయకులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. పోడు భూములకు హక్కుపత్రాలివ్వాలని ఏపీఓ జనరల్ వసంతరావుకు గిరిజన నేతలు వినతిపత్రం అందజేశారు. -
ఐటీడీఏ కార్యాలయం ముందు గొత్తికోయల ధర్నా
ఏటూరునాగారం : వరంగల్ జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట సోమవారం గొత్తికోయలు ధర్నాకు దిగారు. తాగునీటి వసతి, రవాణా సౌకర్యం కల్పించడంతోపాటు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు పత్రాలు ఇచ్చి అటవీ అధికారుల నుంచి దాడులు నివారించాలని ఐటీడీఏ ఏపీఓ వసంత్ రావుకు వారు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో సుమారు వెయ్యి మంది వరకు గొత్తికోయలు పాల్గొన్నారు.