
ఎక్కడి నుంచైనా బస్ పాస్ రెన్యువల్
విద్యార్థినీ విద్యార్థులు ఇకపై తెలంగాణలోని ఏ డిపో నుంచి అయినా బస్ పాస్‌లను రెన్యువల్ చేసుకోవచ్చని స్థానిక ఆర్టీసీ
తాండూరు : విద్యార్థినీ విద్యార్థులు ఇకపై తెలంగాణలోని ఏ డిపో నుంచి అయినా బస్ పాస్‌లను రెన్యువల్ చేసుకోవచ్చని స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ డీఎం కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం ఆయన కంప్యూటర్ ద్వారా బస్ పాస్‌లను జారీ చేసే విధానాన్ని స్థానిక డిపోలో ప్రారంభించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల బస్‌పాస్‌ల జారీలో ఇప్పటి వరకు ఉన్న మ్యానువల్ విధానానికి ప్రభుత్వం స్వప్తి చెప్పి కంప్యూటరీకరణ చేసిందన్నారు. ఇకపై విద్యార్థులకు ఉచిత, రూట్, రాయితీ పాస్‌లతో పాటు అంగవైకల్యం కలిగిన వారికి కంప్యూటర్ ద్వారా బస్‌పాస్‌లను జారీ చేయనున్నట్లు వివరించారు. ఇందుకు ‘నెటెక్స్‌ల్ కంపెనీ’ సాంకేతిక పరికరాలను సమకూర్చిందని, వీరికే బస్‌పాస్‌ల జారీ బాధ్యతలు అప్పగించినట్టు ఆయన తెలిపారు.
బస్‌పాస్‌తో పాటు ఏడాది చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డును విద్యార్థులకు జారీ చేస్తామన్నారు. ప్రతి నెలా గుర్తింపు కార్డులోని బార్ కోడ్ ఆధారంగా పాస్ రెన్యువల్ చేయడం జరుగుతుందన్నారు. పాస్ రెన్యువల్ స్థానికంగా కాకుండా తెలంగాణలోని ఏ బస్టాండ్‌లోనైనా చేసుకోవచ్చని తెలిపారు. నకిలీల సమస్యల లేకుండా.. ప్రతి ఏడాది గుర్తింపు కార్డుల డిజైన్, రంగు మారుతుంటాయన్నారు. బస్‌పాస్ జారీ వివరాలన్నీ హైదరాబాద్‌లోని కేంద్ర సర్వర్‌లో అనుసంధానం అవుతాయన్నారు. సమావేశంలో ట్రాఫిక్ ఇన్‌చార్జ్ రామ్‌జీ, నెటెక్స్‌ల్ కంపెనీ ప్రతినిధి యశ్వంత్ పాల్గొన్నారు.