అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
జగదేవ్‌పూర్ : అప్పులబాధతో మండలంలోని రాయవరానికి చెందిన రైతు ముత్యాలు (36) మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ముత్యా లు తనకున్న ఐదెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొన్నేళ్లుగా పంటలు పండక అప్పులపాలయ్యాడు. దీం తో ఉన్న ఐదెకరాల్లో నాలుగు ఎకరాలను విక్రయించి కొంత అప్పులు తీర్చాడు. ఉన్న భూమిలో గతేడాది అప్పు చేసి నాలుగు బోర్లు వేశాడు. వాటిలో మూడు ఫెయిల్ కాగా ఒక దాంట్లో నీరు పడ్డాయి. అయితే అప్పులు మాత్రం రూ. 3 లక్షలకు చేరుకున్నాయి. పంటలు పండక పోవడం, చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక తరచూ భార్య వద్ద మదనపడేవాడు.
ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం భార్య కనకమ్మ ఓ పని నిమిత్తం పుట్టింటికి వెళ్లింది. కాగా రైతు ముత్యాలు మంగళవారం ఉదయం కుమారుడు వంశీ (5), కుమార్తె (3)కు గ్రామంలోని బస్టాండ్ వద్దకు తీసుకెళ్లి టీ, బిస్కెట్లు తినిపించి తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. అనంతరం రేకుల రూంలోకి వెళ్లి లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన ముత్యాలు తల్లిదండ్రులు స్థానికుల సాయంతో అతడిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లే కుండా పోయింది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు కళ్ల ముందే మృతి చెందడంతో పోచయ్య, సత్తవ్వ దంపతుల వేదన అంతా ఇంతా కాదు. అందరితో కలుపుగోపులుగా ఉండే రైతు ముత్యాలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న ఎస్‌ఐ వీరన్న గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. వీఆర్‌ఓ న రసింహులు పంచనామా చేశారు. బాధిత కుటుంబాన్ని యువజన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి భానుప్రకాష్, గ్రామ సర్పంచ్ గణేష్, ఎంపీటీసీ బాలవ్వలు, తెలుగు యువత జిల్లా నాయకులు శ్రీకాంత్, క్రిష్ణలు పరామర్శించారు.