కూసుమంచి/తిరుమలాయపాలెం(పాలేరు): ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పిడుగుపాటుకు నలుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో భార్యాభర్తలు ఉన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన దంపతులు జాలె మల్లేశ్ (25), విజయలక్ష్మి(22) మంగళవారం మిర్చి తోటకు మందు కొట్టేందుకు వెళ్లారు. ఈ లోగా వర్షం రావడంతో చెట్టుకిందికి వెళ్లారు. వారితో వెళ్లిన కూలీలూ అదే చెట్టుకిందికి రావడంతో భార్యాభర్తలు మరో చెట్టు కిందికి వెళ్లారు. ఆ చెట్టుపై పిడుగు పడటంతో ఇద్దరూ చనిపోయారు.
తిరుమలాయపాలెం మండలం ఎదుళ్లచెరువు పంచాయతీ పరిధిలోని రమణా తండాకు చెందిన బాదావత్ జగ్‌మాల్ (35) భూమి కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేస్తున్నాడు. భార్య భద్రమ్మ కలుపుతీస్తుండగా, జగ్‌మాల్ పశువులకు మేత వేస్తూ వేపచెట్టు కిందికి వెళ్లాడు. ఈ చెట్టుపై పిడుగు పడడంతో మృతి చెందాడు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం ఆంబోతుతండాకు చెందిన ఆంబోతు సుక్యా కుమారుడు అరవింద్(13) హైదరాబాద్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు రావడంతో స్వగ్రామానికి వచ్చాడు. మంగళవారం సాయంత్రం తండాలోని తమ పొలం వద్దకు వెళ్తుండగా వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగుపడి అరవింద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Published Wed, Sep 27 2017 3:30 AM | Last Updated on Wed, Sep 27 2017 3:30 AM
Advertisement