
పరిమిత మాఫీపై కన్నెర్ర
పంట రుణాలన్నీ మాఫీ చేయాల్సిందేనని, పరిమితం అంటూ ఆంక్షలు విధించవద్దని రైతులు ఆందోళనకు దిగారు. గురువారం జిల్లాలో పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పలు రాజకీయ పార్టీలు అన్నదాతలకు అండగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. ‘పరిమిత రుణమాఫీ’ ప్రచారంతో తాను తీసుకున్న రుణం మాఫీ కాదన్న బెంగతో ఓ రైతు గుండె ఆగింది. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రామలింగారెడ్డిని రైతులు నిలదీశారు.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రైతుల రుణమాఫీని కేవలం గత ఆర్థిక సంవత్సరానికే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో మెతుకుసీమ అన్నదాతలు కన్నెర్ర చేశారు. అన్ని రకాల పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. రాస్తారోకోలు, ధర్నాలతో రహదారులన్నీ దద్దరిల్లాయి. మునిపల్లి మండలం పొల్కంపల్లి గ్రామానికి చెందిన రైతు ఎర్రపు సంగయ్య (40)కు బ్యాంకులో తీసుకున్న రుణం మాఫీ కావడంలేదన్న బెంగతో బుధవారం గుండె నొప్పి వచ్చింది.
హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా గురువారం చికిత్స పొందుతూ మరణించాడు. సంగయ్యకు రెండు ఎకరాల భూమి ఉంది. ఆయన 2011-12లో రూ. 50వేలు అప్పుతీసుకున్నాడు. అదే సంవత్సరం బావి తవ్వించాడు. పెద్ద కూతురు వివాహం చేశాడు. బయట అప్పుకు తెచ్చి వీటన్నింటిని చేపట్టడంతో అప్పుల పాలయ్యాడు. బ్యాంకులో తీసుకున్న అప్పు ప్రభుత్వం మాఫీ చేస్తుందన్న గంపెడాశతో ఉండగా గత సంవత్సరం తీసుకున్న రుణాలకే మాఫీ ఉంటుందని ప్రచారం జరగడంతో సంగయ్యను బలితీసుకుంది.
రైతాంగం ఆగ్రహం
గత ఆర్థిక సంవత్సరం రుణాలు మాఫీ చేస్తారన్న నేపథ్యంలో టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అల్లాదుర్గం మండలం మర్వెల్లిలోని ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. నంగునూరు మండలం రాంపూర్ క్రాస్‌రోడ్డు వద్ద మధ్యాహ్నం 12 గంటలకు రైతులు రాస్తారోకో చేశారు. రాస్తారోకోలో బీజేపీ, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కల్హేర్ మండలంలోని మాసాన్‌పల్లి చౌరస్తాలో సంగారెడ్డి-నాందేడ్ జాతీయ రహదారిపై, మార్డిలో కాంగ్రెస్, టీడీపీ ఆధ్వర్యంలో రైతులు వేర్వేరుగా ధర్నా చేపట్టారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
కొల్చారం మండలం రంగంపేటలో రైతులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. గత సంవత్సరం జూన్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులకే వర్తించేలా అమలు చేయనుండటాన్ని నిరసిస్తూ రాస్తారోకో చేశారు. పంటలు సరిగా పండక బ్యాంక్‌ల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేకపోయామని, పంటలు పండనందున రుణాలను రెన్యువల్ చేయించుకోలేక పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 2010- 11 ఆర్థిక సంవత్సరం నుంచి రుణాలు పొందిన రైతులందరికీ రుణమాఫి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యేను
నిలదీసిన రైతులు
ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రైతులకు రుణమాఫీఫై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటం లేదని పలువురు రైతులు దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డిని నిలదీశారు. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి వచ్చిన ఆయనతో రుణమాఫీపై రైతులు ప్రశ్నించారు.
ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందిస్తూ రుణమాఫీపె ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని, ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు. రుణమాఫీ విషయంపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న రుణమాఫీపై కేసీఆర్ స్పష్టంగా పేర్కొనకపోవడం వల్లే ఈ ఆందోళనకు కారణంగా తెలుస్తోంది.