అటకెక్కిన పునరావాసం
2009 అక్టోబర్‌లో భారీ వరదలు
వడ్డేపల్లిలో ఆరేళ్లుగా నిర్మాణంలోనే ఇళ్లు
మద్దూరులో స్థలానికి అతీగతి లేదు
కృష్ణమ్మ, తుంగభద్ర నదులు ఉగ్రరూపం దాల్చాయి.. వరద బీభత్సంలో ఇళ్లు, ఊళ్లు కొట్టుకుపోయాయి. ఇది జరిగి సుమారు ఐదేళ్లు గడిచింది. 2009 అక్టోబర్ నాటి వరద బాధితులకు నేటికీ పునరావాసం అందనిద్రాక్షగానే మారింది. ప్రభుత్వాలు మారినా..పాలకులు మారినా వారి గూడుగోస మాత్రం తీరడం లేదు. తుంగభద్ర, కృష్ణానదులు ఉప్పొంగడంతో అలంపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు ముంపునకు గురయ్యాయి. తుంగభద్ర తీరంలోని అలంపూర్, మానవపాడు, వడ్డేపల్లి, అయిజ, కృష్ణానది తీరంలో ఉన్న ఇటిక్యాల, అలంపూర్ మండలాల్లోని 28 గ్రామాలు వరద ప్రవాహంలో పూర్తిగా దెబ్బతిన్నాయి. రాత్రికిరాత్రే సంభవించిన వరదల నుంచి ప్రాణాలు దక్కితే చాలనుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య ముంపుగ్రామాలను పునఃనిర్మిస్తామని భరోసాఇచ్చారు. అందులో భాగంగానే చేపట్టిన పునరావాస పనులు ఐదేళ్లుగా ఓ కొలిక్కిరావడం లేదు. వడ్డేపల్లి మండలంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలంపూర్ పట్టణ బాధితుల కోసం సేకరించి సుమారు 44 ఎకరాల్లో ముళ్లపొదలు మొలిశాయి. మద్దూరు మండలంలో ఇప్పటికీ స్థలసేకర ణ జరగలేదు. చేనేతకు పుట్టినిల్లు రాజోలి నేతన్నను ఆదుకునేదిక్కులేదు.
ఆరేళ్లుగా అసంపూర్తిగానే..!
వరద బాధితుల పునరావాస పనులు ఆరేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. అలంపూర్, మద్దూరులో ఇళ్ల నిర్మాణం ఊసేలేదు. అయిజ మండలంలోని కుట్కనూరు, ఇటిక్యాలం మండలంలోని ఆర్.గార్లపాడు గ్రామాల్లో పునరావాసం పనులు జరగడం లేదు. రాజోలిలో 212 ఎకరాల స్థలాన్ని సేకరించి 3048 ఇళ్లను ప్రతిపాదించగా.. 2625 నిర్మాణాలను మాత్రమే చేపట్టారు. వీటిలో ప్రముఖ ఇన్ఫోసిస్ స్వచ్ఛంద సంస్థ 600 ళ్లను నిర్మించి ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ కూడా 483 ఇళ్లను పూర్తిచేయగా..117ఇళ్లను మొదలుపెట్టలేదు. ఆర్‌డీటీ అనే స్వచ్ఛంద సంస్థకు 700 ఇళ్లు అప్పగించగా 692 నిర్మాణాలను పూర్తిచేయగలిగింది. పడమటి గార్లపాడు నిర్వాసితులకు రాజోలిలోనే 72 ఇళ్లు మంజూరుచేశారు. కానీ స్థానికులు తమ గ్రామంలోనే ఇళ్లు నిర్మించాలని కోరడంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కిరాలేదు. మరో వరద గ్రామం తూర్పుగార్లపాడులో 251 ఇళ్లను గాను 248 ఇళ్లకు స్లాబ్‌లు పూర్తిచేశారు. చాలాచోట్ల నిర్మాణాలు పూర్తయినా.. ఇళ్లకు తలుపులు, కిటికీలు, బండ పరుపు వంటి పనులు జరగ లేదు. అలంపూర్ పట్టణ నిర్వాసితులకు 44 ఎకరాల స్థలం సేకరించాల్సి ఉంది. మానవపాడు మండలం మద్దూ రు లో సుమారు 500 కుటుంబాలు వరదల్లో తీవ్రంగా నష్టపోయాయి. కానీ స్థలం కొరతను సాకుగా చూపుతూ ఇప్పటికీ స్థలసేకరణ చేయలేదు.
నేతన్నకు చేయూత కరువు
రాజోలి, అలంపూర్‌లోని చేనేతకార్మికులకు ప్రభుత్వపరంగా ఆదరణ కొరవడిం ది. రాజోలిలో 764 చేనేత కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ నేత పనిద్వారానే ఎక్కువమంది ఉపాధిపొందుతారు. వరదల్లో చేనేత కార్మికులు ఇళ్లతోపాటు జీవనాధారమైన మగ్గాలు కొట్టుకుపోయాయి. చేనేత కుటుంబాలకు ఇళ్లతోపాటు షెడ్డు ల నిర్మాణం చేపడతామన్నారు. ఇందుకోసం రూ.42,500 ఆర్థికసాయం ఇస్తామని ప్రభుత్వం హామీఇచ్చింది. అయితే నిర్మాణాల్లో జాప్యం జరగడంతో నిర్మాణవ్యయం రెండింతలు పెరిగింది. షెడ్డులు నిర్మించుకున్న 53 మంది ప్రభుత్వసాయం కోసం ఎదురుచూస్తున్నారు.