
కోదాడరూరల్ : అంకుల్ నీ డబ్బులకు సిరా అంటుకుంది నేను లెక్కిస్తా ఉండు అని చెప్పి అతడి వద్ద రూ.44వేలు నొక్కేశాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. ఈ సంఘటన కోదాడ ఆంధ్రా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌లో సోమవారం చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలంలోని కాపుగల్లుకు చెందిన నర్రా వెంకటయ్య తన అవసరాల నిమిత్తం బ్యాంకుకు వచ్చి రూ.లక్ష విత్‌డ్రా చేశాడు. అనంతరం ఆయన అక్కడే కూర్చొని నగదును లెక్కిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడకు వచ్చాడు. అంకుల్ మీ నగదుకు సిరా అంటుకుంది, ఇవి బయట చెల్లవు.. ఓ సారి నేను లెక్కిస్తా అని మాయమాటలు చెప్పి అతడి దృష్టి మళ్లించి ఇరవై రెండు రూ.2వేల నోట్లను జేబులో పెట్టుకుని అక్కడ నుంచి జారుకున్నాడు. ఆ తర్వాత వెంటకయ్య మరోసారి లెక్కించగా నగదు తక్కువ ఉండడంతో లబోదిబో అంటూ వెళ్లి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై ఎస్‌ఐ క్రాంతికుమార్ కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment