ఆదిలాబాద్ మార్కెట్ యార్డు
జీరో దందా జోరుగా కొనసాగడం..వ్యాపారులు జిమ్మిక్కులు ప్రదర్శించి సెస్ చెల్లించకపోవడంతో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆదాయం ఈ సారి దారుణంగా పడిపోయింది. ఉమ్మడి జిల్లాకు 2018–19 సంవత్సరానికి రూ.45.05 కోట్ల లక్ష్యం ఉండగా, కేవలం రూ.33.51 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. రూ.10 కోట్లకు పైగా ఏఎంసీలు ఆదాయాన్ని కోల్పోయాయి. బెల్లంపల్లి, చెన్నూర్, జన్నారం, జైనథ్ మినహాయిస్తే మిగతా 14 మార్కెట్ యార్డుల్లో లక్ష్యాన్ని చేరుకోవడం మాట అటు ఉంచితే అందుకోలేనంత దూరంలో ఉండటం గమనార్హం.
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో 18 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పంటల పరంగా ఆదాయం అధికంగా ఉండగా, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లోని మార్కెట్లలో కొంత తక్కువగా ఉన్నా కోట్ల రూపాయల్లోనే ఆదాయం లభిస్తోం ది. ప్రధానంగా పత్తి, సోయాబీన్, శనగ, కందులు, మొక్కజొన్న పంటల కొనుగోలు పరంగా మార్కెట్‌కు ఫీజు రూపంలో ఆదాయం ల భిస్తుంది. మార్కెట్‌లో పంటల కొనుగోలు జరిగినప్పుడు ఏఎంసీ యార్డులోనే తూకం జరిగిన తర్వాత వ్యాపారులు కొనుగోలు చేయాలి. తద్వారా వ్యాపారులు కొనుగోలు చేసిన పంట విలువలో ఒక శాతం సెస్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
అయితే ఇక్కడే వ్యాపారులు తమ జిమ్మిక్కులను ప్రదర్శించి సెస్‌ను దిగమింగుతున్నారు. మార్కెట్ యార్డులో తూకం జరగకుండానే నేరుగా వ్యాపారుల వద్దనే కొనుగోలు జరుగుతుండడంతో ఏఎంసీలకు వచ్చే ఆదాయానికి గండి పడుతోంది. ఇలా ట్రేడర్లు జీరో దందాను యథేచ్ఛగా నడుపుతున్నా దీనిని అరికట్టడంలో ప్రభుత్వ యం త్రాంగాలు విఫలమవుతున్నాయి. ఏటా ఈ వ్యవహారాలు ‘మామూలు’ అన్నట్లుగానే సాగిపోతున్నాయి. దళారులు, కమీషన్ ఏజెంట్లు రైతులను మభ్యపెట్టి వ్యాపారులతో ఉన్న సంబంధాల ఆధారంగా మార్కెట్ యార్డులో తూకం కాకుండా నేరుగా కొనుగోలు చేస్తున్నారు. రైతులు ఏటా సాగులో పెట్టుబడుల కోసం దళారులు, కమీషన్ ఏజెంట్ల వద్ద అప్పులు తీసుకుంటున్నారు. పంట చేతికి వచ్చాక అమ్ముకునే దశలో దళారులు, కమీషన్ ఏజెంట్ల చేతిలో చిక్కుకొని వారు చెప్పినట్లుగానే వ్యాపారులకు రైతులు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని మార్కెట్ యార్డులు ఈ సంవత్సరం పూర్తిస్థాయిలో సెస్‌ను రాబట్టడంలో విఫలమయ్యాయి.
రూ.10 కోట్లు వెనుక..
ఉమ్మడి జిల్లాకు 2018–19 సంవత్సరానికి రూ.45.05 లక్ష్యం ఉండగా, కేవలం రూ.33.51 కోట్లు మాత్రమే సాధించింది. రూ.10 కోట్లకు పైగా వెనుకబడింది. ప్రధానంగా ఆదిలాబాద్, భైంసా మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు అధికంగా సాగి ఆదాయం సమకూరుతోంది. అయితే ఈ రెండు మార్కెట్‌లోనే లక్ష్యాన్ని అందుకోలేనంత దూరంలో నిలిచిపోయాయి. ఆయా మార్కెట్లలో జీరో వ్యాపారం జోరుగా సాగడంతోనే మార్కెట్ ఆదాయానికి గండి పడిందన్న విమర్శలు లేకపోలేదు. జైనథ్, బెల్లంపల్లి, చెన్నూర్, జన్నారం వంటి చిన్న మార్కెట్లు లక్ష్యాన్ని మించి సాధించినప్పుడు ఆదిలాబాద్, భైంసాలలో నిత్యం పంట కొనుగోలు బండ్లతో కళకళలాడే మార్కెట్లు ఆదాయంలో వెనకబడటం విస్తుపోయేలా చేస్తుంది.
పత్తి ఆదాయమే ప్రధానం..
కందులు, శనగ, సోయాబీన్, జొన్నలకు ప్రభుత్వం ఎంఎస్‌పీ ఆపరేషన్ కింద మార్కెట్ ఫీజును మినహాయించింది. మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. దీంతో రైతులకు లబ్ధి చేకూరింది. తద్వారా ఆదాయం కొంత తగ్గే పరిస్థితి ఉన్నా రూ.10 కోట్లకుపైగా వెనకబడడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా పత్తి పంట ద్వారా మార్కెట్లకు అధిక ఆదాయం లభిస్తోంది. గడిచిన సంవత్సరం రైతుల నుంచి పత్తిని ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ కంటే ట్రేడర్స్ అధికంగా కొనుగోలు చేశారు. సీసీఐ నామమాత్రంగా కొనుగోలు చేసింది. ఈ లెక్కన మార్కెట్ యార్డులకు పెద్ద మొత్తంలో మార్కెట్ ఫీజు లభించాలి. కానీ ఆదాయం తగ్గింది. ఇది జీరో మార్కెట్‌ను ప్రస్పుటం చేస్తుంది. 2017–18లో లక్ష్యాన్ని మించి ఆదాయం లభించినప్పుడు 2018–19లో లక్ష్యానికి అందుకోలేనంత దూరంలో నిలిచిపోవడం మార్కెట్లలో జరుగుతున్న అక్రమాలను తేటతెల్లం చేస్తున్నాయి.
మార్కెట్ ఫీజు మినహాయింపుతోనే..
ప్రభుత్వం కనీస మద్దతు ధర ఆపరేషన్‌లో మార్కెట్ ఫీజును మినహాయించింది. కం దులు, శనగ, సోయాబీ న్, జొన్న పంటలకు ఈ మినహాయింపు వర్తించింది. మార్క్‌ఫెడ్, నా ఫెడ్‌లు కొనుగోలు చేశాయి. మార్కెట్ ఫీజు మినహాయించడంతోనే ఆదాయం తగ్గింది. – గజానంద్, డీఎంఓ, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment