హైదరాబాద్: తరచూ పర్యాటక శాఖ హోటళ్లలో విడిది చేసే వారికి ఖర్చుల్లో రాయితీ లభించనుంది. స్థానిక దేవాలయాల దర్శనాలకు వెళ్లినపుడు ప్రత్యేక దర్శనం ఉచితంగా కల్పించే బాధ్యతను పర్యాటక శాఖ తీసుకోనుంది. పర్యాటక శాఖ అధీనంలోని హరిత హోటళ్లకు గిరాకీ పెంచే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అమల్లో ఉన్న విధానాన్ని తెలంగాణలో కూడా వర్తింపచేయాలని నిర్ణయించింది.
మంగళవారం పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ఆ శాఖ జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాదాద్రి, భద్రాచలం, బాసర, కాళేశ్వరం, వేములవాడ వంటి ప్రముఖ దేవాలయాలకు వచ్చే భక్తులు పర్యాటక శాఖ హోటళ్లలో బసచేసే వారి దైవ దర్శన బాధ్యతను పర్యాటక శాఖే తీసుకుంటుందన్నారు. గిరిజన విద్యాసంస్థల్లోని విద్యార్థుల విజ్ఞాన, విహారయాత్రల వ్యయాన్ని గిరిజినాభివృద్ధి సంస్థ భరిస్తుందన్నారు. రాష్ట్రంలో బౌద్ధ ప్రాధాన్యమున్న ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకు ప్రత్యేకంగా బుద్ధ సర్క్యూట్ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చందూలాల్ వెల్లడించారు. రూ.200 కోట్లతో ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. స్వదేశీ దర్శన్ ప్రాజెక్టులో భాగంగా ట్రైబల్ సర్క్యూట్‌కు మొదటి విడతలో కేంద్రం విడుదల చేసిన రూ.17 కోట్లతో పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. మేడారం, లక్నవరం, తాడ్వాయి, దామరవాయి, ములుగు గట్టమ్మ దేవాలయం, మల్లూరు, బొగత జలపాతం తదితర ప్రాంతాల్లో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎకో టూరిజం ప్రాజెక్టు కింద సింగోటం, కొల్లాపూర్, శ్రీశైలం ప్రాజెక్టు ప్రాంతం, అక్కమహాదేవి గుహలు, మల్లెల తీర్థం ప్రాంతాల్లో కూడా పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
దర్శనం బాధ్యత ప్రభుత్వానిదే : చందూలాల్
Published Wed, Jul 27 2016 4:05 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
Advertisement
Advertisement